ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజిలో ఒకేరోజు 55 మంది విద్యార్థులకు కరోనా

    • రచయిత, ఎల్.శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని 55 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

మొత్తం 820 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇవాళ 420 మంది ఫలితాలు వచ్చాయి.

వీరిలో 55 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశాఖ జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

అలాగే మరో 400 మంది ఫలితాలు రేపు వస్తాయని తెలిపారు.

ఏయూ ఇంజనీరింగ్ హాస్టల్‌లోని ఆరు బ్లాకులను కరోనా వార్డులుగా మార్చామని, అందులో రెండు బ్లాకులను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు ఆయన చెప్పారు.

కరోనా సోకిన 55 మంది విద్యార్థుల్లో ఎవరికి కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని విశాఖ జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.

ఒకేసారి ఇన్ని కరోనా కేసులు రావడంతో ఏయూ విద్యార్థులు, ఉద్యోగులు మాత్రం అందోళన చెందుతున్నారు. కరోనా సోకిన విద్యార్థులంతా గత రెండు, మూడు రోజులుగా ఎవరెవర్ని కలిశారనే విషయంపై చర్చించుకుంటున్నారు.

'కరోనా కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేం'

కరోనా కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేమని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

ఏపీలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించారు.

కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

ఆంధ్రా యూనివర్సిటీలో రేపట్నుంచి జరగాల్సిన బీఈ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో వాయిదా పడిన పరీక్షల తేదీల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)