You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ఖమ్మంలో లక్షమందితో షర్మిల బహిరంగ సభ - ప్రెస్ రివ్యూ
రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మిల.. ఏప్రిల్ 9న జనం ముందుకు రానున్నట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఖమ్మంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికపై పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి వై.ఎస్.ఆర్. తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడానికి అదే రోజును షర్మిల ఎంచుకున్నట్లు తెలిసిందని ఈ కథనం వెల్లడించింది.
ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎస్‌ఆర్ అభిమానులు గురువారం లోటస్‌పాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9న ఖమ్మంలో సభ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల చివరి సమావేశం ఖమ్మంలో చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో మార్గమధ్యంలో అభిమానులను పలకరిస్తూ వెళ్లాలని, అక్కడ ఆత్మీయ సమావేశంలో పాల్గొని గతంలో నిర్ణయించారు.
బుధవారం విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లుగానే మేలో మహిళలతోనూ సమావేశం నిర్వహించాలని షర్మిల బృందం భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది. .
కోవిడ్ ప్రైవేటు టీకా ఖరీదు రూ.500?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పొందేవారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటులో వేయించుకునే వారు మాత్రం కొంత డబ్బు చెల్లించాలని స్పష్టం చేయడంతో దాని ఖరీదు ఎంత ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోందని, సుమారు రూ.500 లోపే ఉండవచ్చని వైద్య వర్గాలు భావిస్తున్నట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
తెలంగాణలో 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు సుమారు 55 లక్షలమంది ఉంటారని , వీరిలో ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు పొందేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండొచ్చని వైద్యశాఖ అంచనా వేస్తోంది.
అయితే ప్రైవేటు టీకా ఖరీదును కేంద్ర ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఈ కథనం పేర్కొంది. ఒక లబ్ధిదారు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పొందాల్సి ఉండడంతో అంతకంటే ఎక్కువ ఖరీదు పెడితే స్పందన ఉండదేమోననే భావన వ్యక్తమవుతోంది.
మరోవైపు తెలంగాణలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 236 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను కలుపుకొని సుమారు 1500కి పైగా కేంద్రాల్లో టీకా పంపిణీకి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వీటిలో టీకాలు వేస్తారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆసుపత్రుల్లో కూడా టీకాలను పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ధర చెల్లించాల్సి ఉంటుంది.
నెల రోజుల్లోనే 100 రూపాయలు పెరిగిన వంట గ్యాస్ ధర
గ్యాస్ ధర ఒక నెలలో రూ. వంద పెరిగిందని, దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఈ నెలలోనే సిలిండర్‌పై రూ.75 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.846.50కి చేరిందని, మూడు నెలల కాలంలో గ్యాస్ ధర రూ.200 పెరిగిందని సాక్షి కథనం పేర్కొంది.
నవంబర్‌లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్‌లో ఏకంగా రూ.100 మేర పెరిగి పోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది.
జనవరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి.
సిలిండర్‌పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది.
వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ.180 పడుతోందన్నదని సాక్షి వెల్లడించింది. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారని ఈ కథనం పేర్కొంది.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు
తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి ఖాతాల తొలగింపు అంశంపై ఇటీవల ట్విట్టర్ కంపెనీతో జరిగిన కోల్డ్‌వార్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్రం కఠిన మార్గదర్శకాలను తీసుకొచ్చిందని పత్రిక ఒక కథనం ఇచ్చింది.
సోషల్,డిజిటల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) మాధ్యమాల్లో అభ్యంతరకర, విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు వీటిని జారీ చేస్తున్నట్టు పేర్కొంది.
దేశ భద్రత, శాంతి భద్రతలు, మహిళల గౌరవానికి భంగం కలిగించే వార్తలు, పోస్టులు, వీడియోలపై దేశంలో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి సంస్థ మూడంచెల వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.
మహిళలను నగ్నంగా చిత్రించటం, మార్పిడి చేసిన ఫొటోలను షేర్‌చేయటం వంటి తీవ్రమైన కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లో వాటిని తొలగించాలని స్పష్టంచేసింది. సోషల్, డిజిటల్, ఓటీటీ మాధ్యమాల్లో ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజుల్లో పరిష్కరించాలని నిబంధన విధించింది.
కొత్త మార్గదర్శకాలపై కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. మార్గదర్శకాలు ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైన మూడు నెలల్లో అన్ని సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందని తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది.
దేశంలో వ్యాపారం చేసుకొనేందుకు సోషల్‌మీడియా సంస్థలను సాదరంగా ఆహ్వానిస్తామని.. అదే సమయంలో తప్పుడు సమాచారం, దేశద్రోహం వంటి చర్యలకు ఆ మాధ్యమాలు వేదికలుగా మారటాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రులు స్పష్టంచేశారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికలతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- Hyperemesis: గర్భం దాల్చి వారాలు గడిచినా వాంతులు తగ్గట్లేదు, ఎందుకిలా? వాంతుల వల్ల బిడ్డకు హాని ఉంటుందా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)