You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: కోవిడ్ రోగి నిర్లక్ష్యం... శిబిరంలో రక్తదానం - ప్రెస్ రివ్యూ
తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఒక కరోనా రోగి రక్తదానం చేశాడని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది.
కోవిడ్ బారినపడిన వ్యక్తి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండాల్సిందిపోయి జనాల్లోకొచ్చాడు. పైపెచ్చు రక్తదానం చేశాడు.
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని ఇరక్‌పల్లికి చెందిన వ్యక్తి మూడు రోజుల క్రితం మండల కేంద్రం మనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు.
పాజిటివ్‌గా నిర్ధారణవడంతో అక్కడి వైద్యుడు మురళీకృష్ణ మందులు ఇచ్చి, ఇంట్లో క్వారంటెయిన్‌లో ఉండాల్సిందిగా సూచించారు.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నాగల్‌గిద్దలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైద్యుడు పర్యవేక్షించారు.
ఈ క్రమంలో కొవిడ్ రోగి రక్తదానం చేస్తుండగా గుర్తించి అవాక్కయ్యారు. 'ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన నువ్వు రక్తదానం చేయడమేంటని' నిలదీయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.
దీంతో సేకరించిన 15 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు బయటపడేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఈనాడు వివరించింది.
హోంగార్డులను తొలగించవద్దు - హైకోర్టు
విధుల్లో లేని హోంగార్డులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉపశమనం ఇచ్చిందని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.
వివిధ కారణాలతో సర్వీస్ నుంచి తొలగింపునకు గురైన హోంగార్డులకు హైకోర్టులో ఊరట లభించింది. వారిని తొలగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.
హోంగార్డులు నిర్వహించే విధులు సివిల్ పోస్టు కిందకు వస్తాయని, ఎలాంటి కారణాలు చూపకుండా, వివరణ తీసుకోకుండా హోంగార్డులను విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఏపీ పోలీస్ మ్యాన్యువల్ వారికి వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. హోంగార్డులను విధుల నుంచి తొలగించే అధికారం కమాండెంట్‌కు మాత్రమే ఉంటందని పేర్కొంది.
ఏపీ హోంగార్డు చట్టం, నిబంధనల మేరకు తగిన ఉత్తర్వులు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది.
పిటిషనర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.
సుధీర్ఘకాలం విధులకు దూరంగా ఉండడం, క్రిమినల్ కేసుల నమోదు, విధి నిర్వహణలో దుష్ప్రవర్తన, అక్రమంగా డబ్బులు వసూలు వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో విధుల నుంచి తొలగింపునకు గురైన హోంగార్డులు హైకోర్టులో 2019, 2020, 2021లలో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఆయా వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి కలిపి విచారించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
గెలవాల్సిన మ్యాచ్ చేజేతులా జార విడుచుకున్న హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అప్పగించిందని సాక్షి వార్తా కథనం ప్రచురించింది.
ఐపీఎల్ తాజా సీజన్ మరో నాటకీయ మ్యాచ్‌కు వేదికైంది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను పోలిన మ్యాచ్‌గా సాగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓటమి వరించగా... విజయ తీరాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేరింది.
హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేసినా... బ్యాటింగ్ వైఫల్యంతో సీజన్‌లో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడగా... కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ (3/30) కీలక వికెట్లు తీయగా... రషీద్ ఖాన్ (2/18) టి20 లో తన విలువేంటో మరోసారి చాటాడు.
అనం తరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్)... మనీశ్ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
బెంగళూరు బౌలర్లు షహబాజ్ అహ్మద్ (3/7), హర్షల్ పటేల్ (2/25), సిరాజ్ (2/25) హైదరాబాద్‌ను దెబ్బతీశారు.
హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో ట్విస్ట్ మొదలయింది. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన షహబాజ్ అహ్మద్ సాఫీగా సాగుతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అలజడి రేపాడు.
తొలి రెండు బంతులకు అనవసరపు షాట్‌లకు ప్రయత్నించిన బెయిర్‌స్టో (12), మనీశ్ పాండేలను అవుట్ చేయడంతోపాటు... చివరి బంతికి సమద్ (0)ను డకౌట్ చేశాడు. అంతేకాకుండా ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ కోల్‌కతా, ముంబై మ్యాచే జ్ఞప్తికి వచ్చింది.
హైదరాబాద్ మరో కోల్‌కతా కానుందా అనే ఆలోచన సగటు సన్‌రైజర్స్ అభిమానిలో మెదిలింది. 18వ ఓవర్‌లో శంకర్ (3)ను హర్షల్ పటేల్ ... 19వ ఓవర్‌లో హోల్డర్ (4)ను సిరాజ్ అవుట్ చేయడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది.
చివరి ఓవర్లో రైజర్స్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా... హర్షల్ వేసిన ఈ ఓవర్లో రషీద్ (17), భువనేశ్వర్ (2 నాటౌట్) తొలి మూడు బంతులకు 8 పరుగులు సాధించారు.
అయితే వరుస బంతుల్లో రషీద్, నదీమ్ (0) అవుట్ కావడంతో రైజర్స్ ఓటమి ఖాయమైందని సాక్షి రాసింది.
ఇంట్లో కూడా మాస్క్ తప్పనిసరి
కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.
గతంలో కరోనా ఒక వ్యక్తికి సోకితే అతని వరకే పరిమితం అయ్యేదని, కానీ ప్రస్తుత వైరస్ తీవ్రత కారణంగా ఇంట్లో ఒకరికి సోకితే గంటల్లోనే కుటుంబసభ్యులకు అంటుకొనే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. అవరమైతే ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు.
ఈ పరిణామాలను బట్టి వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.
బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగైదు వారాలుగా రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి దాదాపు 6 వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
నిర్లక్ష్యంచేస్తే రాష్ట్రం మహారాష్ట్రను మించిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా దవాఖానల్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో పడకల కొరత ఏర్పడవచ్చని చెప్పారు.
ప్రజల జీవనోపాధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినకూడదని ప్రభుత్వం లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించకపోవడానికి ప్రధానకారణమని వివరించారు. ఈ పరిస్థితులను అర్థంచేసుకొని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారని నమస్తే తెలంగాణ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)