యుద్ధం మొదలయ్యాక మాస్కోపై యుక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్, మిసైల్ దాడి ఇదేనా?- 9 ఫోటోలు..

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తర్వాత రష్యా రాజధాని మాస్కో మీద అతి పెద్ద దాడి చేసింది.

దాదాపు 200 డ్రోన్‌లు రష్యా రాజధాని చుట్టూ ఉన్న లక్ష్యాలపై దాడి చేయడంతో, దట్టమైన పొగ మేఘాలు ఆకాశంలో విస్తరించి కనిపించాయి.

ఈ దాడుల్లో మాస్కో ప్రాంతంలో 17 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ చెప్పారు.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,000 డ్రోన్‌లు, నాలుగు యుక్రేనియన్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.

ఆగ్నేయ మాస్కోలోని కపోట్న్యా రిఫైనరీపై నెల రోజుల వ్యవధిలో మూడోసారి, ఈ వారంలో రెండోసారి దాడి జరిగింది. తాజాగా జరిగిన దాడితో మంటలు చెలరేగి, పొగతో ఆకాశం నల్లగా మారిపోయింది.

పేలుడు ధాటికి భారీ చమురు నిల్వ ట్యాంక్ మూత పదుల మీటర్ల ఎత్తుకు ఎగిరిపోయిన దృశ్యాలు అనేక వీడియోలలో కనిపించాయి.

గత వారం కీయెవ్‌పై రష్యా జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ భారీ డ్రోన్ దాడి జరిగిందని, ఆ దాడిలో ఒక ప్రధాన మతపరమైన ప్రదేశం తగలబడిపోయిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.

డ్రోన్ దాడుల అనంతర చిత్రాల ప్రచురణను అధికారులు నిషేధించారు.

అయితే పట్టపగలు ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ, మాస్కో శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలపై పేలుళ్లు జరుగుతున్నట్లు చూపిస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.

వైమానిక దాడులు ప్రారంభించడానికి ముందు, వైమానిక రక్షణల సాంద్రత, బలహీన ప్రాంతాలను గుర్తించడానికి పెద్ద సంఖ్యలో గూఢచార ఎర డ్రోన్‌లను ప్రయోగించే వ్యూహాన్ని యుక్రెయిన్ అమలు చేస్తోంది..

డ్రోన్ శకలాలు భవనంపై పడటంతో సమీపంలోని షాపింగ్ సెంటర్ కూడా మంటల్లో చిక్కుకుంది. పలు ఎత్తైన నివాస భవనాలను ఖాళీ చేయించారు.

మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయడంతో 500కు పైగా విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమయ్యాయి.

యుక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కో చుట్టూ విస్తృతమైన వాయు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

అయితే యుక్రెయిన్ తన దాడులలో ఉపయోగించే డ్రోన్‌ల సంఖ్య పెంచింది. వాటిలో కొన్ని ఆ రక్షణ వ్యవస్థలను ఛేదించుకున్నాయి.

అత్యాధునిక డ్రోన్‌ల భారీ దాడుల నుండి ఏ వాయు రక్షణ వ్యవస్థ కూడా సంపూర్ణ రక్షణను అందించలేదు.

లక్ష్యాన్ని ఛేదించిన వాటిలో కూడా లక్ష్యాన్ని ఛేదించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. క్షిపణి నిరోధక శకలాలు నేలకూలే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.

రష్యా రాజధాని మాస్కో యుక్రెయిన్‌ సరిహద్దుకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సుదూరంలోని లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాన్ని కీయెవ్ అభివృద్ధి చేసుకోవడంతో మాస్కో మీద డ్రోన్ దాడులు మరింత తరచుగా జరుగుతున్నాయి.

2023లో యుక్రెయిన్ మాస్కో మీద విజయవంతంగా దాడి చేసింది. అప్పటి నుంచి అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి.

డ్రోన్ల దాడితో మాస్కోలోని కీలక మౌలిక సదుపాయాల చుట్టూ ఉన్న వాయు రక్షణ వ్యవస్థల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

రష్యా రాత్రికి రాత్రే యుక్రెయిన్‌పై 200కు పైగా డ్రోన్‌లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని కీయెవ్ తెలిపింది.

రష్యాలోని కజాన్‌లో ఆగ్నేయాసియా నాయకులతో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న వ్లాదిమిర్ పుతిన్, రష్యా రాజధానిపై జరిగిన భారీ దాడిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)