తిరుపతి ఉప ఎన్నిక: దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ ఫిర్యాదు.. మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్న బీజేపీ

ఓటు హక్కు వినియోగించుకున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి(మధ్యలో తెల్ల మాస్క్)

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఓటు హక్కు వినియోగించుకున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి(మధ్యలో తెల్ల మాస్క్)
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో, తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శనివారం ఉప ఎన్నికల పోలిగ్ జరిగింది.

సాయంత్రం 6 గంటల వరకు సాధారణ పోలింగ్ నిర్వహించారు.6 గంటల నుంచి 7 గంటల వరకు కోవిడ్ బాధితులకు ఓటు హక్కు వేసే అవకాశం కల్పించారు.

అధికారిక సమాచారం ప్రకారం తిరుపతిలో 55 శాతం ఓట్లు పోల్ కాగా, నాగార్జున సాగర్‍లో 84.32శాతం పోలింగ్ నమోదైంది.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

తిరుపతి ఉపఎన్నికలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి పోటీలో నిలిచారు.

క్యూలో నిలుచున్న వైసీపీ అభ్యర్తి గురుమూర్తి

ఫొటో సోర్స్, ugc

వైసీపీ అభ్యర్థి ఎం గురుమూర్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మన్నసముద్రం పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్నారు.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 2,470 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

దొంగఓట్ల ఫిర్యాదు

పోలింగ్‌లో దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడంలేదని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు.

టీడీపీ గెలుస్తుందన్న భయంతోనే వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.

మంత్రి పెద్దిరెడ్డి జిల్లా నలువైపుల నుంచి దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చారని, నకిలీ ఓటరు కార్డులు ముద్రిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఈసీకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని పనబాక లక్ష్మి చెప్పారు.

మళ్లీ పోలింగ్ నిర్వహించాలి -బీజేపీ

తిరుపతి ఉప ఎన్నికను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేశారని ఇవాళ్టి పోలింగ్ రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా నిర్వహించాలని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయించిందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, పోలీసు, రెవెన్యూ, ఎలక్షన్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఏజెంట్లు దొంగ ఓటు వేసే ప్రయత్నాలు అడ్డుకొని, వారిని పోలీసులకు అప్పజెప్పారని తెలిపారు.

దొంగ ఓట్లు వేసేందుకు ఒక మంత్రిగారి అనుచరులు వేలమంది రాత్రినుంచే నియోజకవర్గ పరిధిలోకి చేరుకున్నారని సోము వీర్రాజు అన్నారు. ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.

దొంగఓట్ల ఆరోపణలపై సీఈఓ ఆరా

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేశారనే ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్ చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించిన ఆయన భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయన్న ఆరోపణలపై ఆరాతీశారు.దొంగ ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ ఉప ఎన్నిక నిర్వహించాలని, నకిలీ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు.

దొంగ ఓటర్లు అంటూ చంద్రబాబు కట్టుకథలు: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ ఆరోపణలు అవాస్తవమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

తిరుపతికి దొంగ ఓటర్లు వస్తున్నారంటూ చంద్రబాబు కట్టుకథలు అల్లి, తన అనుకూల మీడియాలో ప్రచారం చేశారని ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో కౌంటింగ్

ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో భద్రపరచనున్నారు. మే 2న అక్కడే ఓట్ల లెక్కింపు జరనుంది.

పోలింగ్‌ ముగిసే వరకు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేశారు.

మరోవైపు తెలంగాణలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతోంది.

వేలికి ఇంకు

ఫొటో సోర్స్, Getty Images

సాగర్‌లో 41 మంది అభ్యర్థులు

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రవి నాయక్ పోటీ చేస్తున్నారు. వీరితో కలిపి మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2 వేలకు పైగా పోలీస్ బలగాలను మోహరించారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఓటరు కచ్చితంగా మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

కొవిడ్‌ పాజిటివ్‌గా ఉన్నవారు సాయంత్రం 6గంటల తరువాత ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)