You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ పీపీఈ కిట్ వేసుకొచ్చాడు... 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొట్టేశాడు - ప్రెస్ రివ్యూ
దేశ రాజధాని దిల్లీలో పీపీఈ కిట్‌ను ధరించిన ఓ వ్యక్తి బంగారం షాపులో చొరబడి రూ.13కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరిస్తారు. అయితే ఈ కిట్‌ను చోరకళలోనూ వాడేందుకు ప్రయత్నించాడో దొంగ.
తానెవరో గుర్తించకుండా ఉండేందుకు పీపీఈ కిట్ ధరించి ఓ జువెలరీ షొరూంలోకి చొరబడ్డాడు. దాదాపు 25 కిలోల బంగారు నగలను తస్కరించి ఉడాయించాడు.
కర్ణాటకలోని హూబ్లీకి చెందిన మహ్మద్ షేక్, దక్షిణ దిల్లీలోని కల్కాజీ ఏరియాలో మంగళవారం రాత్రి 9:30 గంటలకు సమీపంలో ఓ భవనం టెర్రెస్‌పై నుంచి దూకి జువెలరీ షోరూంలోకి ప్రవేశించాడు. అక్కడ వివిధ అరల్లో అమర్చిన నగలను సంచీలో వేసుకుంటూ తెల్లవారుజామున 3 గంటల దాకా షోరూంలోనేఉన్నాడు.
తర్వాత నగల సంచీతో బయటకొచ్చి ఓ ఆటోలో వెళ్లిపోయాడు. ఇంత జాగ్రత్తగా దొంగతనం చేసినా అతడి ప్రయత్నం వృథానే అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.
తెలంగాణలో తీయని మిర్చి-భౌగోళిక గుర్తింపుకు ప్రయత్నాలు
టమాటా మిర్చిగా పిలుచుకునే చపటా రకం మిరపకాయలకు భౌగోళిక గుర్తింపు కోసం తెలంగాణ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈనాడు ఒక కథనం ఇచ్చింది.
ఈ మిర్చి ఎక్కువ కారం లేకుండా కొంచె తీయగా ఉంటుందని, వరంగల్ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం రెండు నెలల్లో దరఖాస్తు చేయనున్నామని మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జేవీఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఈ తీయని మిర్చిని గత 70 ఏళ్లుగా పండిస్తున్నారు. కాప్సంథిన్ అనే పదార్ధం ఉండటంతో ఈ మిర్చి కాస్త తీయగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇది దేశంలోనే అరుదైన రకమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు ఎగుమతి అవుతోందని, ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వస్తే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యాన కేంద్ర శాస్త్రవేత్తలు తెలిపారు.
రెండో విడతలో ప్రధానికి టీకా
మొదటి విడత వ్యాక్సినేషన్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా అందించగా, 50 ఏళ్లకు పైబడిన వారికి రెండో విడతలో వ్యాక్సీన్ ఇస్తారని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.
ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా మెజారిటీ కేంద్ర మంత్రులు ఉంటారని ఈ కథనం పేర్కొంది.తొలి విడతలోనే వ్యాక్సీన్ పొందేందుకు తొందరపడవద్దని ప్రధాని మోదీ ప్రజాప్రతినిధులకు ఇంతకు ముందే సూచించారు.
మరోవైపు టీకా విషయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. ప్రపంచమంతా భారత్ నుంచి టీకా పొందేందుకు ఎదురు చూస్తున్నవేళ ఇలాంటి దుష్ప్రచారం దురదృష్టకరమని హర్షవర్ధన్ వ్యాఖ్యానించినట్లు సాక్షి పేర్కొంది.
శశికళకు కరోనా... ఐసీయూలో చికిత్స
ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళకు గురువారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు కొవిడ్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని ఈ కథనం వెల్లడించింది.
అక్రమ ఆస్తుల కేసులో గత నాలుగేళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్య తలెత్తాయి. దీంతో జైలు అధికారులు బుధవారం ఆమెను శివాజీ నగర్‌లోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. శశికళ ఈనెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)