కరోనా వైరస్: ‘ఈ రోజు 103 శవాలను దహనం చేశాం’

కరోనా వైరస్

ఫొటో సోర్స్, BBC/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.
    • రచయిత, పూజా ఛాబ్రియా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ

జితేందర్ సింగ్ ఈశాన్య దిల్లీలోని ఒక దహన వాటిక దగ్గర పార్కింగ్ ప్రదేశంలో నిద్రపోతున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు కోవిడ్ పాజిటివ్ రావడంతో వారు ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉన్నారు.

"మేం ఈ రోజు 103 శవాలకు అంత్యక్రియలు చేశాం. అందులో 42 శవాలను దిల్లీలో ఉన్న వివిధ ఇళ్ల నుంచి తీసుకుని వచ్చాం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"అధికారిక లెక్కలలో ఇళ్ల దగ్గర మరణిస్తున్నవారి సంఖ్య కనిపించటం లేదు. చాలా మందికి చనిపోయే వరకు కోవిడ్ పరీక్షల ఫలితాలు కూడా తెలియటం లేదు" అని ఆయన అన్నారు.

భారతదేశంలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధికంగా మరణాలు ఇక్కడ నమోదయ్యాయి.

అనాథ శవాలను, లేదా ఆత్మహత్య కానీ, ప్రమాదంలో కానీ మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించే ఒక స్వచ్ఛంద సంస్థను జితేందర్ నడుపుతున్నారు.

ఆయనతో పాటు 18 మంది వలంటీర్ల బృందం కూడా ఈ అంత్యక్రియల నిర్వహణలో సహాయం చేస్తారు.

"గత ఏడాది కరోనా సమయంలో మేము మొత్తం 967 శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సహాయం చేశాం. ఆ సంఖ్యను ఈ ఏడాది 15 రోజుల్లోనే దాటేశాం" అని జింతేందర్ చెప్పారు.

"ఇంతకు ముందు ఎక్కువగా వృద్ధులు కరోనాకు బలవ్వడం చూశాం. కానీ, ఈ సారి, చిన్న వయస్సు వారు కూడా కోవిడ్ బారిన పడి మరణిస్తున్నారు" అని చెప్పారు.

జితేందర్‌కు రోజూ అనేక బాధిత కుటుంబాల నుంచి వందల ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి.

"ఈ రోజు కెనడాలో ఉన్న ఒక వ్యక్తి సోదరుని అంత్యక్రియల కోసం కూడా ఫోను వచ్చింది. నిన్నటి నుంచి ఆయన శవం ఇంట్లోనే పడి ఉంది" అని చెప్పారు.

"అదే ఇంట్లో ఆయన తండ్రి కూడా ఉన్నారు. కానీ, ఆయనకు 80 ఏళ్లు.. కళ్లు కనిపించవు" అని చెప్పారు.

దీంతో జితేందర్ బృందం ఆయన సోదరునికి అంత్యక్రియలు నిర్వహించారు.

"ఇలా చిన్న వయసు వ్యక్తులు చనిపోవడం వారి కుటుంబాలు ఆ వేదనను తట్టుకోలేక అవస్థలు పడటం చూడటం చాలా బాధగా ఉంది. నాలో నేనే ఏడుస్తున్నాను. ఒక వైపు వైద్య వ్యవస్థ కూడా బలహీనంగా ఉండటంతో ఆ కుటుంబాల వేదన కోపంలా మారుతోంది. సామాన్య మానవులకు మరణం తప్ప మరో మార్గం లేదు" అని అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్మశానాల్లో కుప్పలు తెప్పలుగా శవాలు వస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్ పూర్ జిల్లాలో ఉన్న సుశీల్ కుమార్ (పేరు మార్చాం) తల్లిని కోల్పోయారు. ఆయన కుటుంబం అందరికీ కరోనా పాజిటివ్ రాగా వారంతా కోలుకున్నారు. కానీ, ఆయన తల్లి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు.

"ఆమె ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుంటే నేను మూడు రోజులు ఆసుపత్రిలో బెడ్ గానీ, ఆక్సిజన్ సిలిండర్ గానీ దొరుకుతుందేమోనని ఎదురు చూశాను. వైద్య సహాయం కోసం ప్రయత్నాలు ఫలించకముందే ఆమె ఇంటి దగ్గరే మరణించారు. ’’ అని సుశీల్ అన్నారు.

దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ప్రజలు మరణిస్తున్నారు.

సుశీల్ ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సంపాదించగలిగారు. కానీ, అది విషమంగా ఉన్న కేసుల్లో పని చేయడం లేదు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ తో ఇంటి దగ్గరే ఉండి ఆక్సిజన్ పొందవచ్చు.

"వ్యవస్థ వైఫల్యం వల్లే మా అమ్మ చనిపోయారు" అని ఆయన ఏడుస్తూ చెప్పారు. "అధికారులు నెపాన్ని మరొకరిపై తోసేస్తున్నారు. ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. ఒక రోగికి బెడ్ కేటాయించడానికి కేంద్రీకృత వ్యవస్థ ఏమి లేదు" అని అన్నారు.

ఒక వైపు పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, వైద్య వ్యవస్థ సక్రమంగానే ఉందని ప్రకటనలు చేస్తూ వచ్చారు. తప్పుడు ప్రచారం చేసేవారి ఆస్తులు జప్తు చేస్తామని కూడా బెదిరించారు.

"నేను నాకు తెలిసిన చాలా మంది అధికారులకు ఫోన్ చేశాను. కానీ, ఎవరూ నా ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. ఈ ప్రభుత్వాన్ని నేనెప్పటికీ క్షమించను" అని సుశీల్ అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటి దగ్గరే ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చుకోవాల్సి వస్తోంది.

