You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020: ఒకే రోజు రెండు మ్యాచ్‌ల్లో 3 సూపర్ ఓవర్లు... ఉత్కంఠభరిత పోరులో ముంబయిపై పంజాబ్, హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం
ఐపీఎల్-13లో ఆదివారం రాత్రి దుబయిలో జరిగిన మ్యాచ్‌లో ఆ డ్రామా, ఆ ఉత్కంఠ, ఆ క్లైమాక్స్ ముంబై ఇండియన్స్ -కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లకే కాదు, ఈ మ్యాచ్ చూసిన ప్రేక్షకులకు కూడా చాలా రోజులు గుర్తుండిపోతుంది.
రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. ఫలితం కోసం రెండోసారి సూపర్ ఓవర్.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
177 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కేఎల్ రాహుల్ 77 పరుగుల సాయంతో 20 ఓవర్లలో 6 వికెట్లే కోల్పోయి 176 పరుగులే చేయగలిగింది.
ఫలితం సూపర్ ఓవర్. మొదట ఆడిన పంజాబ్ 5 పరుగులే చేయగా, ముంబయి కూడా కూడా ఐదు పరుగులే చేయగలిగింది.
ఈ సూపర్ ఓవర్లో మొదట అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబయి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రాహుల్, పూరన్‌ను కట్టడి చేస్తే, అతడితో పోటీపడి బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా డికాక్, రోహిత్‌లకు 5 పరుగులకే ఇచ్చాడు.
చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో రెండో పరుగుకు ప్రయత్నించిన డికాక్ రనౌట్ కావడంతో ఫలితం మరో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
రెండో సూపర్ ఓవర్‌లో ముంబయి ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య బరిలోకి దిగారు. పంజాబ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ బౌలింగ్ చేశాడు.
మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి.
మూడో బంతికి పొలార్డ్ ఫోర్ కొట్టాడు.
నాలుగో బంతికి హార్దిక్ రనౌట్ అయ్యాడు.
ఐదో బంతికి పొలార్డ్ అవుట్ ఇచ్చారు. కానీ రివ్యూలో అతడు నాటౌట్ అని తేలింది.
పొలార్డ్ కొట్టిన ఓవర్ చివరి బంతి సిక్స్ అనుకున్న సమయంలో మయంక్ అగర్వాల్ బౌండరీ లైన్ ముందు గాల్లోకి ఎగిరి దాన్ని అద్భుతంగా అడ్డుకున్నాడు.
దీంతో ముంబయికి రెండు పరుగులే వచ్చాయి. మొత్తం 11 పరుగులు.
పంజాబ్‌కు విజయం కోసం 12 పరుగులు చేయాలి. ముంబయి బౌలర్ ట్రెంట్ బోల్ట్ సూపర్ ఓవర్ వేశాడు. క్రిస్ గేల్, మయంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.
మొదటి బంతికి క్రిస్ గేల్ సిక్స్ కొట్టాడు.
రెండో బంతికి గేల్ ఒక రన్ తీశాడు.
మూడు, నాలుగు బంతులను ఫోర్లుగా మలిచిన మయంక్ అగర్వాల్ పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కే.ఎల్.రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు ముంబయి చుక్కలు చూపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ గత మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచిన పంజాబ్, ముంబయికి కూడా గట్టి పోటీ ఇచ్చింది. చివరికి మ్యాచ్ సొంతం చేసుకుంది.
మొదట విజయం తృటిలో చేజార్చుకున్న పంజాబ్, రెండు సూపర్ ఓవర్లలో పోరాడి చివరికి దానిని ఒడిసిపట్టింది.
ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో నంబరుకు చేరింది.
సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్
ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా నైట్ రైడర్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది.
రెండు టీముల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ మొదలైంది.
సూపర్ ఓవర్లో మొదట హైదరాబాద్ బ్యాటింగ్ చేయగా లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ చేశాడు.
మొదటి బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు.
రెండో బంతికి సమద్ రెండు పరుగులు తీశాడు.
మూడో బంతికి సమద్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో హైదరాబాద్ 2 పరుగులే చేయగలిగింది.
కోల్‌కతాకు 3 పరుగుల లక్ష్యంతో మోర్గాన్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కు దిగారు.
రషీద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్లో మొదటి బంతికి పరుగు రాలేదు.
రెండో బంతికి మోర్గాన్ ఒక పరుగు చేశాడు.
మూడో బంతికి పరుగు రాలేదు.
నాలుగో బంతికి లెగ్ బైగా రెండు పరుగులు రాయడంతో విజయం నైట్ రైడర్స్ ఖాతాలోకి వెళ్లింది.
ఐపీఎల్13లో కోల్‌కతాకు ఇది ఐదో విజయ కాగా, హైదరాబాద్‌కు ఆరో ఓటమి, సన్ రైజర్స్ కు ఇది హ్యాట్రిక్ పరాజయం.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నాలుగో స్థానంలో, హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- వీరప్పన్: గంధపు చెక్కల స్మగ్లర్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. వీరప్పన్ నేరాల్లో వారి పాత్రేమిటి
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)