నిర్మల సీతారామన్: విశాఖ స్టీల్‌ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటాలూ లేవు - ప్రెస్ రివ్యూ

నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు దాని అనుబంధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లకు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఉన్న వాటాలను 100 శాతం విక్రయించనున్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

‘‘సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంటులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలతోపాటు, ఆ ప్లాంటు అనుబంధ సంస్థలు, సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థల్లో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఉన్న వాటాలను పూర్తిగా ఉపసంహరించుకుని ప్రైవేటీకరించడానికి సీసీఈఏ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం వల్ల ఆ సంస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త సాంకేతికతలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు తీసుకురావడానికి అవసరమైన మూలధనం సమకూర్చుకోవడానికి వీలవుతుందని మంత్రి వివరించారు.

దీనివల్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతోపాటు, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వాముల న్యాయబద్ధమైన సమస్యలను తగిన విధంగా పరిష్కరించడానికి ప్లాంటు వ్యూహాత్మక విక్రయ విధివిధానాల ఖరారు సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వాటాల కొనుగోలు ఒప్పందంలో (షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌) అందుకు తగ్గట్లుగా నిబంధనలను పొందుపరుస్తామని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటాలూ లేవని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని సంప్రదిస్తున్నామని, జోక్యం కావాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు కోరుతామని పేర్కొన్నారు.

దేశంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలు గత ఐదేళ్లుగా నిరంతరం నష్టాల్లో నడుస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. 2019-20 నాటికి ఈ 30 సంస్థల నష్టం రూ.30,131 కోట్లకు చేరినట్లు చెప్పారు. 2016లో కేంద్ర ప్రభుత్వం 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందని, ఇప్పటి వరకూ 8 సంస్థల్లో ఆ పని పూర్తయిందని తెలిపారు. దాని ద్వారా రూ.66,712 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.

2021-22లో మిగతా వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు ఆర్జించాలని బడ్జెట్‌ అంచనాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో గత ఏడాది మార్చి 31 నాటికి 50,291 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తుల స్థూల విలువ రూ.32,022.32 కోట్లని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. సంస్థ భూములు (బ్లాక్‌ ఆఫ్‌ ప్రాపర్టీ), ప్లాంట్‌, పరికరాలు, చరాస్తుల స్థూల విలువ 2020 డిసెంబర్‌ 31 నాటికి రూ.32,022.32 కోట్లని చెప్పారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వం మూలధన వాటా కింద గత డిసెంబర్‌ నాటికి రూ.4,889.85 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. గత అయిదేళ్లలో నాలుగేళ్లపాటు సంస్థకు నష్టాలు వచ్చాయని వెల్లడించార’’ని ఈ కథనంలో తెలిపారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

రిజర్వేషన్ల పరిమితిపై రాష్ట్రాల అభిప్రాయం కోరిన సుప్రీం కోర్టు

తెలంగాణలో ముస్లింలకు 12 శాతం; గిరిజనులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎస్సీలకు జనాభా దామాషా ప్రాతిపదికన పెంచుతామని చెప్పారు. ఈ మేరకు శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. వీటిని ఆమోదిస్తే రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోనుంది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఇటువంటి బిల్లులు పెండింగులో ఉన్నాయి. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచుకునేందుకు ఆమోదించాలంటూ వినతులూ వస్తున్నాయి. సుప్రీంలో పిటిషన్లూ దాఖలయ్యాయి. తమిళనాడులో ఇప్పటికే 60% వరకూ రిజర్వేషన్లు అమలవుతుండగా.. తమకూ కోటా పెంచాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. తాజాగా, ఈ అంశంపై సుప్రీం కోర్టు స్పందించింది. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రాల అభిప్రాయాలనే కోరిందని ఆంధ్రజ్యోతి కథనంలో తెలిపారు.

"వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా!? మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మరాఠాలకు కోటా చట్టం ఈ తీర్పునకు వ్యతిరేకమా!? వెనకబడిన తరగతులకు లబ్ధి చేకూర్చే చట్టాలు చేయకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 మీకు అడ్డుకట్ట వేస్తోందా!? ఈ అంశాలపై మీ అభిప్రాయాలు చెప్పండి" అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలనూ సుప్రీం కోర్టు కోరింది. వీటితోపాటు రాజ్యాంగ సమాఖ్య విధానంపై 342ఏ అధికరణం ప్రభావం చూపిస్తోందా అని కూడా లిఖితపూర్వక జవాబు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇందిరా సహానీ కేసు విచారణ సందర్భంగా 1992లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరిమితిని కూడా పునః పరిశీలించాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. అవసరమైతే కేసును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని యోచిస్తోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారిన నేపథ్యంలో, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలను రాష్ట్రాలు కల్పించగలవా? లేదా? అనే అంశాన్ని ధర్మాసనం పరిశీలించనుంది.

