తెలంగాణ: ఆదివాసీ పల్లెనంతా పట్టా చేసుకున్నాడు.. 'రైతు బంధు' కూడా అందుకున్నాడు :ప్రెస్ రివ్యూ

తెలంగాణలో ఒక ఆదివాసీ గ్రామం
ప్రచురణ

నిర్మల్ జిల్లాలో ఒక వ్యక్తి ఆదివాసీల గ్రామం మొత్తాన్నీ పట్టా భూమిగా మార్చుకున్న విషయం బయటపడిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

ఓ వ్యక్తి దురాలోచన.. అధికారుల నిర్వాకం ఓ ఊరినే ముంచింది. అమ్మిన భూమిని గ్రామస్థులకు తెలియకుండా తిరిగి పట్టా చేసుకోవడంతో ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు.

నిర్మల్‌ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు పెంబికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మందపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద 55/2 సర్వే నంబర్‌లో ఏడెకరాల అసైన్డ్‌భూమిని కొనుగోలు చేసి, 2000 సంవత్సరంలో కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇందుకు అప్పటి మంత్రి, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాలాచారి చొరవచూపారు. సుమారు 50 కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

వేణుగోపాలాచారి సహాయానికి గుర్తుగా వారు తమ గ్రామానికి 'వేణునగర్‌'గా నామకరణం చేసుకున్నారు.

ఆ తర్వాత 2002లో పెంబికి చెందిన గన్నారపు సురేందర్‌ ఆదివాసీలకు తెలియకుండా, వారు భూమి కొన్న వ్యక్తుల నుంచి 4.34 ఎకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, అసైన్డ్‌ భూమిని పట్టాభూమిగా మార్చుకున్నాడు.

గ్రామంలో మొత్తం భూమి తనదేనంటూ సురేందర్‌ ఇటీవల గ్రామస్థులతో చెప్పడంతో వారు కంగుతిన్నారు. నివాస స్థలాలను తన భూమిగా పట్టా చేసుకొని దానిపై ఏడాదికి రూ. 47,500 రైతుబంధు పొందడం గమనార్హం.

నివాస స్థలాలపై డబ్బులు సదరు రైతు ఖాతాలో జమ అవుతున్నా కనీసం వ్యవసాయ అధికారులు గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

ఈ విషయంపై గ్రామస్థులు శనివారం తాసిల్దార్‌ రాజ్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

తెలంగాణలో టీకా బంద్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో టీకా పంపిణీ బంద్

తెలంగాణలో టీకా నిల్వలు నిండుకోవడంతో ఈరోజు(ఏప్రిల్ 18) వ్యాక్సినేషన్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో కొవిడ్‌ టీకా నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆదివారం పంపిణీని నిలిపివేశారు.

ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శనివారం అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా టెస్టులు యథావిధిగా.. లక్ష్యం మేరకు నిర్వహించాలని ఆదేశించారు. 3 వేల డోసులే ఉన్నందున వ్యాక్సినేషన్‌ నిలిపివేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వం శనివారం 2.7 లక్షల డోసులు పంపుతామని చెప్పినప్పటికీ.. అవి చేరలేదు. అయితే ఆదివారం రాత్రి వరకు పంపుతామని కేంద్రం సమాచారం ఇచ్చింది.

కాగా, శనివారం చాలా కేంద్రాల్లో టీకా నిల్వలు లేవని వైద్య సిబ్బంది చెప్పడంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చినవారు వెనుదిరిగారు.

మరోవైపు వైద్య శాఖ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం రికార్డు స్థాయిలో 1,61,406 మంది తొలి డోసు తీసుకున్నారు. 13,833 మంది రెండో డోసు వేయించుకున్నారు.

టీకాల్లేవని చెప్పడంతో.. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పంపిణీ కేంద్రం వద్ద శనివారం వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఆందోళన చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఇక కరెంట్ బిల్ చెల్లింపు డిజిటల్

ఫొటో సోర్స్, Getty Images

ఇక ఏపీలో కరెంటు బిల్లుల డిజిటల్ చెల్లింపులు

ఏపీలో కరెంటు బిల్లులు ఇక ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా, బిల్లు వసూలు కేంద్రాలు క్రమంగా తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆన్‌లైన్‌ విధానంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. బిల్లు వసూలు కేంద్రాలను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఇందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు.

ఇప్పటికే ప్రతినెలా వచ్చే బిల్లులను వినియోగదారుడికి మెసేజ్‌ ద్వారా తెలియజేస్తున్నారు.

ఇక మీదట తేలికగా డిస్కమ్‌ సైట్‌కు లింక్‌ అయ్యి, గేట్‌ వే ద్వారా బిల్లులు చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అధికార వర్గాలు తెలిపాయని సాక్షి రాసింది.

రెవెన్యూ కేంద్రాల నిర్వాహణకు డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఈ ఖర్చును తగ్గించుకునే యోచనలో ఉన్నాయి.

కరోనా నేపథ్యంలో రెవెన్యూ కేంద్రాలకు వెళ్లి బిల్లు కట్టే సంప్రదాయ వినియోగదారులు చెల్లింపులు ఆపేస్తున్నారు. ఎక్కువ సేపు లైన్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల డిస్కమ్‌ల రెవెన్యూ తగ్గిపోతున్నాయని పత్రిక చెప్పింది.

గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే దాదాపు 38 శాతం రెవెన్యూ వసూళ్లు తగ్గినట్టు తేలింది.

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు.

వచ్చే ఏడాదిలోగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారని సాక్షి వివరించింది.

ఏపీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో 20 మందికి కరోనా పాజిటివ్ వస్తోందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. మలిదశలో తక్కువ వ్యవధిలోనే విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా శనివారం రికార్డుస్థాయిలో 20.11% పాజిటివిటీ నమోదైంది.

అంటే పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరు వైరస్‌ బారిన పడినట్లయింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడం (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌) విధానం అవలంబించాలని కేంద్రం పదేపదే సూచిస్తోంది.

పరీక్షలు పెంచితేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఏం చేయాలో తెలుస్తుందని ఈ నెల 8న సీఎంలను ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అయినా.. రాష్ట్రంలో మాత్రం పరీక్షలు పెరగడంలేదు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ల్యాబ్‌ల ద్వారా రోజూ 90 వేలకుపైగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే అవకాశం ఉన్నా... రోజుకు సగటున 35వేలు మాత్రమే జరుగుతున్నాయని ఈనాడు రాసింది.

చికిత్సలో కీలకంగా ఉన్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకూ కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నిర్వహించిన 35వేల పరీక్షలకు 7,224 కేసులు బయటపడ్డాయి.

అదే.. లక్ష వరకు పరీక్షలు చేస్తే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు.

వైరస్‌ సోకిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి... చికిత్స చేస్తే వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుంది. ఒక్కసారిగా కేసులు పెరిగితే పడకలు దొరక్కపోవడంతో పాటు కొత్త సమస్యలూ తలెత్తే అవకాశం ఉందని పత్రిక రాసింది..

రాష్ట్రంలో శనివారం 35,907 నమూనాలు పరీక్షించగా 7,224 కేసులు బయటపడ్డాయి. అంటే.. ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్‌ సోకింది.

చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోనే 67% కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో శనివారం వరకు 5,58,891 పరీక్షలు చేయగా 53,466 (9.56%) మందికి వైరస్‌ సోకింది.

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కలిపి 15 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు విడిచారు.

వీరితో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,388కి చేరిందని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)