ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం - విద్యా శాఖ మంత్రి సురేశ్ ప్రకటన - BBC Newsreel

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

కరోనా లాక్ డౌన్ నిబంధనలతో మూతపడిన పాఠశాలలను వచ్చే నెల 2వ తేదీ నుంచి తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని ఆయన చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించినట్టు గుర్తు చేసిన మంత్రి, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ తగ్గుదల ఉంటుందని తెలిపారు.

స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరవడానికి ఇప్పటికే ప్రభుత్వం పలు మార్లు ప్రకటనలు చేసింది.

కానీ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో పాఠశాలలు తెరవడానికి వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా తాకిడి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. పలు జిల్లాల్లో మరణాలు కూడా నమోదుకాకపోవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులు కూడా తెరిచి పాఠశాలలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడపాలనే నిర్ణయానికి వచ్చింది.

భౌతికదూరం పాటిస్తూ, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగు ఏర్పాట్లు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యాకానుక పథకంలో భాగంగా మళ్లీ విద్యార్థులు చాలాకాలం తర్వాత పాఠశాలల గడప తొక్కారు.

ఇక వచ్చే నెల నుంచి మళ్లీ తరగతులు ప్రారంభమయితే పాఠశాలల్లో సందడి కనిపిస్తుంది.

అయితే, కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో తమ పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపించే విషయంలో తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

KKR కెప్టెన్‌‌గా దినేశ్ కార్తీక్ ఔట్.. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ తప్పుకున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.

అతని స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు, ఆ దేశ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కేకేఆర్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

‘‘డీకే (దినేశ్ కార్తీక్), మోర్గాన్ ఇద్దరూ కలసి ఈ టోర్నమెంటులో చాలా బాగా పనిచేశారు. మోర్గాన్ ఇప్పుడు కెప్టెన్‌ అయినప్పటికీ, చేపట్టినప్పటికీ ఇది బాధ్యతలు మార్చుకోవడం మాత్రమే’’ అని కేకేఆర్ సీఈఓ, ఎండీ వెంకీ మైసూర్ వెల్లడించారు.

తాజా మార్పుతో శుక్రవారం అబుదాబిలో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు మోర్గాన్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.

కారణం ఏంటి?

బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు గాను కెప్టెన్ బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని దినేశ్ కార్తీక్ కోరినట్లు జట్టు యాజమాన్యం చెబుతోంది.

‘కెప్టెన్ పదవిని వదులుకోవాలనే నిర్ణయాన్ని ఎవ్వరూ అంత సులభంగా తీసుకోలేరు. జట్టు విజయాల కోసం దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు’’ అని వెంకీ మైసూర్ తెలిపారు.

2018 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ బాధ్యతలు చేపట్టాడు.

అప్పటి వరకూ కేకేఆర్ కెప్టెన్‌గా గౌతం గంభీర్ వ్యవహరించాడు.

దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించిన 2018 సీజన్‌‌లో కేకేఆర్ జట్టు మూడో స్థానంలోనూ, 2019వ సీజన్‌లో ఐదో స్థానంలోనూ నిలిచింది.

కాగా, కొత్తగా కేకేఆర్ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచింది.

‘‘2019 ప్రపంచకప్‌ను గెలిచిన కెప్టెన్.. ఇయాన్ మోర్గాన్ మావద్ద ఉండటం మా అదృష్టం’’ అని వెంకీ మైసూర్ తెలిపారు.

సంజయ్ దత్: 'అధీరాగా వస్తున్నా... క్యాన్సర్‌ను త్వరలోనే ఓడిస్తా'

దాదాపు రెండు నెలల బ్రేక్ తరువాత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన తదుపరి చిత్రం షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

'కేజీఎఫ్ - చాప్టర్ 2' చిత్రంలో అధీరా పాత్రతో త్వరలో సెట్స్‌లోకి వెళ్తున్నానని చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు.

