మారుపేర్లతో 12 ఏళ్ల బాలికలా నటిస్తూ మోసాలకు పాల్పడిన 37 ఏళ్ల మహిళ,ఈ మోసం ఎలా బయటపడిందంటే..?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

తాను 12 ఏళ్ల అమ్మాయినని, వేధింపుల నుంచి తప్పించుకున్నానని, ఒంటరిదాన్నంటూ ఓ బాలిక సహాయాన్ని అర్థించినప్పుడు బ్రెజిల్ ప్రజలు చలించిపోయారు.

కానీ, బ్రెజిల్‌ అధికారులు మాత్రం 'గాబ్రియేల్' గురించి ఓ భిన్నమైన వాస్తవాన్ని బయటపెట్టారు. ఆమె ఆటిజంతో బాధపడుతున్న నిస్సహాయురాలైన చిన్నారిగా నటిస్తున్న 37 ఏళ్ల మహిళ అని, మారుపేర్లతో మోసానికి పాల్పడిందని వెల్లడించారు.

కోర్టు పత్రాలలో ఆమె అసలు పేరు అమాండా మరియా సౌజా డి ఆలివేరాగా పేర్కొన్న పోలీసులు , తప్పుడు గుర్తింపు వాడుతూ మోసానికి పాల్పడిన ఆరోపణల కింద ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈ నెల 3న పోలీసులు తెలిపారు. మారు పేరుతో ఆమె ఒక కుటుంబంతో 14 నెలల పాటు జీవించిందని దర్యాప్తు అధికారులు చెప్పారు.

బ్రెజిల్‌లో ఈ కేసు పతాక శీర్షికలలో నిలిచింది. శావోపాలో, రియో డి జెనీరో, మినాస్ గెరైస్, రియో గ్రాండే డో సుల్, గోయాస్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఆమె ఇదే తరహా మోసాలకు పాల్పడిందనే అనుమానాలున్నాయని పోలీసులు చెప్పారు.

''చిన్నారి అనే నమ్మకాన్ని కలిగించడానికి, ఈ నిందితురాలు పిల్లల్లా ప్రవర్తించడం రోజూ పాల సీసాలు, బొమ్మలు వాడేవారు'' అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘తను పెద్దదానిలా కనిపించడానికి చిన్నతంలో బలవంతంగా తీసుకున్న హార్మోన్లే కారణమని చెప్పేవారు’’ అని పోలీసులు తెలిపారు.

మానసిక ఆరోగ్య పరీక్షల కోసం అభ్యర్థన

ఆమెను చేరదీసిన కుటుంబానికి చెందిన ఓ బంధువు ఆన్‌లైన్‌లో దాదాపుగా అదే తరహా కేసు గురించి వార్తలను చూసిన తర్వాత అనుమానం వచ్చాక ఈ మోసం వెలుగులోకి వచ్చిందని దర్యాప్తు అధికారి రోడ్రిగో గుస్సో బీబీసీ న్యూస్ బ్రెజిల్‌కు తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లోని పోలీసులతో కూడా నిర్థరించుకున్న తరువాత .. ఇలా మోసం చేస్తున్న మహిళ ఆమెనని గుస్సో ధ్రువీకరించారు.

అరెస్ట్ చేసిన తర్వాత అనుమానితురాలు ఈ మోసాన్ని ఒప్పుకున్నారు, అదేపనిగా అబద్ధం చెబుతూ తాను ఈ పనికి పాల్పడినట్లు అంగీకరించారని గుస్సో చెప్పారు.

''ఆమెలో నేరపూరిత ఉన్మాదానికి సంకేతాలుగా భావించే ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆమె చాలా వివేకంతో, సహకార ధోరణితో, తార్కిక ఆలోచనతో ప్రవర్తించారు" అని గుస్సో బీబీసీ న్యూస్ బ్రెజిల్‌తో చెప్పారు.

