అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని 14 పాయింట్లలో ఏముంది?

    • రచయిత, బెర్న్‌డ్ డెబ్స్‌మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణను పొడిగించేందుకు కుదిరిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని, అది అమల్లోకి వచ్చిందని వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి బీబీసీకి ధ్రువీకరించారు.

ఫ్రాన్స్‌లోని ఎవియన్‌-లె-బెయిన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కీలకమైన హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవనున్నారు.

14 అంశాలతో కూడిన అవగాహనా ఒప్పందం (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని స్పష్టం చేయడంతో పాటు, ఆ దేశ ''పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి'' కోసం 300 బిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. అయితే ఇందుకు అమెరికా తప్పనిసరిగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

అమెరికా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మధ్య నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఘర్షణల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందాన్ని ట్రంప్‌ ప్రభుత్వం "పనితీరు ఆధారమైనది"గా అభివర్ణించింది. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్‌ అమలు చేసినప్పుడే దానికి ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంది.

ఒప్పందంలోని విషయాలు గమనిస్తే పలు అంశాలలు సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. అనేక కీలక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఒప్పందంలోని ప్రధాన అంశాలేంటంటే...

పాయింట్ 1: అన్నివిధాలుగా ఘర్షణలకు ముగింపు

అమెరికా, ఇరాన్‌ వాటి మిత్రదేశాలు లెబనాన్‌ను కూడా కలుపుకొని అన్ని విధాలుగా సైనిక కార్యకలాపాలను "తక్షణమే, శాశ్వతంగా" నిలిపివేస్తాయని పేర్కొన్నారు.

హెజ్బొల్లాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యలు ఇరాన్‌తో కుదిరిన ఒప్పందానికి విఘాతం కలిగించవచ్చనే ఆందోళన ట్రంప్‌లో పెరుగుతోంది.

మరోవైపు, లెబనాన్‌ కూడా కాల్పుల విరమణ ఒప్పంద పరిధిలో ఉండాలని తాము ఆశిస్తున్నామని తెహ్రాన్‌ పలుమార్లు స్పష్టం చేసింది.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఎలాంటి మిలటరీ ఆపరేషన్లు కొనసాగించినా అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేనని, అవసరమైన ప్రతిచర్యలు ఉంటాయని ఇరాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి చెప్పారు.

ఇకపై ఏ పక్షమూ ఒకదానిపై మరొకటి సైనిక చర్యలకు పాల్పడకూడదని, బెదిరింపులకు దిగకూడదని, అలాగే లెబనాన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

ఈ ఒప్పందం సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు పలుకుతుందని డాక్యుమెంట్‌లో ఉంది.

ఈ అంశంపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

పాయింట్ 2: అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కూడదు

అమెరికా అధికారులతో జరిగిన టెలిఫోన్‌ సమావేశంలో పాత్రికేయులకు యథాతథంగా చదివి వినిపించిన ఒప్పంద అంశాలమేరకు సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా, ఇరాన్ పరస్పరం గౌరవించుకుంటాయని ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోరని పేర్కొన్నారు.

ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు దీన్ని స్వాగతించకపోవచ్చు.

ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పలు నగరాలకు విస్తరించిన సమయంలో నిరసనకారులకు ''తాము అండగా ఉంటామని"ట్రంప్‌ హామీ ఇచ్చారు.

పాయింట్ 3: గడువు పొడిగించే అవకాశం

ఒప్పందంలోని మూడో అంశం మేరకు అమెరికా, ఇరాన్‌లు గరిష్ఠంగా 60 రోజుల్లో తుది ఒప్పందంపై చర్చలు పూర్తి చేసి, దానిని ఖరారు చేసేందుకు కట్టుబడి ఉంటాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

ఇరు దేశాల నాయకులు అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయడంతో ఆ 60 రోజుల గడువు ప్రారంభమైంది.

బుధవారం రాత్రి ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌ ప్యాలెస్‌లో జీ7 సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ట్రంప్‌ ఇరాన్‌కు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు వైట్‌హౌస్‌ బీబీసీకి తెలిపింది.

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ కూడా ఆ ఒప్పందంపై సంతకం చేసినట్లు వెల్లడించింది.

పాయింట్ 4: దిగ్బంధనానికి అమెరికా ముగింపు

అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తికాగానే నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం అమెరికా మొదలుపెడుతుంది. ఇరాన్ పోర్టుల నిర్వహణకు ఉన్న ఆటంకాలను కూడా తొలగిస్తుంది. ఒప్పందంలోని నాలుగో పాయింట్‌లో ఇది రాసిఉంది.

