కరోనావైరస్ టీకా పంపిణీకి భారత్‌లో సన్నాహాలు... తొలి దశలో అందేది వీరికి మాత్రమే: ప్రెస్ రివ్యూ..

ప్రచురణ

భారత్‌లో కరోనా టీకా పంపిణీకి సన్నాహాలు ప్రారంభమైనట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తోంది.

టీకా పంపిణీకి సంబంధించి నీతీ ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తొలుత ఎవరికి ఇవ్వాలనే అంశమై ముసాయిదా రూపొందిస్తోందని పత్రిక చెప్పింది.

ఈ బృందానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సహ చైర్మన్‌.

అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి.. సమాన స్థాయి పంపిణీ, అవసరాల ఆధారంగా కార్యాచరణ తయారు చేస్తోంది.

ఇందులో భాగంగా వైరస్‌ ముప్పు ఎక్కువ ఉన్నవారిని 4 విభాగాలుగా వర్గీకరించింది. ఈ ప్రకారం ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులున్న 30 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందనుందని కథనంలో రాశారు.

మొత్తం 60 కోట్ల డోస్‌లను ఒక్కొక్కరికి రెండు డోస్‌ల (సాధారణ, బూస్టర్‌) చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే ప్రక్రియ సాగుతోందని.. నెలాఖరు లేదా నవంబరు తొలి రోజుల నాటికి పూర్తవుతుందని కమిటీ సభ్యుడొకరు తెలిపారని పత్రిక చెప్పింది.

కాగా, దేశ జనాభాలో 23 శాతం మందికి తొలి విడతలో టీకా దక్కనుంది. వీరిలో 50 ఏళ్లు పైబడినవారు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ తదితర (కొమార్బిడిటీస్‌) వ్యాధులున్న 50 ఏళ్లలోపువారే 26 కోట్ల మంది వరకు ఉన్నారు.

మరోవైపు దేశంలో ప్రస్తుతం మూడు టీకాలు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి.

వీటిలో అన్నిటికంటే ముందుగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా, పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా టీకాలు మూడో దశ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. వీటి సమాచారం మేరకు, నవంబరు చివరికి లేదా డిసెంబరు మొదటి వారానికి టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

దేశంలోని ప్రజలందరికీ సత్వరమే టీకా అందేలా సర్వసన్నద్ధంగా ఉండాలని.. ఎన్నికల నిర్వహణ, విపత్తుల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఏ స్థాయిలో అయితే మమేకమై పనిచేస్తుందో అదే స్థాయిలో టీకా పంపిణీ వ్యవస్థ ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారని పత్రిక తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితి, టీకా పంపిణీ సన్నద్ధతపై శనివారం ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

మహిళల భద్రత కోసం ఏపీలో ఆటోలు, ట్యాక్సీల్లో ప్యానిక్ బటన్లు

మహిళలపై ఆగడాల్ని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆటోలు, ట్యాక్సీల్లో ప్యానిక్‌ బటన్లు ఏర్పాటు చేయనున్నట్లు సాక్షి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఓ ప్రాజెక్ట్‌ అమల్లోకి రానుంది.

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రయోగాత్మకంగా విశాఖలో తొలుత వెయ్యి ఆటోలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి.. ఆటోల్లో ప్యానిక్‌ బటన్లు అమరుస్తారు.

ఈ నెలాఖరున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వాటిని సరిచేసి రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తారని సాక్షి రాసింది.

ఈ ప్రాజెక్ట్‌ అమలుకు రూ.138 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం 2015లోనే రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది.

ప్యానిక్ బటన్ లా పని చేస్తుంది...

రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) బాక్స్‌లు అమరుస్తారు. తద్వారా ఆ వాహనాలన్నీ రవాణా, పోలీస్‌ శాఖ కాల్‌ సెంటర్లు, కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానం అవుతాయి.

ఐఓటీ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు. ఆ కార్డులను వాహనం ఇంజన్‌ వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే సదరు వాహనం స్టార్ట్‌ అవుతుంది.

ప్రయాణంలో మహిళలు ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే.. ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సరిపోతుంది. సదరు వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని పోలీసులు ఇట్టే పట్టేస్తారు. వెంటనే వాహనం వద్దకు చేరుకుని ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు క్షణాల్లోనే భద్రత కల్పించి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తారని పత్రిక చెప్పింది.

ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్‌ను రూపొందించింది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు.

వాటిని అనుసంధానిస్తూ ప్రతి ఆటో, క్యాబ్‌లో ప్యానిక్‌ బటన్లు అమరుస్తారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) ద్వారా ఆ వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. రవాణా శాఖ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కూడా సమాచారం వెళుతుందని సాక్షి వివరించింది.

హైదరాబాద్‌లో సిమ్ స్వాపింగ్, 86 లక్షలు స్వాహా

సెల్ ఫోన్ సిమ్ స్వాపింగ్‌తో లక్షలు కొట్టేసిన ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

సిమ్‌ స్వాపింగ్‌తో రూ. 86 లక్షలు దోచి, డబ్బును బిట్‌ కాయిన్స్‌ రూపంలో నైజీరియాకు పంపుతున్న ముఠాను సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి డీసీబీ బ్యాంకులో మూడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలుండగా.. అవన్నీ తన మెయిల్‌, మొబైల్‌నంబర్‌కు లింక్‌ చేసి ఉన్నాయి.

