మోదీపై వారణాసిలో పోటీ చేయనివ్వలేదని బీఎస్ఎఫ్ మాజీ జవాన్ వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు - Newsreel

తేజ్ బహదూర్

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు గత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడంపై బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ దాఖలు చేసిన కేసులో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు తాను సమర్పించిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఆయన గతంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో, తేజ్ బహదూర్ ఆ కోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''వారణాసి నియోజకవర్గంలో బహదూర్ ఓటరు కాదు.. మోదీపై ఆయన పోటీ కూడా చేయలేదు''అని చెబుతూ ఆయన దాఖలుచేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో అపీలును దాఖలుచేశారు.

వారణాసిలో మోదీపై పోటీ చేయాలని తేజ్ బహదూర్ భావించారు. అయితే, నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని చెబుతూ ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

అయితే, తన నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కోర్టు విచారణ చేపట్టాలని, తగిన ఆదేశాలు ఇవ్వాలని తేజ్‌ బహదూర్ డిమాండ్ చేస్తున్నారు.

బీఎస్‌ఎఫ్‌లో పెట్టే భోజనం సరిగ్గా లేదంటూ బహదూర్ చేసిన వీడియో 2017లో వైరల్ అయ్యింది. దీంతో ఆయన్ను బీఎస్‌ఎఫ్ డిస్మిస్ చేసింది.

సీ స్కూటర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

స్కామ్‌చేసి జేమ్స్‌బాండ్‌లా ''సీ స్కూటర్‌''తో నీళ్లలోకి వెళ్లిపోయాడు.. తర్వాత ఏమైందంటే?

ఆయన చేసిన పని జేమ్స్‌బాండ్‌ విన్యాసాన్ని తలపిస్తుంది. కానీ జనాలకు టోపిపెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఎఫ్‌బీఐకు కూడా అలానే టోకరా వేద్దామని అనుకున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన 44ఏళ్ల మాథ్యూ పీయెర్సీపై ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. సోమవారం ఆయన్ను అరెస్టు చేయడానికి ఎఫ్‌బీఐ అధికారులు వచ్చారు. అయితే అరెస్టును తప్పించుకునేందుకు ఆయన విశ్వప్రయత్నమే చేశారు.

మొదట ఆయన కారులో పరారయ్యారు. తర్వాత సీ స్కూటర్ తీసుకొని గడ్డకట్టే ఉష్ణోగ్రతలున్న చెరువు లోకి దూకి లోపలకు వెళ్లిపోయారు.

25 నిమిషాలపాటు ఆయన లోపలే ఉండిపోయారు. నీటిపై బుడగలను అధికారులు అలా గమనిస్తూనే ఉన్నారు. చివరగా పైకి రాగానే చేతికి బేడీలువేసి తీసుకుపోయారు.

సీ స్కూటర్‌

ఫొటో సోర్స్, Getty Images

స్థానిక చర్చిలో పొంజి కుంభకోణంతో 35 మిలియన్ డాలర్లను కొల్లగొట్టినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

స్కూబా గేర్ వేసుకొని సీ స్కూటర్ల సాయంతో నీటి అడుగుకు వెళ్లిపోవచ్చు. జేమ్స్‌బాండ్ సినిమా థండర్‌బాల్‌లో నీటి యుద్ధానికి ఇవి ఉపయోగించినట్లు చూపిస్తారు. చాలా దేశాల సైన్యాల దగ్గర ఈ సీ స్కూటర్లు ఉన్నాయి.

మాథ్యూ ఉపయోగించిన సీ స్కూటర్ యమహా 350 ఎల్‌ఐ మోడల్. దీనితో గంటకు 6.5 కి.మీ. వేగంతో ప్రయాణించొచ్చు. నీటిలో 100అడుగుల లోతు వరకు వెళ్లొచ్చు.

విన్సెంట్ రెఫెట్: ఫ్రెంచ్ జెట్‌మ్యాన్ కన్నుమూత

జెట్‌ప్యాక్‌లతో అబ్బురపరిచే విన్యాసాలుచేసే ఫ్రెంచ్ స్టంట్‌మ్యాన్ దుబాయ్‌లో జరిగిన ఒక ప్రమాదంలో కన్నుమూశారు.

''జెట్‌మ్యాన్ దుబాయ్'' కంపెనీలో విన్సెంట్ రఫెట్ పనిచేసేవారు.

36ఏళ్ల విన్సెంట్.. ఆల్ప్స్ పర్వతాలపై, దుబాయ్‌ తీరంలో అబ్బురపరిచే విన్యాసాలు చేశారు.

విన్సెంట్ రఫెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విన్సెంట్ రఫెట్

దుబాయ్‌లో ట్రైనింగ్ సమయంలో విన్సెంట్ మరణించారని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. విన్సెంట్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

''విన్సెంట్ ఒక ప్రతిభావంతుడైన అథ్లీట్. ఆయన్ను అందరూ గౌరవిస్తారు. ప్రేమిస్తారు..''అని సంస్థ తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు సంఘీభావం ప్రకటించింది.

