వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్: ఇండియా-న్యూజీలాండ్ పోరులో గెలిచేదెవరు?

కోహ్లీ, కేన్ విలియమ్సన్

ఫొటో సోర్స్, ICC

    • రచయిత, పరాగ్ పాఠక్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్
  • ప్రచురణ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్‌లో జరిగే ఫైనల్ పోరులో ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్నాయి.

గతంలో లార్డ్స్ మైదానం ఫైనల్ పోరుకు వేదిక కాగా, ఆన్‌సైట్ హోటల్ సౌకర్యం ఉండటంతో ఈసారి సౌథాంప్టన్‌కు ఈ అవకాశం దక్కింది.

జూన్ 18 నుంచి 23 వరకు జరిగే ఈ టెస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల (సుమారు 11.72 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ దక్కుతుంది.

ఇండియా 1983, 2011లో వన్డే వరల్డ్ కప్‌, 2007లో తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్ గెలుచుకుంది. న్యూజీలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలుచుకోలేక పోయింది.

ఒక ప్రపంచ ఛాంపియన్ షిప్‌ గెలుచుకోవడానికి న్యూజీలాండ్‌కు ఇది ఒక గొప్ప అవకాశం.

ఇంగ్లండ్‌లో ఘన విజయాలు సాధించిన చరిత్ర ఇటు టీమిండియాకు, అటు కివీస్‌కు లేదు.

ఫొటో సోర్స్, BCCI TV

ఫొటో క్యాప్షన్, డబ్ల్యూటీసీ 21 ఫైనల్‌కు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది.

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు దేశవిదేశాల్లో స్థిరంగా ఆడుతోంది. ఈ ఫైనల్ ట్రోఫీని గెలుచుకోగలనన్న దీమా భారత జట్టులో కనిపిస్తోంది.

న్యూజీలాండ్ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో విజయం సాధించగా, భారత జట్టుకు ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా దక్కలేదు.

2019లో ప్రారంభమైన ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రతి జట్టు తాను ఆడిన టెస్ట్ మ్యాచ్‌‌ల విజయాల ఆధారంగా పాయింట్లు పొందుతుంది.

అయితే, కరోనా కారణంగా ఛాంపియన్‌షిప్ షెడ్యూల్ మారిపోయింది. అనేక సిరీస్‌లు వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగాయి.

పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఐసీసీ పాయింట్ల విధానంలో కూడా మార్పులు చేసింది.

విరాట్ కోహ్లీ నాయకత్వంలో 15మంది సభ్యుల బృందం న్యూజీలాండ్‌తో తలపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ- ఫైల్ ఫొటో

ఇండియా ఎలా ఫైనల్‌కు వచ్చింది?

మొదట కొన్ని సిరీస్‌లలో తడబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకుంది. వెస్టిండీస్‌ను వారి గడ్డపైనే ఓడించింది. దక్షిణాఫ్రికా మొదట సవాలుగా కనిపించినా, ఆ తర్వాత భారత జట్టు ధాటికి నిలవలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టును భారత జట్టు స్వదేశంలో క్లీన్‌స్వీప్ చేసింది.

అయితే, న్యూజీలాండ్ టూర్‌లో భారత జట్టు పూర్తిగా తేలిపోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌ను కివీస్ జట్టు క్వీన్‌స్వీప్ చేసింది.

ఇక ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు మొదట పేలవంగా ఆడినా, తర్వాత తర్వాత పుంజుకుంది. నాయకత్వ సమస్యలు, గాయాలు భారత జట్టును కుంగదీసినా, అనూహ్యంగా తేరుకుని సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా టూర్‌ను ముగించింది.

విజయాలతో ఊపు మీదున్న టీమిండియాతో ఆడేందుకు ఇంగ్లండ్ టీమ్ భారత పర్యటనకు వచ్చింది. అయితే, ఈ సిరీస్‌ను కూడా భారత్ 3-1 తేడాతో గెలుచుకుంది.

ఈ విజయంతో భారత జట్టు తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ప్రవేశించింది.

న్యూజీలాండ్ మీద విజయం సాధించగలనన్న దీమా టీమిండియాలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, SAEED KHAN

ఫొటో క్యాప్షన్, రవి చంద్రన్ అశ్విన్-ఫైల్ ఫొటో

ఫైనల్‌కు న్యూజీలాండ్ ప్రస్థానం

శ్రీలంక టూర్‌ను 1-1తో సమం చేసిన న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో ఆ జోరు చూపించలేకపోయింది. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. అయితే, భారత జట్టును 2-0తో ఓడించి ఊరట పొందింది.

కివీస్ జట్టుకు తన సొంతగడ్డపై ఎదురే లేదన్న వాదనను నిజం చేస్తూ వెస్టిండీస్‌, పాకిస్తాన్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను 2-0 తేడాతో ఓడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది.

ఇంగ్లండ్ ఎవరికి కలిసి వస్తుంది?

సౌథాంప్టన్ స్టేడియంలో ఒకసారి ఆడిన భారత జట్టు ఓడిపోయింది. న్యూజీలాండ్ జట్టు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

ఇక, ఇంగ్లండ్‌లో 62 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏడు మాత్రమే గెలిచింది. 56 టెస్టులు ఆడిన న్యూజీలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

దీన్నిబట్టి చూస్తే ఇరు జట్లకు ఇంగ్లండ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు.

మ్యాచ్ ‘టై’ అయితే ఏం జరుగుతుంది?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఐసీసీ ప్రత్యేక నిబంధనలు సిద్ధం చేసింది. ఈ మ్యాచ్ డ్రా అయితే, ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.

ఆటకు అంతరాయం కలిగితే జూన్ 23ను రిజర్వ్‌డే గా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)