నగార్నో-కరాబక్: కుప్పకూలిన రష్యా హెలికాప్టర్, ఇద్దరు మృతి- NewsReel

ఫొటో సోర్స్, Getty Images
రష్యాకు చెందిన ఎంఐ-24 సైనిక హెలికాప్టర్ అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలోని అర్మేనియా భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది చనిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
గాయపడిన మరో సైనికుడిని ఆస్పత్రికి తరలించారని టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఓ క్షిపణి దాడిలో ఈ హెలికాప్టర్ కూలినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
నగార్నో-కరాబక్ ప్రాంతం విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా గత కొంత కాలంగా అర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. పరస్పరం బాంబులు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అర్నబ్ గోస్వామికి బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు
జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.
బెయిల్ కోసం అర్నబ్ సెషన్ కోర్టును ఆశ్రయించవచ్చని బాంబే హైకోర్టు సూచించింది.
ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర పోలీసులు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Chranjeevi/Facebook
మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్
ఆచార్య సినిమా షూటింగ్ పునః ప్రారంభించేందుకు ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్ష చేయించుకుంటే దురదృష్టవశాత్తు పాజిటివ్ వచ్చిందని సినీ నటుడు చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే, ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం క్వారంటైన్లో ఉంటున్నానని ఆయన అన్నారు.
గత అయిదు రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నానని కూడా తెలిపిన చిరంజీవి, తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తానని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

అయితే, చిరంజీవి మూడు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. కేసీఆర్‌ను కలిసినప్పుడు వారు మాస్కులు తీసి చేతిలో పట్టుకుని కనిపించారు.
నిన్న (ఆదివారం) టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు.
జమ్మూకశ్మీర్ ఎదురు కాల్పుల్లో ఇద్దరు తెలుగు జవాన్లు మృతి

జమ్మూ-కశ్మీర్ మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తెలుగు సైనికులు మృతిచెందారు. మరో సైనికాధికారి, సిపాయి కూడా మరణించారు. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు దుండగులు మరణించారు.
చొరబాటుకు యత్నించిన వారిని అడ్డుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్(26), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36) ఉన్నారు.

మహేష్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌కు చెందిన సైనిక కమాండర్ కూతురు సుహాసినిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో పట్టుదలతో చదివి 2014-15లో మహేష్ సైన్యంలోకి ఎంపికయ్యారు.
ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మరో సైనికుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల గ్రామానికి చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మల కుమారుడైన ప్రవీణ్ హవల్దార్‌గా పని చేస్తూ కమెండో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు భార్య రజిత. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయం సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం గాలింపు చేపట్టింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు దిగారని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్‌తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్ నుంచి హైదరాబాద్ సన్‌రైజర్స్ ఔట్... ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్

ఫొటో సోర్స్, BCCI/IPL
ఎట్టకేలకు 13 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత దిల్లి క్యాపిటల్స్ ఐపీల్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ దూకుడుగా ఆడడమే కాకుండా కొంత అదృష్టం కలిసిరావడంతో ఫైనల్స్‌కు చేరుకుంది.
ఐపీఎల్-13 క్వాలిఫయర్-2లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నాలుగు విజయాలతో మంచి ఫాంలో ఉంది. ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌ను కూడా రెండుసార్లు ఓడించింది. ఆ రెండు మ్యాచుల్లోనూ దిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి చతికిలబడింది.
ఈసారి మాత్రం దిలీ క్యాపిటల్స్ క్యాప్టన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
శిఖర్ ధావన్‌తో కలిసి మార్కస్ స్టాయినిస్ మొదట బ్యాటింగ్‌కు దిగాడు. మూడో ఓవర్లో జాసన్ హోల్డర్, స్టాయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో దిల్లీ క్యాపిటల్స్ దశ తిరిగింది. ఈ క్యాచ్‌కు ముందు స్టాయినిస్ ఏడు బంతుల్లో మూడు పరుగులు చేయగా, క్యాచ్ వదిలేసిన తరువాత ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 బంతుల్లో 38 పరుగులు చేసాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
స్టాయినిస్ దూకుడుగా ఆడుతుండడంతో శిఖర్ ధావన్ కూడా ఊపందుకున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో బ్యాటింగ్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన శిఖర్ ధావన్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో దిల్లీ బౌలర్లు కూడా విజృంభించారు. కగిసో రబాడా 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు. బౌలింగ్‌లో కూడా రాణించి మూడు వికెట్లు తీసిన స్టాయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

ఫొటో సోర్స్, BCCI/IPL
సన్‌రైజర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 45 బంతుల్లో 67 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, 16 బంతుల్లో 33 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్ జట్టును గట్టెక్కించే ప్రయత్నాలు చేసినప్పటికీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓడిపోయింది.
మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























