ఉత్తరప్రదేశ్: లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం... 15 మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో దాదపు 15 మంది విద్యార్థులు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ విషయాన్ని కేజీఎమ్‌యూ ట్రామా సెంటర్ మెడికల్ సూపరింటెండెట్ ధృవీకరించారు.
"ట్రామా సెంటర్‌కి 21-22 మంది పిల్లలను తీసుకొచ్చారు. ఇద్దరు చిన్నారులు భవనం నుంచి దూకడంతో గాయపడ్డారు. వారి వెన్ను భాగంలో గాయాలయ్యాయి. సీటీ స్కాన్ చేసి చికిత్స అందిస్తున్నాం.
15 మంది పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చేసరికే మరణించి ఉన్నారు. పంచనామా పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను మార్చురీకి తరలిస్తాం.
ప్రస్తుతం ఐదు మృతదేహాలను పంపించాం. మిగిలిన పది మృతదేహాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది" అని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ తెలిపారు.
ఘటనానంతరం, రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు ముగిశాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనాస్థలిని సందర్శించారు.
"నేను స్వయంగా 11 నుంచి 12 మృతదేహాలను చూశాను" అని అంతకుముందు ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఒక యువకుడు భవనం మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగుతుండగా రెయిలింగ్స్ మధ్యలోంచి దూకుతున్నట్లు కనిపిస్తోంది. బీబీసీ ఈ వీడియోను స్వయంగా ధృవీకరించలేదు.
"ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు చిన్నారులు గాయపడ్డారు. వారిని కేజీఎంసీ ట్రామా సెంటర్‌కు తరలించారు" అని ఈ ఘటనపై బ్రజేశ్ పాఠక్ అన్నారు. ఆయన ప్రకటన తర్వాత ఆసుపత్రి అధికారులు మృతుల సంఖ్యను 15గా ధ్రువీకరించారు.
"ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చాం. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించడానికే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తుంది" అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
"గాలింపు చర్యలు పూర్తయ్యాయి. అక్కడ ఇక చిన్నారులు లేరు. భవనాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించం" అని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేశారు. ఆయన అలీగఢ్ పర్యటనలో ఉండగా, అక్కడి నుంచి లఖ్‌నవూకు బయలుదేరారు. అనంతరం ఘటనాస్థలిని సందర్శించారు.
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ " లఖ్‌నవూలో ఒక ప్రమాదం జరిగింది. అక్కడ కొంతమంది చిన్నారులు మంటలంటుకున్న భవనంలో చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తు వారు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది" అని అన్నారు.
మృతుల కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేసారు.
"లఖ్‌నవూలోని ఒక కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం, మరి కొందరు గాయపడడం అత్యంత బాధాకరం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
"మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ఆయన రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