ఒప్పందం ప్రకారం దిగ్బంధనం తొలగింపు 30రోజుల్లో పూర్తవుతుంది. ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఇదే విషయం వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా అనుమతించే నౌకల సంఖ్య హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ పునరుద్ధరించే నౌకాయాన రద్దీకి అనుగుణంగా ఉంటుంది.

తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30రోజుల్లోపు ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరిస్తుంది.

ఆచరణలో దీని అర్థం ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభం కావడానికి ముందు ఉన్న స్థాయికి అమెరికా తన సైనిక మోహరింపులను, ఆయుధ సామగ్రిని పరిమితం చేయడం.

పాయింట్ 5: హార్ముజ్ జలసంధి

అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్ సాధ్యమైన అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. ఇందుకోసం ఎలాంటి రుసుమూ వసూలు చేయదు.

యుద్ధం మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధి మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో జలసంధిని మళ్లీ తెరవడం అమెరికా కీలకలక్ష్యంగా మారింది.

సాంకేతిక, మిలటరీ అవరోధాలను తొలగించి మందుపాతరలు నిర్వీర్యం చేయడం లాంటి చర్యలను పరిగణనలోకి తీసుకుంటూనే హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను తక్షణమే పునరుద్దరిస్తామని డాక్యుమెంట్‌లో ఉంది.

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరంలేదని ఒప్పందం వివరాలను వెల్లడిస్తూ అధికారులు స్పష్టం చేశారు.

దీర్ఘకాలంలో హార్ముజ్‌ జలసంధి నిర్వహణకు సంబంధించిన విస్తృత ఒప్పందాన్ని రూపొందించేందుకు ఒమన్‌తో పాటు ఇతర గల్ఫ్‌ దేశాలతో కలిసి పనిచేస్తామని ఇరాన్‌ పేర్కొంది.

ఇరాన్‌ తన హక్కులను దూకుడుగా వినియోగించే అవకాశం ఉందని అమెరికా భావిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో జలసంధి వినియోగానికి రుసుములు విధించే వ్యవస్థను గల్ఫ్‌ దేశాలు ఎప్పటికీ అంగీకరించవని ఓ అధికారి తెలిపారు.

పాయింట్ 6: ఇరాన్ పునర్నిర్మాణం కోసం నిధులు

ఇరాన్‌ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్‌ డాలర్ల విలువైన సమగ్ర ప్రణాళికను అమెరికా, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు కలిసి రూపొందిస్తాయని ఒప్పందంలోని 6వ పాయింట్ చెబుతోంది.

తుది ఒప్పందం కుదిరిన 60 రోజుల్లోపు ఈ నిధుల అమలు విధానంపై నిర్ణయం తీసుకుంటారు. దీనికి అవసరమైన అన్ని అనుమతులు, మినహాయింపులు, లైసెన్సులను అమెరికా మంజూరు చేస్తుంది. అంటే దీనర్థం అమెరికా ఆర్థికంగా భాగస్వామి అవుతుందని కాదు.

ఇరాన్‌కు ఒక్క రూపాయి కూడా అమెరికా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎలాంటి నిధులూ కేటాయించాల్సిన అవసరంలేదని ఓ అధికారి చెప్పారు.

ఉదాహరణకు, ఇరాన్‌ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే, అమెరికా ఆమోదంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధికారులు ఇరాన్‌లో విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించవచ్చని ఆయన తెలిపారు.

ఇరాన్‌కు అమెరికా నేరుగా నిధులు చెల్లించదనే విషయాన్ని ట్రంప్‌తో పాటు ఇతర అధికారులు అమెరికా ప్రజలకు పదేపదే స్పష్టం చేస్తున్నారు.

2015లో ఒబామా ప్రభుత్వంతో ఇరాన్‌ కుదుర్చుకున్న అణు ఒప్పందంతో పోలిస్తే ప్రస్తుత వ్యవహారం పూర్తిగా భిన్నమని ట్రంప్‌ ప్రభుత్వం చెబుతోంది.

పాయింట్ 7: ఆంక్షల ఎత్తివేత

ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాల కింద విధించిన ఆంక్షలతో పాటు, అమెరికా ఏకపక్షంగా అమలు చేసిన ఆర్థిక ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడానికి అమెరికా అంగీకరించింది.

అయితే ఇవన్నీ ఎప్పటిలోపు జరుగుతాయనేదానిపై స్పష్టత లేదు.