గత నెల 5 నుంచి మొబైల్‌ నంబర్‌ పనిచేయలేదు. 20వ తేదీన నంబర్‌ను రీ యాక్టివేట్‌ చేయించగా.. ఓటీపీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ ఏకధాటిగా వచ్చాయి.

అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఖాతాల్లో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోగా.. ఈ మూడు ఖాతాల నుంచి దాదాపు రూ.50 లక్షలు బదిలీ అయ్యాయని తేలింది.

వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో మరో వ్యాపారి రూ. 36 లక్షలు కోల్పోయాడు. సిమ్‌ స్వాపింగ్‌తో మోసం జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

బాధితుల ఖాతాల నుంచి బదిలీ అయిన అకౌంట్ల వివరాలు సేకరించారు. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన సాగర్‌ మహతో, కుమార్‌ గౌరవ్ ‌సింగ్‌, సంజయ్‌ అగర్వాల్‌ను ట్రాన్సిట్‌ వారెంట్ల మీద అరెస్టు చేశారు.

ఇదే తరహాలో సిమ్‌ స్వాపింగ్‌తో ముంబైకి చెందిన వ్యాపారి ఖాతా నుంచి రూ 2 కోట్లు కొట్టేసినట్టు సంజయ్‌ మహతో ఒప్పుకొన్నాడు.

ఈ ముఠాకు నాయకుడు నైజీరియాకు చెందిన షెడ్రిక్‌పాల్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా తమ ఖాతాలకు వచ్చిన నగదును 20 % కమీషన్‌గా తీసుకొని బిట్‌కాయిన్‌ రూపంలో షెడ్రిక్‌కు పంపుతున్నట్టు పోలీసులు నిర్ధరించారు.

సిమ్‌ స్వాపింగ్‌ అంటే?

వైరస్‌తో కూడిన లింక్‌ను సృష్టించడం.. వాటిని వేలాది మందికి మెయిల్స్‌, వాట్సాప్‌, ఎస్సెమ్మెస్‌గా పంపిస్తారు. తెలీకుండా దానిని క్లిక్‌ చేస్తే వైరస్‌ మన ఫోన్‌, కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుంది.

ఈ వైరస్‌ స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లో జరిగే లావాదేవీలన్నింటినీ సైబర్‌ నేరగాళ్లకు చూపుతుంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను వారు పరిశీలిస్తారు.

మెయిల్స్‌తోపాటు ఫోన్‌ నంబర్ల వివరాలను సేకరిస్తారు. తమ ఏజెంట్ల ద్వారా సిమ్‌కార్డ్స్‌ అవుట్‌లెట్‌లో కొత్త సిమ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయిస్తారు.

బాధితుడికి తెలియకుండానే ఫోన్‌ డిస్‌ కనెక్ట్‌ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించేలోపే ఖాతా ఖాళీ అయిపోతుందని సాక్షి వివరించింది. .

కృష్ణమ్మ మహోగ్ర రూపం, 2009 తర్వాత శ్రీశైలానికి భారీ వరద

కృష్ణానదికి వరద పోటెత్తిందని, 2009 తర్వాత శ్రీశైలానికి భారీ వరద వచ్చిందని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. శ్రీశైలంలోకి 7 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవాహం వచ్చింది. అక్టోబరులో ఇంత భారీ వరద రావడం అరుదే.

2009 అక్టోబరులో శ్రీశైలం చరిత్రలోనే అత్యధికంగా 17.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైందని పత్రిక రాసింది.

బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి ఉండొచ్చని అప్పట్లో నీటిపారుదల శాఖ అంచనావేసింది.

ఆ తర్వాత మళ్లీ అక్టోబరులో భారీ వరద రావడం ఇదే. గత ఏడాది అక్టోబరు 25న 6.52 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరుసగా నాలుగురోజుల పాటు భారీ వరద ప్రవాహం కొనసాగింది.

ఇప్పుడూ గత కొన్ని రోజులుగా భారీ వరద ఉండగా, శనివారం ఉదయం ఆరుగంటలకు నీటిపారుదల శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం 7.02 లక్షల క్యూసెక్కులు వచ్చింది.

ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు మించి అనేకసార్లు వచ్చింది. విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడమే కాకుండా గేట్లు ఎత్తి ఎక్కువరోజులు నీటిని విడుదల చేశారని కథనంలో చెప్పారు.

ఆగస్టు రెండోవారం నుంచి ఇప్పటివరకు 50 రోజులకు పైగా స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రధాన నది కృష్ణాతో పాటు బీమా, తుంగభద్ర ఇలా అన్ని నదుల నుంచీ భారీ ప్రవాహం కొనసాగుతోంది.

వారం రోజులుగా అన్ని రిజర్వాయర్లలోకి అత్యధిక ప్రవాహం ఉండగా, ఎందులోనూ నిల్వ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని పత్రిక తెలిపింది.

శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌ కూడా నీటమునిగింది. నాగార్జునసాగర్‌, పులిచింతల కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి.

దీంతో మొత్తం నీరు సముద్రంలోకి వెళ్తోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి 6.82 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.

ఇప్పటివరకు 910 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. గోదావరిలో ఇప్పటివరకు 3500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)