నిజానికి, విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, 16 శాతం కోటా ఇస్తే సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్లను మించిపోతోందని, ఇది సమర్థనీయం కాదంటూనే.. ఉద్యోగాల్లో 12 శాతం; విద్యలో 13 శాతానికి మించి ఇవ్వరాదని సూచిస్తూ బోంబే హైకోర్టు ఆ చట్టాన్ని సమర్థించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.

నిర్దిష్ట కులం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడినదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగలదా? పార్లమెంటు మాత్రమే ఈ మేరకు చట్టం చేయగలదా? అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే, అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట కులాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనకబడినదని ప్రకటించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉందో లేదో తెలపాలని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగంలోని 102వ అధికరణం అడ్డుపడుతోందా? అని ప్రశ్నించింది. కేసు విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసిందని ఈ వార్తలో రాశారు.

జగన్

ఫొటో సోర్స్, ysrcongressparty

ఆంధ్ర ప్రదేశ్‌లో తొలిసారిగా మహిళా బడ్జెట్

దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో తొలిసారి మహిళా బడ్జెట్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని, అక్క చెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో ఈ బడ్జెట్‌ ద్వారా చెబుతామని సిఎం జగన్మోన్‌రెడ్డి తెలిపినట్లు ప్రజాశక్తిలో వార్త రాశారు.

‘‘తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన సిఎం మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా జెండర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు.

పని ప్రదేశాల్లో, ప్రయివేటు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు నిరోధించడానికి కమిటీలు అవసరమన్నారు. అయితే సచివాలయంలోనే దీనిపై కమిటీ లేదని, కమిటీల ఏర్పాటు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని సిఎస్‌ను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు సాధారణ సెలవులను గతంలో ఉన్న 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచామని చెప్పారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని ఆడపిల్లలంతా బడిబాట పట్టాలని అమ్మఒడి పథకాన్ని పెట్టామన్నారు.

కేవలం 21నెలల్లోనే అక్క చెల్లెమ్మల కోసం గోరుముద్ద, సంపూర్ణపోషణతో పాటు అమ్మఒడి ఇతర పథకాల ద్వారా రూ.80వేల కోట్లు అందిచామన్నారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఆసరా రూ.6,792 కోట్లు, వైఎస్‌ఆర్‌ పింఛను కానుక (మహిళలకు) రూ.15,613 కోట్లు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రూ.3,567 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద అక్క చెల్లెమ్మలకు రూ.1220 కోట్లు, జగనన్న విద్యా దీవెన రూ.1806 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను అందించామన్నారు.

నామినేటెడ్‌ పదవుల్లో కూడా వారు ముందుండాలని యాభై శాతం వారికే కేటాయించినట్లు చట్టం చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి దిశ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేశామని ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులను కూడా తీసుకొస్తామని చెప్పార’’ని ఈ కథనంలో తెలిపారు.

విశాఖపట్నం
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం

పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం

పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్‌ నిర్వహించేందుకు పురపాలక శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేశాయని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

అయితే, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు.

ఇదిలావుండగా.. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఏలూరు సహా 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 2,123 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించింది.

కాగా, ఈ సారి గణనీయంగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల్లో 89 డివిజన్లు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 490 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవం కావడం విశేషం.

నగర పాలక సంస్థల పరిధిలో 582 డివిజన్లు, పురపాలక సంఘాల పరిధిలో 1,633 వార్డులకు పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మునిసిపల్‌ ఎన్నికల్లో మొత్తం 7,552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో నగరపాలక సంస్థల పరిధిలో 2,571 మంది, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 4,981 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వారిలో పురుషులు 38,72,264 మంది కాగా.. మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో నగరపాలక సంస్థల పరిధిలో 48,31,133 మంది ఉండగా, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 30,40,139 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 7,915 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో నగరపాలక సంస్థల పరిధిలో 4,626 ఉండగా పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 3,289 ఉన్నాయి. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 4,788 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,468 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించగా.. 2,320 పోలింగ్‌ కేంద్రాలు అతి సున్నితమైనవిగా గుర్తించారు.

మొత్తంగా 48,723 మంది పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 1+4 చొప్పున పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)