అనారోగ్య కారణాలతో కొంత కాలం సినిమా షూటింగులకు దూరమైన ఈ 61 ఏళ్ల నటుడు తన హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీం సెలూన్లో రికార్డు చేసిన ఇటీవలి వీడియోలో తన ఎడమ కనుబొమ నుంచి తల మీదకు వేలు చూపిస్తూ, "ఇది నా జీవితంలో కొత్త గాయం. కానీ, దీన్ని నేను ఓడిస్తాను. ఈ క్యాన్సర్ నుంచి త్వరగానే కోలుకుంటాను" అని అన్నారు. ఆలిం హకీం ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఆగస్ట్ నెలలో శ్వాస సమస్యలు తలెత్తడంతో సంజయ్ దత్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ లేదని తేలింది. అయితే, ఆయన ఆరోగ్యానికి సంబంధించి లీలావతి ఆస్పత్రిలో ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ తరువాతే సంజయ్ తాను కొంత కాలం షూటింగులకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దాంతో, ఆయనకు క్యాన్సర్ సోకిందనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆలిమ్ హకీం వీడియోలో సంజయ్ తనకు క్యాన్సర్ ఉందని మొదటిసారి స్వయంగా ధ్రువీకరించారు.

బాలీవుడ్‌లో కాసుల పంట పండించే స్టార్లలో ఒకరుగా గుర్తింపు పొందిన సంజయ్ దత్ కెరీర్ అంతా ఉత్థాన పతనాలతోనే సాగింది. 1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 713 మంది గాయపడ్డారు. అయిదేళ్ల కారాగార శిక్షను పూర్తి చేయడానికి సంజయ్ దత్ 2013లో జైలుకు వెళ్లినప్పుడు ఆయన నట జీవితానికి బ్రేక్ పడింది.

అయితే, 2016లో జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన నటుడిగా తన కెరీర్‌ను విజయవంతంగా ప్రారంభించారు. సంజయ్ జీవిత కథతో రణబీర్ కపూర్ హీరోగా విడుదలైన 'సంజు' చిత్రం సూపర్ హిట్టయింది. మాదక ద్రవ్యాలతో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన బాహాటంగానే మాట్లాడేవారు. ఈ కష్టాలు, జైలు జీవితం తనను మరింత ధృఢంగా మార్చాయని ఆయన తరచూ చెబుతుండేవారు.

సంజయ్ దత్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు క్యాన్సర్‌తో చనిపోయారు. తల్లి నర్గీస్ పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో 1981లో తన కుమారుడి సినీ రంగ ప్రవేశానికి కొన్న రోజుల ముందే చనిపోయారు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ కూడా బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోయారు.

గత నెలలో సంజయ్ తన భార్య మాన్యతతో కలిసి దుబాయ్‌కి చికిత్స కోసం వెళ్లారు. ముంబయికి తిరిగి వచ్చిన తరువాత నలుపు రంగు టీషర్టులో ఉన్న తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. అధీరాగా రాబోతున్నా అని ప్రకటించారు.

కరోనావైరస్: ఫ్రాన్స్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ... ఒకే రోజు 30 వేల కేసులు

ఫ్రాన్స్ లో గురువారం 30,621 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఇక్కడ 22,591 కేసులు బయటపడ్డాయి.

కరోనా కేసులు పెరుగుతుండడంతో రాజధాని పారిస్‌ సహా చాలా నగరాల్లో శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రజల ప్రాణాలు కాపాడ్డానికి కఠిన ఆంక్షలు విధించడం అత్యంత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు పాటించాలని యూరప్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

శనివారం నుంచి లండన్‌లో ఇండోర్ కార్యక్రమాలపై కూడా నిషేధం విధించారు. లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కోవిడ్ హెచ్చరికలు జారీ చేశారు.

ఫ్రాన్స్, ఇటలీ, పోలెండ్, జర్మనీలో గురువారం భారీ స్థాయిలో పరీక్షలు జరగడంతో ఒకే రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

గురువారం రష్యాలో 286 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కరోనా వ్యాప్తి తర్వాత రష్యాలో ఒకే రోజు ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి.

యూరప్ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యూరప్‌లో రోజువారీ మరణాల సంఖ్య వెయ్యి దాటడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)