You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు- ప్రెస్ రివ్యూ
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
'క్యూ న్యూస్' సీఈఓ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని మల్లన్న నివాసం నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు.
తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈ నెల 3వ తేదీన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన మల్లన్న విచారణకు హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు.
తనను రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఏప్రిల్ 22న లక్ష్మీకాంతశర్మ.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారని పత్రిక రాసింది.
డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మల్లన్న ప్రకటించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
పదో తరగతిలో మళ్లీ మార్కులు-ఏపీ పాఠశాల విద్యాశాఖ
పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి విద్యాశాఖ స్వస్తి పలికింది.
ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు మార్కులు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది.
అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు.
విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది.
దీంతో ప్రభుత్వం గ్రేడింగ్ వ్యవస్థనే రద్దుచేసింది. దాని స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది.
74శాతం కేసులు కేరళలోనే
దేశంలో దాదాపు 74 శాతం కరోనా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కేరళలో వరుసగా మూడో రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు, శుక్రవారం 32,801 కేసులు నమోదయ్యాయి.
24 గంటల్లో 1,70,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. టెస్టు పాజిటివిటీ రేటు 19.22 శాతం నమోదైంది.
శుక్రవారం దేశంలో మొత్తం 44,658 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 32 వేలకు పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం గమనార్హం.
మొత్తం కేసుల్లో 73.45శాతం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కేరళలో నమోదవుతున్న కేసులు దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్‌లో శుక్రవారం 44,658 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,03,188కు చేరుకుంది.
ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఆంక్షలు
నగర ప్రజలు సెలవు రోజున ట్యాంక్‌బండ్‌పై సేదతీరేందుకు వీలుగా ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకు ఆదివారం సాయంత్రం స్థానికులకు అవకాశం ఇవ్వాలని నగరవాసి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను కోరగా.. వెంటనే స్పందించిన ఆయన ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికల్ ఫ్రీ జోన్‌గా మారుస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
తాజాగా ట్రాఫిక్ మళ్లింపు, ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని నగరవాసులకు సీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ సమయంలో లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగు తల్లి, ఇక్బాల్‌మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ఈ రూట్‌లో వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
కర్బల మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్‌లో వచ్చే వాహనాలను షెలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను, ఓల్డ్ సెక్రటేరియట్ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపునకు మళ్లిస్తారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)