ఆలివేరా మానసికస్థితిని తెలుసుకోడానికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థించగా,అనుమతి లభించిందని నిందితురాలి న్యాయవాది రాఫెల్ లూయిజ్ సీవర్ట్ బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో చెప్పారు.

తదుపరి న్యాయపరమైన చర్యలను నిర్ణయించడానికి తాను ఈ పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్నానని పేర్కొన్నారు.

‘‘ఆమె కథ విని భయమేసింది’’

ఆటిజంతో బాధపడుతున్న, వేధింపులకు గురైన పిల్లలకు మద్దతు ఇచ్చేందుకు రియో డి జెనీరోలో దాతృత్వ సంస్థ నడుపుతున్న ఇద్దరు మహిళలు బీబీసీతో మాట్లాడుతూ.. ఇదే మహిళ 2023లో మారుపేరుతో తమని మోసం చేసిందని చెప్పారు.

హ్యాండ్స్ దట్ బ్లెస్ విత్ లవ్ అనే సంస్థను నడిపే వెవియాన్ హెన్రిక్స్ మాట్లాడుతూ తమ సంస్థ సోషల్ మీడియా పేజీ ద్వారా ఆలివేరా తమను సంప్రదించి, తనను తాను 'డూడా'గా పరిచయం చేసుకుందని తెలిపారు.

ఈశాన్య రాష్ట్రమైన సియారాలో వేధింపుల నుంచి తప్పించుకున్నట్టు ఆలివేరా చెప్పారని హెన్రిక్స్ పేర్కొన్నారు.

తండ్రి తనను వ్యభిచారంలోకి దించాలని బలవంతం చేశారని, హార్మోన్ చికిత్సలు ఇప్పించారని ఆలివేరా ఆరోపించినట్లు తెలిపారు. దీనివల్ల తనకు పెద్దల రూపురేఖలు వచ్చినట్లు తెలిపిందని వివరించారు.

''ఆమె తన కథ చెప్పినప్పుడు, చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కేసులను అప్పటికే నేను డీల్ చేస్తున్నాను'' అని హెన్రిక్స్ చెప్పారు.

‘‘చేరదీసి, చేరువయ్యాం’’

ఆలివేరా చెప్పిన విషయాలు విన్న తర్వాత ఎంతో చలించిపోయిన వెవియాన్ హెన్రిక్స్, ఆమె సహోద్యోగి రెనాటా మగాల్హేసెస్.. ఒక చిన్న ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఆలివేరాను చూసుకోవడం ప్రారంభించారు.

''ఆమె అచ్చం టీనేజర్‌ మాదిరే కనిపించేది'' హెన్రిక్స్ చెప్పారు. ''చాలా చిన్నపిల్లలాగా మాట్లాడేది. ఆమెకు ఆటిజం ఉందని చెప్పేది. ఎల్లప్పుడూ హుడీ ధరించేది'' అని తెలిపారు.

నెల తర్వాత.. ఈ ఇద్దరు మహిళలు ఆమెతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకున్నారు.

''ఆలివేరా అచ్చం చిన్నపిల్లలానే ప్రవర్తించేది. పాలసీసా, పిల్లల ఆహారాన్ని అడిగేది. కానీ, ఎప్పుడూ డబ్బులు అడగలేదు'' అని వారు తెలిపారు.

మళ్లీ సియారాకు తిరిగి పంపించేస్తారనే భయంతో, బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లవద్దని కూడా అమాండా బతిమాలిందని మగాల్హేసెస్ తెలిపారు.

ఆమె చెప్పిన కథను నిజమేనని నమ్మేలా తన శరీరంపై కలచివేసేలా ఉన్న గుర్తులను కూడా చూపిందని ఆ మహిళలు చెప్పారు.

ఆమెను ఎక్స్‌-రే కోసం తీసుకెళ్లామని, ఆమె శరీరంలో 200కి పైగా సూదులు గుచ్చిన గుర్తులు కనిపించాయన్నారు.

