పారిస్‌లో నలుగురు సహచరులను పొడిచి చంపిన పోలీస్

ప్రచురణ

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ నడిబొడ్డున పోలీస్ కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో నలుగురు సహచర పోలీసులను మరో పోలీసు కత్తితో పొడిచి చంపేశాడని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. అతడిని తర్వాత ఓ పోలీసు అధికారి కాల్చి చంపారు.

అతడి పేరు వెల్లడి కాలేదు. దాడికి కారణాలపై అధికారిక ప్రకటనేదీ ఇంకా రాలేదు. పారిస్ మధ్య ప్రాంతంలోని ఇల్ డే లా సైట్లో గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులపై హింస పెరుగుతుండటం, పనిగంటలు, వనరుల కొరత, వివాదాస్పద పెన్షన్ సంస్కరణలకు సంబంధించి వేల మంది పోలీసులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదరు ఉద్యోగి భవనంలోని తన కార్యాలయానికి వెళ్లి సహచరులపై కత్తితో దాడి చేశాడని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. అతడు రెండు ఆఫీసుల్లో ముగ్గురిని, మెట్లపై మరో ఇద్దరు మహిళలను పొడిచాడని చెప్పింది.

మృతుల్లో ముగ్గురు మగవారు, ఒక మహిళ ఉన్నారు. వీరు అధికారులు, పరిపాలనా సిబ్బంది. దాడిలో ఇంకో మహిళ గాయపడ్డారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ప్రధానమంత్రి ఎడ్వర్డ్ పిలిప్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

ప్రఖ్యాత నాట్రడామ్ కేథడ్రల్ చర్చి, ఇతర పర్యటక ప్రదేశాలకు సమీపంలోనే ఫ్రాన్స్ పోలీసు కేంద్ర కార్యాలయం ఉంది.

దాడికి పాల్పడిన ఉద్యోగి వయసు 45 సంవత్సరాలని, అతడు ఐటీ నిపుణుడని, 16 ఏళ్లుగా పారిస్ పోలీసులకు సేవలందిస్తున్నాడని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టోఫ్ కాస్టనర్ చెప్పారు.

అతడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడని అధికారులు తెలిపారు.

అతడికీ, అతడి సూపర్‌వైజర్‌కూ మధ్య విభేదాలు ఉన్నాయని పోలీసు సంఘానికి చెందిన క్రిస్టోఫ్ క్రెపిన్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)