You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ బయోటెక్ సందర్శనకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ: ప్రెస్ రివ్యూ
హైదరాబాద్‌లో తయారవుతున్న టీకా పురోగతిని పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 28న నగరానికి వస్తారని ఈనాడు వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
దాదాపు తొమ్మిది నెలలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడుగా టీకా తయారు చేసే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 28న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌ను సందర్శించనున్నారు.
దేశీయంగా ‘కరోనా’ టీకా తయారీ యత్నాల్లో భారత్ బయోటెక్ క్రియాశీలకంగా ఉన్న సంగతి విదితమే. ఈ సంస్థ ఆవిష్కరిస్తున్న కరోనా టీకా- కొవాగ్జిన్‌పై మొదటి, రెండు దశల క్లినికల్ పరీక్షలు పూర్తయి, ఇటీవల మూడో దశ పరీక్షలు మొదలయ్యాయి.
ఇవి పూర్తయిన వెంటనే ప్రభుత్వం దీనికి ‘అత్యవసర వినియోగ అనుమతి’ ఇచ్చే అవకాశం లేకపోలేదు. దేశ ప్రజలందరికీ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో టీకా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పత్రిక రాసింది.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్ వచ్చే ప్రధాని, జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ యూనిట్‌ను సందర్శిస్తారని తెలిపింది.
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌తో పాటు, పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కూడా ప్రధానమంత్రి శనివారం సందర్శించనున్నారు.
ఈనెల 28న భారత వాయుసేన విమానంలో ప్రధాని దిల్లీ నుంచి బయలు దేరి తొలుత పుణెలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ యూనిట్‌కు వెళ్తారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 5.10 వరకు అక్కడే ఉంటారు.
తిరిగి 5.35 గంటలకు హకీంపేటకు వెళ్లి అక్కడి నుంచి దిల్లీ తిరిగి వెళ్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు ఈనాడు వివరించింది.
మతకల్లోలాకు కుట్ర పన్నేవారిపై చర్యలు: డీజీపీ
తెలంగాణలో మత కల్లోలాలకు కుట్ర పన్నుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి బందోబస్తు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.
‘‘ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో.. హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ మతకల్లోలాలు సృష్టించేందుకు విద్రోహక శక్తులు కుట్రలు పన్నాయి. వారి ప్రతి కదలిక మాకు తెలుసు. ఇప్పటికైతే ఇంతకంటే వివరాలు చెప్పలేం. వారిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోనూ లేం. కానీ.. వారు యాక్షన్‌లోకి దిగేలోపే నిలువరిస్తాం’’ అని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆసరాగా చేసుకుని.. కుట్రలకు వ్యూహాలు పన్నుతున్న విద్రోహక శక్తులపై పక్కా సమాచారం ఉందని ఆయన వివరించారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్రోహకశక్తుల వ్యూహాలపై అన్ని కమిషనరేట్లు, జిల్లాలను అప్రమత్తం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారని జ్యోతి రాసింది.
‘‘రౌడీషీటర్లు, ట్రబుల్ మేకర్లపై నిఘా పెట్టాం. వారిని బైండోవర్ చేస్తున్నాం. మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్న వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 15 వందల కేసుల్లో నిందితులుగా ఉన్న 3,500 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీసు నిఘా కొనసాగుతుంది’’ అని వెల్లడించారు.
ప్రజల సహకారంతో ఎలాంటి ఘటనలు లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో 50 కేసులు నమోదు చేశామని డీజీపీ చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.
రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి ఎందుకుండదు?: ఏపీ హైకోర్టు
రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు.. మార్చే అధికారం ఎందుకుండదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించిందని సాక్షి పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు... అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది.
రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది.
అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించినట్లు సాక్షి రాసింది.
వెంటనే ఆ రికార్డులు ఇస్తామని శానససభ న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు హైకోర్టుకు నివేదించారు. అయితే బ్లూ కాపీ (అసెంబ్లీ రికార్డులు నిర్వహించే బుక్)ని మాత్రం స్పీకర్ అనుమతి తీసుకున్న తరువాతే ఇవ్వగలమని నివేదించారు.
ప్రస్తుతం స్పీకర్ రాష్ట్రంలో లేరని, ఆయన వచ్చిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకు హైకోర్టు అంగీకరించింది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగతావారు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కేసులను వరుసగా పిలిచి, ఏ కేసులో సంబంధిత న్యాయవాది వాదనలు వినిపించేందుకు రాలేదో వాటిని విచారణ జాబితా నుంచి తొలగించింది.
కొందరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసిందని సాక్షి వివరించింది.
ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు: తెలంగాణ ఎన్నికల సంఘం
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేవ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేయద్దని తెలంగాణ ఎన్నికల సంఘం సూచించినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రశాంతతను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో విద్వేషాలు రేగుతాయని, శాంతిభద్రతలు దెబ్బతింటాయని తెలిసి కూడా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు పదేపదే వారి మాటలను ప్రసారం చేస్తున్నాయి.
ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం తీవ్రంగా స్పందించింది. నాయకులు చేసే వ్యాఖ్యలను అతిశయోక్తిగా పదేపదే చూపిస్తూ వారికి వంతపాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అడ్డుతగిలేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ప్రసంగాలను అదేపనిగా ప్రసారం చేయొద్దని ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ గురువారం సూచించారని పత్రిక రాసింది.
ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్టు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గుర్తించామని ఎస్‌ఈసీ వెల్లడించింది.
ప్రచారంలో అభ్యర్థుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడొద్దని, పార్టీలపై నిరాధార విమర్శలు చేయరాదని స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు పత్రిక రాసింది.
మరోవైపు, ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ సూచించింది.
నిబంధనలను ఉల్లంఘించొద్దని ఆదేశిస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అడ్డుతగిలేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ప్రసంగాలను అదేపనిగా ప్రసారం చేయొద్దని ఆయన అందులో చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక వివరించింది..
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)