చేతబడి ఆచారాలతో తనపై వేధింపులకు పాల్పడే తన తండ్రే వాటిని తన శరీరంలోకి గుచ్చాడని ఆలివేరా చెప్పినట్లు వారు తెలిపారు.

''అది చాలా భయంకరంగా ఉంది'' అని మగాల్హేసెస్ చెప్పారు.

''నేను ఆమెకు ప్రేమ ఆప్యాయతలు పంచి, తిండి పెట్టాను. అనుమానించడానికి ఎలాంటి కారణం కనిపించలేదు'' అని మగాల్హేసెస్ తెలిపారు.

అనుమానం ఎప్పుడొచ్చింది?

తను ఎవరితో ఉందో దాన్ని బట్టి ''డూడా'' భిన్నంగా ప్రవర్తించడం మొదలు పెట్టడంతో ఆందోళనలు పెరిగాయి.

మగాల్హేసెస్ ప్రకారం.. ఆమె మానసికంగా ఇతరులపై ఆధారపడటం మొదలుపెట్టారు. ఒంటరిగా వదిలేస్తే తనకు తాను హాని చేసుకుంటానని బెదిరించేవారు. నిరంతరం తనను చూసుకోవాలని కోరుకునేవారు.

''నా మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది. నన్ను నా పిల్లలకు దూరం చేసేంతగా ఆమె నాపై ఒత్తిడి తెచ్చింది" అని మగాల్హేసెస్ ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ, తనతో ఉన్నప్పుడు ఆలివేరా ప్రవర్తన సాధారణంగానే ఉండేదని హెన్రిక్స్ చెబుతున్నారు.

ఇది ఆమెపై అనుమానాన్నిపెంచింది. ఈ మహిళలు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పోలీసులే ఆలివేరా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత అధికారులు ఆలివేరా ఫోన్‌లో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన విషయాలను చూశారు.

దానిలో ''ఆటిజం ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు?'', ''వేధింపు బాధితురాలిగా ఎలా ఉంటారు?'' వంటి విషయాలు ఉన్నట్లు రియోలో ఈ కేసును చూస్తున్న ఇన్వెస్టిగేటర్ మోనికా అరియల్ బీబీసీకి చెప్పారు.

అరెస్ట్.. విడుదల

ఆలివేరాను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో తాను చేసిన మోసాన్ని ఆమె అంగీకరించారు

అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతున్నంత కాలం ఆమె జైలు బయటే ఉండవచ్చని కోర్టు నిర్ణయించింది.

ఆ తర్వాత ప్రాసిక్యూటర్లు ఆమెపై అభియోగాలు దాఖలు చేశారు. కానీ, ఆమె ఎక్కడ ఉందో అధికారులు గుర్తించలేకపోయారు.

మోసాన్ని న్యాయస్థానాలు హింస లేదా తీవ్రమైన ముప్పుతో సంబంధం లేని నేరంగా పరిగణిస్తుండటంతో, ఇలాంటి కేసుల్లో నిందితులను అదుపులో ఉంచడం కష్టమని అరియల్ పేర్కొన్నారు.

ఇతరులు కూడా అదే తరహా మోసానికి బాధితులుగా మారడాన్ని చూసి తాను నిస్సహాయతకు గురవుతున్నానని, తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మగాల్హేస్ చెప్పారు.

కానీ, ''ఆమెను అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. ఆలివేరాకు మానసిక శస్త్ర చికిత్స అవసరమని నమ్ముతున్నట్లు'' మగాల్హేస్ తెలిపారు.

ఈ అనుభవం ఎదురైనప్పటికీ, ఆపదలో ఉన్న పిల్లలకు మద్దతుగా తన పని కొనసాగిస్తానని హెన్రిక్స్ చెప్పారు

''నేను సహాయం చేయాలనే నా సంకల్పానికి ఇది అడ్డుకాదు '' అని నొక్కిచెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)