You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని మోదీకి అమెరికా ‘లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు’ - BBC Newsreel
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేతుల మీదుగా ప్రధానమంత్రి మోదీ తరఫున 'లెజియన్ ఆఫ్ మెరిట్' అవార్డును అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు అందుకున్నారు.
ఈ సందర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ. బ్రయాన్ ప్రధానమంత్రి మోదీని ట్విటర్‌లో అభినందించారు. "భారత అమెరికా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీకి 'లెజియన్ ఆఫ్ మెరిట్' అవార్డును ప్రదానం చేశారు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
"అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని 130 కోట్లమంది ప్రజల తరపున నేను పునరుద్ఘాటిస్తున్నాను. 21వ శతాబ్దం ఇరుదేశాలకు అనేక సవాళ్లనే కాదు, అవకాశాలను కూడా ఇచ్చింది" అని ఈ అవార్డుపై ట్విటర్‌లో ప్రధాని మోదీ స్పందించారు.
"లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డుతో నన్ను గౌరవించారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో ఇరుదేశాల ప్రజలకు దక్కిన గుర్తింపు ఇది'' అన్నారు ప్రధాని మోదీ.
భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా 'లెజియన్ ఆఫ్ మెరిట్' అవార్డు లభించింది. వారి తరఫున కూడా ఈ రెండు దేశాల రాయబారులు అవార్డును స్వీకరించారు.
ఈ అవార్డు స్వీకరించిన ఇతర భారతీయులు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముందు కూడా పలువురు భారతీయులకు ఈ గౌరవం లభించింది. వారు..
ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప- 1950 (డిగ్రీ-చీఫ్ కమాండర్)
జనరల్ ఎస్.ఎం. శ్రీగణేష్ - 1955 (డిగ్రీ-చీఫ్ కమాండర్)
జనరల్ రాజేంద్ర సింగ్‌జీ జడేజా - 1946 (డిగ్రీ- కమాండర్)
అడ్మిరల్ జె.ఎ.ఎల్. కుర్సెత్ జీ - 1978 (డిగ్రీ- కమాండర్)
జనరల్ బిక్రమ్ సింగ్ -2013 (డిగ్రీ- కమాండర్)
జనరల్ దల్బీర్ సింగ్ - 2018 (డిగ్రీ- కమాండర్)
పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి కరీమా బలోచ్ మృతి
పాకిస్తాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ మృతిపై విచారణ జరపాలని మానవ హక్కుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఆమె దేశం నుంచి బహిష్కరణకు గురవ్వడంతో కెనడాలోని టొరంటోలో నివసిస్తున్నారు.
37 సంవత్సరాల బలోచ్ పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారిణి. ఆమె పాకిస్తాన్ సైన్యాన్ని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించేవారు.
ఆమె ఆదివారం నుంచి కనిపించకపోవడంతో ఆమె గురించి టొరంటో పోలీసులు ప్రకటన చేశారు. ఆ తరువాత ఆమె మృత దేహం లభించినట్లు ఆమె స్నేహితులు చెప్పారు.
బలోచ్ 2016లో బీబీసీ 100 మంది స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో కూడా ఉన్నారు.
ఈమె ఆఖరు సారి టొరంటోలో బే స్ట్రీట్ లో కనిపించినట్లు టొరంటో పోలీసులు ట్వీట్ చేశారు. ఆ తరువాత ఆమె దొరికినట్లు ట్వీట్ చేశారు. కానీ, ఆ ట్వీట్లో మరే వివరాలు లేవు.
ఆమె మృత దేహమైతే లభించింది కానీ, ఆమె మరణానికి కారణం మాత్రం తెలియదని ఆమె స్నేహితులు, తోటి ఉద్యమకారులు చెబుతున్నారు.
"ఆమె మరణం ఆ కుటుంబానికి తీవ్రమైన విషాదాన్ని మిగల్చడమే కాకుండా జాతీయ ఉద్యమానికి కూడా తీవ్ర నష్టం కలిగించింది" అని ఆమె సోదరి మగంజ్ బలోచ్ బీబీసీ ఉర్దూతో అన్నారు.
"బహిరంగంగా ఉద్యమం చేయడం పాకిస్తాన్‌లో సాధ్యం కాకపోవడం వల్లే దేశం విడిచి పెట్టి వెళ్లారు కానీ, కావాలని కాదు" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)