విన్సెంట్ తల్లిదండ్రులు స్కైడైవర్లే. తన జీవిత కాలంలో విన్సెంట్ చాలా స్టంట్లు చేశారు. బుర్జ్ ఖలీఫా పై నుంచి బంజీ జంప్ కూడా చేశారు.

''మేం రోజూ కొత్తకొత్తగా ఏదో ఒకటి చేస్తుంటాం. మాకు చాలా కలలు ఉన్నాయి. జీవితం చాలా చిన్నది''అని గత నెలలో ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

జీనా అలీ

ఫొటో సోర్స్, Instagram/New Zealand Police

ఫొటో క్యాప్షన్, జీనా అలీ

న్యూజీలాండ్ పోలీస్ యూనిఫామ్‌లో హిజాబ్

ముస్లిం మహిళలను పోలీసు దళాల్లో చేరేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా న్యూజీలాండ్ పోలీసులు తమ యూనిఫామ్‌లలో హిజాబ్‌ను కూడా చేర్చారు.

ఇటీవల విధుల్లోకి చేరిన కానిస్టేబుల్ జీనా అలీ.. హిజాబ్ ధరించిన తొలి మహిళా అధికారిగా రికార్డు సృష్టించబోతున్నారు.

తమ దేశ భిన్నత్వం ప్రతిబింబించేలా చూడటమే లక్ష్యంగా తాజా మార్పులు చేసినట్లు పోలీసుల అధికార ప్రతినిధి తెలిపారు.

లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు, స్కాట్లాండ్ పోలీసులు ఇప్పటికే ఇలాంటి యూనిఫామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

బ్రిటన్‌లో 2006లోనే లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఈ మార్పులు తీసుకొచ్చారు. స్కాట్లాండ్‌లో 2016లో హిజాబ్ యూనిఫామ్‌లలో భాగమైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు 2004లో హిజాబ్‌ను యూనిఫామ్‌లలో భాగంగా గుర్తించారు.

హిజాబ్ ధరించే తొలి కానిస్టేబుల్‌గా రికార్డు సృష్టించబోతున్న జీనా.. ఫిజీలో పుట్టారు. చిన్న వయసులోనే ఆమె న్యూజీలాండ్ వచ్చేశారు. క్రైస్ట్‌చర్చ్ దాడి అనంతరం పోలీసు విధుల్లో చేరాలని ఆమె సంకల్పించుకున్నారు.

''మరింత మంది ముస్లిం మహిళలు పోలీసు విభాగంలో చేరాలి. ప్రజలకు సాయం చేయాలి. అదే లక్ష్యంతో నేను విభాగంలో చేరాను''అని ఆమె వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటు

ట్రంప్‌తో క్రిస్ క్రెబ్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌తో క్రిస్ క్రెబ్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తను చేస్తున్న ఆరోపణలకు విరుద్ధంగా స్పందిన ఓ ప్రముఖ ఎన్నికల నిర్వహణ అధికారిపై డోనల్డ్ ట్రంప్ వేటువేశారు.

ఓటింగ్‌, కౌంటింగ్‌లపై వ్యాఖ్యలు చేసినందుకే సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సిసా) అధిపతి క్రిస్ క్రెబ్స్‌పై వేటు వేసినట్లు ట్రంప్ స్పష్టంచేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ అంగీకరించని సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే, అమెరికా చరిత్రల్లోనే అత్యంత భద్రంగా, నిజాయితీగా జరిగిన ఎన్నికలు ఇవేనని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజంలేదని, అవన్నీ వదంతులేనని సిసా వెబ్‌సైట్ కొట్టిపారేసింది. దీంతో సిసా అసిస్టెంట్ డైరెక్టర్ బ్రియన్ వారేతో గతవారం వైట్‌హౌస్ రాజీనామా చేయించింది. అనంతరం సిసా డైరెక్టరైన క్రెబ్స్‌ పైనా తాజాగా చర్యలు తీసుకుంది.

''ఎన్నికల నిర్వహణ వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయని చెబుతున్న ఆరోపణలపై 59 మంది ఎన్నికల భద్రతా నిపుణులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ వదంతులు మాత్రమే'' అని క్రెబ్స్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన్ను తొలగిస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత భద్రంగా జరిగాయని గతవారం ప్రకటించిన సీనియర్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారుల్లో ఆయన కూడా ఒకరు.

''ఓటింగ్ యంత్రాల గురించి నిరాధారమైన వార్తల్ని రీట్వీట్ చేయొద్దు. అవి అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్లు అయినా సరే..'' అంటూ ఓ ఎన్నికల నిపుణుడు చేసిన ట్వీట్‌ను కూడా క్రెబ్స్ రీట్వీట్ చేశారు.

తనపై చర్యలు తీసుకున్న తర్వాత కూడా క్రెబ్స్ మరో ట్వీట్‌ చేశారు.

''నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదని భావిస్తున్నాను. నేడు వ్యవస్థలకు మద్దతు పలకండి. భవిష్యత్‌ను భద్రం చేసుకోండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)