మధ్యప్రదేశ్‌: జడ్జికి విషమిచ్చి చంపిన స్నేహితురాలు... కొడుకు మృతి, బయటపడ్డ భార్య -ప్రెస్ రివ్యూ

మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ

మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఓ మహిళ విషం కలిపి ఇచ్చిన చపాతీ తిని ఓ జడ్జి, ఆయన కుమారుడు మరణించగా, మరో కుమారుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ సహా పలుపత్రికలు ప్రధాన కథనంగా ఇచ్చాయి.

చింద్వారాలో పని చేస్తుండగా తనకు సన్నిహితుడైన ప్రస్తుత బేతుల్‌ జిల్లా అదనపపు సెషన్స్‌ జడ్జి మహేంద్ర కుమార్‌ త్రిపాఠీ ఈ మధ్య కాలంలో తనను పట్టించుకోవడం లేదని, దీనికి ఆయన కుటుంబమే కారణమన్న ఆక్రోశంలో ఉన్న సంధ్యాసింగ్‌ అనే మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంట్లో శాంతిపూజల విషయంలో సదరు జడ్జి తన స్నేహితురాలిని సలహా అడగ్గా ఇదే అదనుగా ఆమె తన కుట్రను అమలు చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. మాంత్రికుడి ద్వారా విషం కలిపిన గోధుమ పిండి పంపారని, దానితో తయరు చేసిన చపాతీలు తిని జడ్జి, ఆయన పెద్ద కుమారుడు మరణించారని వెల్లడించారు.

ఆ రోజు జడ్జి భార్య చపాతీలు కాకుండా అన్నం తినడంతో ఆమె ఈ ప్రమాదం నుంచి బైటపడ్డారు. సంధ్యాసింగ్‌ సహా ఈ కుట్రలో పాలుపంచుకున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ నియామకం - అర్ధరాత్రి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈనాడు పత్రిక రాసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ హరిచందన్‌ బిశ్వభూషణ్‌ పేరుతో ప్రకటన జారీ అయినట్లు ఈ కథనంలో తెలిపింది. ఈ మేరకు గెజిట్‌ను విడుదల చేయాలని అధికారులకు పంచాయితీరాజ్‌ శాఖ సూచించినట్లు పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌పై తుది తీర్పుకు లోబడి ఈ పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉండాలని సూచించింది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ వ్యవహారంలో గత కొద్దినెలలుగా అనేక పరిణామాలు జరిగాయి. ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ తీసుకురావడం, దీనిపై నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇవ్వడం, దీనిపై ఏపీ సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లడం, ఈలోగా తన పునర్నియామకం జరగలేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయడంలాంటి పరిణామాలన్నీ వరసగా జరిగాయి. చివరకు గవర్నర్‌ ఆదేశాలతో నియామకం వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు ఈనాడు రాసింది.

శ్రీశైలం ప్రాజెక్టు.. తెరుచుకున్న గేట్లు

ఎత్తిపోతల టెండర్లు ఆపండి- ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశాలు

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లఘించి రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు తప్పుబట్టిందని, తన ఆదేశాలను పెడచెవిన పెడుతూ జారీ చేసిన టెండర్లను నిలిపేయాలని ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ఇచ్చింది.

ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా ఏపీ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు ఈ కథనం పేర్కొంది. రాయలసీమఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపుపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేసిందని , వీటిపై ముందుకు పోవద్దని తాము ఇంతకు ముందు కూడా సూచించిన విషయాన్ని బోర్డు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. కేంద్ర జల సంఘం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టులపై ముందుకు పోవాలని, అప్పటి వరకు టెండర్ల ప్రక్రియను నిలిపేయాలని కోరినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కాల్చేసినట్లు ఫోన్‌ చేసి చెప్పండి - స్నానం చేసి దీపం ముట్టిస్తాం

కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో వరంగల్‌ ఎంజీఎంలో 9 మృతదేహాలు అనాథల్లా పడి ఉన్నాయన్న మీడియా కథనాలకు అధికారులు స్పందించి హడావుడిగా దహన సంస్కారాలు చేశారని ఆంధ్రజ్యోతి రాసింది.

అయితే, అందరినీ విడివిడిగా కాకుండా ఒక చితిపై నలుగురు చొప్పును చేర్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొంది. 9 మృతదేహాలలో ఒకదానిని బంధువులు తీసుకెళ్లగా, మిగిలిన వారికి అధికారుల అంత్యక్రియలు నిర్వహించారు.అయితే నలుగురిని ఒకే చితిపై దహనం చేయడం వారిని అవమానించడమేనని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా, తగినన్ని మౌలిక సదుపాయాలు లేక ఇలా చేయక తప్పలేదని మున్సిపల్ కమిషనర్‌ వెల్లడించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

మరోవైపు మృతదేహాలను తీసుకెళ్లడానికి కొందరు బంధువులు సుముఖత వ్యక్తం చేయడం లేదని, దహన సంస్కారాలు మీరే చేయండని అధికారులకు చెబుతున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. దహనం జరిగినట్లు ఫోన్‌ చేసి చెప్పండి..స్నానం చేసి దీపం ముట్టించుకుంటాం అని కొందరు కుటుంబ సభ్యులు అధికారులకు చెబుతున్నట్లు ఈ కథనంలో వెల్లడించింది.

ఇసుక రవాణా

లారీతో తొక్కించి చంపిన ఇసుక మాఫియా -రంగంలోకి తెలంగాణ అధికార పార్టీ నేత

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, తనకు ఎదురు తిరిగిన ఓ వ్యక్తిని లారీతో తొక్కించి చంపిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా తిర్మలాపూర్‌లో ఇసుక లారీల కిందపడి నర్సింలు అనే వ్యక్తి చనిపోయాడని ఈ కథనం వెల్లడించించి. అర్ధరాత్రి తన పొలం మీదుగా వెళుతున్న ఇసుకలారీని అడ్డుకునే ప్రయత్నం చేసిన నర్సింలును లారీతో తొక్కించి చంపారని సాక్షి వెల్లడించింది.

ఈ హత్యతో భగ్గుమన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ఆగ్రహంతో ఉన్న నర్సింలు కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు అధికారపార్టీకి చెందిన ఓ నేత రంగంలోకి దిగారని సాక్షి వెల్లడించింది. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూస్తానని ఆ నేత చెబుతున్నారని, అలాగే కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఆయనపై వస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)