వైఎస్ షర్మిల: తెలంగాణలో 'రాజన్న రాజ్యం' తెస్తాం.. అది మాతోనే సాధ్యం

ప్రచురణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నారని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ వద్ద ఉన్న ఆమె నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

''జై తెలంగాణ.. జోహార్ వైఎస్ఆర్.. జై షర్మిలక్క.. మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట.. వైఎస్‌ఆర్ కుటుంబానికి తెలుసు.. షర్మిలక్క నాయకత్వం వర్థిల్లాలి'' అని రాసి ఉన్న బ్యానర్లను అక్కడ ఏర్పాటు చేశారు.

ఈ బ్యానర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి.

నల్గొండ జిల్లాకు చెందిన అభిమానులతో వైఎస్ షర్మిల మంగళవారం సమావేశం అయ్యారు.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాట్లపైనే ఆమె చర్చించారని అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

లోటస్‌పాండ్‌కు భారీగా చేరిన అభిమానులు డప్పులు వాయిస్తూ, టపాసులు పేలుస్తూ సందడి వాతావరణాన్ని సృష్టించారు.

వారిని పలకరించేందుకు బయటకు వచ్చిన షర్మిలపై కాగితపు పూలను చల్లారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లేదని, దానిని తాను తీసుకొస్తానని వైఎస్ షర్మిల అన్నారు.

మంగళవారం నల్గొండ జిల్లా అభిమానులతో సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు తాను ప్రతి జిల్లా అభిమానులను కలవబోతున్నానని చెప్పారు.

తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

''రాజన్న రాజ్యం ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎందుకు రాకూడదు?'' అని ఆమె ప్రశ్నించారు.

రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకువస్తారా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ''తీసుకు వస్తాం'' అని బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)