కరోనావైరస్: ఏపీలో ఒకే రోజు 758 కొత్త కేసులు.. సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వ సన్నాహాలు - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 758 కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్ తర్వాత ఇదే అత్యధికం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3,469కి చేరింది.
డిసెంబర్ నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టిన కేసులు గత పది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి.
నాలుగు రోజులుగా..
మార్చి 24న 585 కేసులు, 23న 492 కేసులు, 22న 310 కేసులు, 21న 368 కేసులు చొప్పున నమోదయ్యాయి.
ఈ నాలుగు రోజుల్లోనే కేసులు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
రాష్ట్రంలో కొత్త కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటికే కొన్ని చోట్ల కరోనా కారణంగా విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆసుపత్రులలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రత్యేక వార్డులను సాధారణ వార్డులుగా మార్చేశారు. కానీ ప్రస్తుతం మరోసారి తీవ్రత కనిపిస్తున్న తరుణంలో అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు వచ్చే సోమవారం నుంచి అన్ని సచివాలయాల్లోనూ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే గురువారం నుంచి జిల్లాకు రెండు సచివాలయాల్లో వ్యాక్సిన్ అందించడం ప్రారంభించారు.
తెలంగాణలో
మరోవైపు తెలంగాణలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 24వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం అంతకుముందు 24 గంటల్లో కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి.
157 మంది కోలుకున్నారు.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలను మూసివేశారు.
వైరస్ కట్టడి కోసం ప్రభుత్వ వివిధ చర్యలు చేపడుతోంది.

ఫొటో సోర్స్, ysrcongressparty
కర్నూలు జిల్లా విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పేరు -ముఖ్యమంత్రి జగన్
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్త విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రారంభించారు.
ఈ ఎయిర్‌పోర్టుకు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం' అని పేరు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ, "ఈ నెల 28 నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం రాకపోకలు ప్రారంభం అవుతాయి. మొదట బెంగళూరు, చెన్నై, విశాఖకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, ysrcongressparty
గతంలో చంద్రబాబునాయుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారని విమర్శించిన జగన్, "రన్ వే పనులు పూర్తి కాకుండా, కనీసం విమానం ఎగిరే పరిస్థితులు కూడా లేకుండా రిబ్బన్ కట్ చేశారు" అని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశామని అన్నారు.

హైదరాబాద్‌లో ఓయూ, పీజీ కాలేజి విద్యార్థుల ధర్నా... విద్యాసంస్థలను మూసేయడంపై నిరసన

ఫొటో సోర్స్, UGC
కరోనావైరస్ వ్యాప్తి పేరుతో బార్లు, థియేటర్లు మూసేయకుండా కేవలం విద్యాసంస్థలనే మూసేయాలని నిర్ణయించడం దారుణమంటూ సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఇటు తెలంగాణకు చెందిన పలు విద్యార్ధి సంఘాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
గురువారం మధ్యాహ్నంనుంచి హాస్టళ్లు మూసేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటి యాజమాన్యం బుధవారమే ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్ధి సంఘాలు నిన్న సాయంత్రమే ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి.
హాస్టల్ మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం నాడు ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజీలకు చెందిన అనేకమంది విద్యార్ధులు ధర్నా నిర్వహించారు. బార్లు, థియేటర్లకు లేని కరోనా భయం విద్యా సంస్థలకు ఎందుకని వారు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UGC
స్కూళ్ల మూసివేతతో తమకు అభ్యంతరం లేదని, యూనివర్సిటీ హాస్టళ్లను మూసేయాలని నిర్ణయించడం సరికాదని, వెంటనే పరీక్షలు నిర్వహించాలని, హాస్టళ్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై ఆందోళన కొనసాగించారు
కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నెల రోజులు స్కూళ్లు కాలేజీలు నడిపించారని, పేద విద్యార్ధుల పట్ల సీఎం కేసీఆర్ కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపించారు.
విద్యా సంస్థల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణం తెరవకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్ధులు హెచ్చరించారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























