You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ సీఎంగా కేటీఆర్... ఏ క్షణంలోనైనా పట్టాభిషేకం -ప్రెస్ రివ్యూ
సీఎం కేసీఆర్ పెట్టిన పరీక్షలన్నీ నెగ్గిన కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ ఆంధ్రప్రభ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
పాలనపైనా, పార్టీపైనా పట్టుపెంచుకున్న కేటీఆర్‌కు అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయనని, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల వరకు ఆయన పనితీరును అంతా మెచ్చుకుంటున్నారని, ఏ క్షణంలోనైనా ఆయన్ను ముఖ్యమంత్రిని చేయవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు ఈ కథనం పేర్కొంది.
సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని, ప్రస్తుత సంక్షోభ సమయం ఇందుకు కలిసి వచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగే అవకాశం ముందని ప్రగతిభవన్ వర్గాలు భావిస్తున్నట్లు ఆంధ్రప్రభ తన కథనంలో పేర్కొంది.
'వరవరరావును ఎన్‌కౌంటర్ చేస్తారేమో' - భార్య హేమలత
విరసం నేత వరవరరావును మానసికంగా చిత్రహింసలు పెట్టి చివరకు ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేస్తుందేమోనని వరవరరావు సతీమణి హేమలత అనుమానం వ్యక్తం చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నా ఆయన్ను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నట్లు ఈ కథనం పేర్కొంది. తనకు ఓపిక నశించిందని, తెలంగాణ సర్కారు వరవరరావు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం స్పందించడం లేదని హేమలత ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ ప్రారంభకుల్లో వరవరరావు ఒకరని, సార్ సార్ అంటూ మా ఇంటికి వచ్చి సలహాలు తీసుకున్న కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని హేమలత ఆరోపించారు. తన బహిరంగ లేఖకు కూడా సమాధానం లేదని ఆమె అన్నారు. వరవరరావు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని, ఆయన్ను హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించాలని హేమలత డిమాండ్ చేశారు.
భారత తూర్పు తీరంలో చీలిక
భారతదేశపు తూర్పు తీరంలో సుమారు 300 కి.మీ. పొడవైన చీలిక(ఫాల్ట్‌లైన్) ఉందని, దీనివల్ల భవిష్యత్తులో భూకంపాలు, సునామీలకు అవకాశం ఉంటుంటుదని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు ఈనాడు ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీరంలో దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఈ ఫాల్ట్‌లైన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. లక్షల సంవత్సరాలుగా నదుల నుంచి కొట్టుకు వచ్చిన మట్టి, రాళ్లు , ఇతర వ్యర్ధాలు దాదాపు 22 కి.మీ. ఎత్తున మేటవేసి ఉంటాయని, ఆ బరువు వల్ల ఒత్తిడి పడి ఈ ఫాల్ట్‌లైన్ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చీలిక 16 మిలియన్ సంవత్సరాల కిందటే ఏర్పడిందని, అప్పుడప్పుడు దీని ప్రభావం కనిపిస్తూనే ఉందని సైంటిస్టులు వెల్లడించారు.
విశాఖపట్నంతోపాటు తీరంలో ఉన్న పలు ప్రాంతాలకు భూకంపాలు, సునామీల ముప్పు ఉంటుందని, ముఖ్యంగా విశాఖ నగరానికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని, కానీ అది ఎప్పుడు ఉంటుందన్నది కచ్చితంగా చెప్పలేమని వారు చెబుతున్నారు. సముద్ర అధ్యయన సంస్థ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధన "జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టం సైన్స్''లో ప్రచురితమైంది.
కరోనాపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్
కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై ఆరాతీశారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి వాకబు చేశారని సాక్షి,ఈనాడు,ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలు కథనాలు ఇచ్చాయి.
కరోనా ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారన్న విషయాలను ప్రధాని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని ఈ కథనాలు పేర్కొన్నాయి.
నల్గొండలో ఆక్సిజన్ దొరక్క యువకుడి మృతి
నల్గొండ జిల్లాలో ఆక్సీజన్ కొరత కారణంగా ఓ యువకుడు నరకయాతన అనుభవిస్తూ తల్లి చేతుల్లోనే మరణించిన ఘటనపై సాక్షి ఓ కథనం ప్రచురించింది. ఆక్సీజన్ లేక కొట్టు మిట్టాడుతున్న ఆ వ్యక్తి అవస్థ వీడియో వైరల్ అయ్యింది. నల్గొండజిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారంనాడు జరిగిన ఈ ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమీషన్ సుమోటో కేసుగా స్వీకరిచిందని సాక్షి కథనం పేర్కొంది.
ఈ కథనం ప్రకారం యాదయ్య అనే వ్యక్తి ఆరోగ్యం బాగా లేక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. కాసేపటికి శ్వాస ఆడకపోవడంతో సిబ్బంది ఆక్సీజన్ అందించారు. కానీ కొద్దిసేపటికే ఆక్సీజన్ అయిపోవడంతో యాదయ్య ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన తల్లి ఆక్సీజన్ ఇవ్వాల్సిందిగా సిబ్బందిని , డాక్టర్లను బతిమాలినా ఎవరూ స్పందించలేదు. కొడుకు అవస్థలు చూసి తల్లి అతనికి సపర్యలు చేస్తుండగా, ఆమె చేతుల్లోనే యాదయ్య మరణించారు.
ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రోడ్డు మీదే కాటేసిన కరోనా
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా బాధితుడైన ఓ వ్యక్తి రోడ్డు మీదే కుప్పకూలి చనిపోయారని, కానీ కరోనా భయంతో అటు బంధువులు, ఇటు స్థానికులు నాలుగు గంటలపాటు ఆ శవాన్ని అక్కడే వదిలేశారని ఈనాడుతోపాటు పలుపత్రికలు కథనాలు ప్రచురించాయి.
ఈ కథనాల ప్రకారం సత్తెనపల్లికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయాసంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇల్లు దాటి నాలుగు అడుగులు వేసేలోగానే కుప్పకూలి అక్కడికక్కడే మరణించారు.
సాయం చేయాలని కుమార్తెలు, బంధువులు కేకలు వేసిన ఎవరూ ముందుకు రాలేదు. ఆ వ్యాపారి చనిపోయి మృతదేహం నాలుగు గంటలపాటు రోడ్డు మీదే పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పురపాలక సంఘం సిబ్బంది సాయంత్రం ఐదుగంటలకు మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్‌కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)