ఇంటి దగ్గర ఆక్సిజన్ కష్టం

చాలా మందికి ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకకపోవడంతో ఇంటి దగ్గరే ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. నందిని కుమార్ తన తండ్రికి ఇంటి దగ్గరే చికిత్స చేయించాల్సి వచ్చింది.

"ఆయన క్యాన్సర్ బాధితుడు. మంచం మీదే ఉంటారు. ఇంటి దగ్గరే చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నాను. కానీ, ఆక్సిజన్ లభించడం చాలా కష్టంగా మారింది. శ్వాస అందటం కష్టంగా మారడంతో అతి కష్టం మీద ఒక ఆక్సిజన్ సిలిండర్ సంపాదించగలిగాను. కానీ, అది 8 గంటలు మాత్రమే వస్తుందని నాకు అప్పటి వరకు తెలియదు. నేను డాక్టర్‌ను కాదు కదా. ఒక్క రోజులో చాలా నేర్చుకోవల్సి వచ్చింది". అన్నారు నందిని కుమార్.

కానీ, ఆమె మరో ఆక్సిజన్ సిలిండర్ సంపాదించేలోపు ఆమె తండ్రి మరణించారు.

"మమ్మల్ని ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకోమంటున్నారు. కానీ, అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు నాకు, మా అమ్మగారికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నా బంధువులకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తవచ్చు" అని ఆమె అన్నారు.

"బాధిత కుటుంబాలు తెలిసిన వారు,తెలియని వారిని కూడా సంప్రదించి సహాయం అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్లో మందులు కొనుక్కోవలసి వస్తోంది. సొంతంగా అత్యవసర చికిత్స ఎలా చేసుకోవాలో నేర్చుకోవలసి వస్తోంది. ఇదంతా చాలా అల్లకల్లోలంగా ఉంది" అని ఆమె అన్నారు.

ఇదంతా జరిగాక కూడా ప్రాణాలు ఉంటాయనే నమ్మకం లేదు. ఇళ్లల్లో ఎంత మంది కోవిడ్ బారిన పడి ఉంటున్నారో లెక్క తెలియడం లేదు.

సెకండ్ వేవ్ గురించి వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలను ప్రభుత్వం విస్మరించిందంటూ మోదీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో ఆక్సిజన్ సామర్ధ్యాన్ని, వైద్య సదుపాయాలు పెంచేందుకు ప్రధాన మంత్రి ఏప్రిల్ 30న సమావేశాలు నిర్వహించారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసుపత్రిలో బెడ్ సంపాదించడం సవాలుగా మారింది.

దానికి రెండు రోజుల ముందే బీజేపీ నాయకుడు నరేంద్ర తనేజా బీబీసీ రేడియోతో మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను సమర్థించారు.

‘‘ జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారతదేశంలో కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. కానీ, గత మూడు నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు సునామీలా వస్తున్నాయి. సునామి హెచ్చరిక లేకుండానే వస్తుంది. ఇప్పుడు దేశమంతా కేసులు పెరిగిపోయాయి. దీంతో మేం ఈ సమస్యలో ఇరుక్కుపోయాం" అని అన్నారు.

నమోదవుతున్న కేసుల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు" సరైన లెక్కలు ఎవరికీ తెలియదు. భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో మరణాలను దాచి పెట్టి ఉంచలేం. ఒక వేళ ఏమైనా తేడాలుంటే అవి పబ్లిక్ డొమైన్ లలో వచ్చేస్తాయి" అని అన్నారు.

ఇంత విధ్వంసం తర్వాత కూడా భారతదేశం తిరిగి నిలదొక్కుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "మాకు శక్తి ఉంది. మాకు నమ్మకం ఉంది. మీరు చూస్తారు" అని అన్నారు.

ఆక్సిజన్ సరఫరాలను వేగవంతం చేసేందుకు దేశంలో రైళ్లు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా రంగంలోకి దించారు. కానీ, ఇదంతా అవసరమైన వారికి చేరడం లేదు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆక్సిజన్ కోసం బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోవిడ్ సమాచారమంతా ఒకే చోటికి చేర్చడానికి కొంత మంది ప్రయత్నిస్తూ, ఆ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.

తనూ 3 వారాల క్రితం కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. ఆమె సోషల్ మీడియాలో వచ్చే ఎస్.ఓ.ఎస్.కాల్స్‌కి స్పందిస్తున్నారు. ఆమె కోవిడ్ రోగుల నుంచి వచ్చే సందేశాలను షేర్ చేసి వైద్య సమాచారాన్ని ధృవీకరిస్తున్నారు.

"ట్విటర్ లో ఒక 30 సంవత్సరాల గర్భిణి కోసం వచ్చిన అభ్యర్ధన నన్ను కదిలించేసింది. ఆమె ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఆసుపత్రిలో బెడ్ దొరకకపోవడంతో ఆమె మరణించారు" అని తనూ చెప్పారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది.

చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే సమాచారం నిరర్థకంగా ఉండటం కానీ, లేదా తప్పుడు సమాచారం కానీ ఉంటోంది. ఆమె ప్రతి రోజు స్వయంగా వెళ్లి ఆక్సిజన్ లాంటి వైద్య వనరులు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.

"ప్రభుత్వం చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం. మరో వైపు అభ్యర్ధనలు వస్తూనే ఉన్నాయి" అని అన్నారు.

"ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మా కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసి రావచ్చు అనిపిస్తోంది" అని ఆమె అన్నారు.

"చాలా మంది వైరస్ వల్ల కన్నా, సరైన వైద్య సదుపాయాలు అందక మరణిస్తున్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది" అన్నారు తనూ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)