కరోనావైరస్: ప్రపంచంలో రెండో స్థానానికి భారత్.. కోవిడ్-19 కేసుల్లో ముందున్న అమెరికా

ప్రచురణ

గడచిన 24 గంటల్లో 90,000 కేసులు నమోదు కావడంతో ప్రపంచంలో అత్యధిక కేసుల్లో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భారత్‌ దాటేసింది. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 4,204,613 కేసులు నమోదు కాగా, 71,642 మంది మరణించారు. అత్యధిక మరణాలలో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

ప్రధానంగా ఐదు రాష్ట్రాలలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమక్రమంగా ఎత్తివేస్తుండటంతో కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గడచిన వారంరోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 75,000 కేసులు నమోదవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే 60% పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారంనాడు దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో 3,200 కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లో ఇక్కడ ఇవే అత్యధిక కేసులు.

పల్లెలకూ పాకుతున్న వైరస్

గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో అక్కడ కేసుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సుదూరంగా ఉండే అండమాన్‌ దీవుల్లోని గ్రేటర్‌ అండమానీస్‌ తెగలోని 10మందికి కూడా వైరస్‌ సోకింది. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అంచనా. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 లక్షల వరకు టెస్టులు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా రోజుకు 1,000 మంది చనిపోతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి నెలలో లాక్‌డౌన్‌ కారణంగా కేవలం వందల్లోనే కేసులు నమోదుకాగా, ఆగస్టు నెల వచ్చే సరికి 20లక్షల కేసులతో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం మొదలు పెట్టిన జూన్‌ నెల నుంచి కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

కోవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా క్షీణిస్తోంది. ఈయేడాది మార్చి నుంచి జూన్‌ వరకు సాగిన త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 23.9శాతం పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. 1996 తర్వాత వృద్ధిరేటులో ఇదే అతి పెద్ద పతనం.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)