తుది ఒప్పందంలో భాగంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని పత్రంలో పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని తదుపరి చర్చల్లో "తక్షణమే" పరిష్కరించే ఉద్దేశంతో ఇరు పక్షాలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

ఆంక్షల కారణంగా ఇరాన్‌ తీవ్రంగా దెబ్బతింది. అలాగే ఆపరేషన్‌ ఎకనామిక్‌ ఫ్యూరీ'పేరుతో అమెరికా చర్యల ద్వారా తెహ్రాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేయడానికి ప్రయత్నించారు.

పాయింట్ 8: అణ్వాయుధాలకు నో

అణ్వాయుధాలను కొనుగోలు చేయమని, సమకూర్చుకోమని ఇరాన్‌ అంగీకరించింది. అలాగే ప్రస్తుతం తెహ్రాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యూరేనియానికి సంబంధించి ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.అయితే ఆ యురేనియాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

దీనికి సంబంధించిన విధానాన్ని తదుపరి చర్చల్లో పరస్పర అంగీకారంతో నిర్ణయిస్తామని పత్రంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో కనీసం దాని శుద్ధి స్థాయిని తగ్గించే ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు.

ఇది కనీస స్థాయి అని, అమెరికాకు భారీ విజయమని సీనియర్ అమెరికా అధికారి అభివర్ణించారు.

ఈ ఏడాది ప్రారంభంలో మొదలుపెట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ' ప్రధాన లక్ష్యాల్లో 99 శాతం వరకు ఇరాన్‌ అణ్వాయుధాలను కలిగి ఉండకుండా చేయడమేనని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఒప్పందాన్ని పనితీరు ఆధారమైనదిగా పేర్కొన్న అమెరికా, ఏడో అంశంలో ప్రస్తావించిన ఆంక్షల సడలింపును ఎనిమిదో అంశంలోని నిబంధనలను ఇరాన్‌ పాటించడానికే ముడిపెట్టింది.

పాయింట్లు 9,10: యథాతథస్థితి

శుద్ధిచేసిన యురేనియం సమస్యకు పరిష్కారం లభించే వరకు ఇరాన్‌ అణు కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న యథాతథ పరిస్థితినే కొనసాగించేందుకు అమెరికా, ఇరాన్‌ అంగీకరించినట్లు ఈ రెండు అంశాల్లో పేర్కొన్నారు.

ఆచరణలో దీని అర్థం, అమెరికా కొత్త ఆంక్షలను విధించదు.

అదే సమయంలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులతో పాటు బ్యాంకింగ్‌ లావాదేవీలు, రవాణా వంటి అనుబంధ సేవలకు మినహాయింపులు మంజూరు చేస్తుంది.

పాయింట్ 11: జప్తు చేసిన నిధులు, ఆస్తుల విడుదల

ఈ అంశమే చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది.

ఎన్నో ఏళ్లుగా స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్‌ పట్టుబడుతూ వచ్చింది. ఇది ఆ దేశానికి మరో ఆర్థిక జీవనాధారంగా మారుతుందని భావిస్తోంది.

అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే, స్తంభింపజేసిన లేదా పరిమితులకు లోబడి ఉన్న నిధులను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందని పదకొండో అంశంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తదుపరి చర్చల్లో ఖరారు చేస్తారు.

ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా ఇరాన్‌ వ్యవహరిస్తే, ముఖ్యంగా శుద్దిచేసిన యురేనియం సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభిస్తే, అవగాహన ఒప్పందానంతర చర్చలు కొనసాగుతున్న సమయంలోనే కొన్ని ఆస్తులను విడుదల చేస్తామని అమెరికా అధికారి బుధవారం పాత్రికేయులకు తెలిపారు.

పాయింట్లు 12 to14: తుది చర్చలు, పర్యవేక్షణ

ఒప్పంద అమలు ఎలా సాగుతుందన్న దానికి సంబంధించిన విధివిధానాలను చివరి మూడు అంశాలు వివరిస్తున్నాయి.

అవగాహన ఒప్పందం అమలు, భవిష్యత్తులో కుదిరే తుది ఒప్పంద నిబంధనల అమలును పర్యవేక్షించడానికి అమెరికా, ఇరాన్‌లు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. అయితే అది ఆచరణలో ఎలా ఉంటుందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయి, అమలు ప్రారంభమైన తర్వాత తుది ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్‌లు చర్చలు ప్రారంభిస్తాయి.

చివరిగా, తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి కట్టుబడిన తీర్మానం ద్వారా ఆమోదం లభిస్తుందని అవగాహన ఒప్పందంలో స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)