ఖుష్బూ: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సినీ నటి- NewsReel

ప్రముఖ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ సుందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకు ముందే ఆమెను పార్టీ ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
ఏఐసీసీ ప్రతినిధి పదవి నుంచి ఆమె తొలగింపు తక్షణం అమలులోకి వస్తుందని కాంగ్రెస్ సమాచార వ్యవహారాల ప్రతినిధి ప్రణబ్ ఝా ప్రకటించారు.
రాజీనామాకు ముందు ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సమయంలో తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని గుర్తు చేశారు.
పేరు, డబ్బు కోసం పార్టీలోకి రాలేదని, పై స్థాయిలోని కొందరు వ్యక్తులకు గ్రౌండ్ రియాలిటీలు తెలియవని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి పార్టీలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె తన లేఖలో ఆరోపించారు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల నుంచి తాను స్ఫూర్తి పొందుతానని, సోనియాగాంధీకి ఆరాధకురాలినని ఖుష్బూ తరచూ చెప్పేవారు. తన కుటుంబానికి, కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె అనేవారు. పొలిటికల్ ఇన్నింగ్స్‌ను కాంగ్రెస్‌తోనే మొదలు పెడతానని గతంలో ప్రకటించిన ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

ముంబయిలో నిలిచిన విద్యుత్ సరఫరా... స్తంభించిన మహానగరం
ముంబయి మహానగరంలో సోమవారం విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. గ్రిడ్ వైఫల్యం వల్ల విద్యుత్ సరఫరాలో ఈ అంతరాయం తలెత్తినట్లు బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ చెప్పింది.
ఈ అంతరాయం నగరంలో జనజీవనం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. లోకల్ రైళ్లు దారి మధ్యలోనే ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఆగిపోయాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముంబయి సెంట్రల్, థానే, జోగేశ్వరి, వాడాలా, చెంబూరఓ, బోరివలి, దాదర్, కండివలి, మీరా రోడ్ తదితర ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సాధారణంగా ముంబయి నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదు. టాటా సంస్థ నుంచి విద్యుత్ సరఫరా వైఫల్యం ఈ అంతరాయానికి కారణమని బెస్ట్ ఎలెక్ట్రిసిటీ సంస్థ ట్వీట్ చేసింది.
ఒక గంటలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఇంధన మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు.
చైనాలోని చింగ్‌డావ్ నగర జనాభా మొత్తానికి అయిదు రోజుల్లో కోవిడ్ టెస్టులు

ఫొటో సోర్స్, Barcroft Media
చైనాలోని చింగ్‌డావ్ నగరంలోని మొత్తం జనాభాకు కోవిడ్ పరీక్షలు చేయబోతున్నారు. ఈ నగరంలో 90 లక్షలకు పైగా ఉన్న ప్రజలందరికీ అయిదు రోజుల్లో కరోనావైరస్ పరీక్షలు పూర్తి చేస్తామని చైనా ప్రకటించింది.
విదేశీ రోగులకు చికిత్సలు అందించే స్థానిక ఆస్పత్రిలో కొత్తగా పన్నెండు కోవిడ్ కేసులు నమోదు కావడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
వూహాన్ నగరంలోని కోటీ 10 లక్షల జనాభా మొత్తానికి చైనా గత మే నెలలో కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ అంతర్జాతీయ మహమ్మరికి వూహాన్ నగరమే కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే.
అయితే, చైనా ఈ వైరస్‌ను ఇప్పటికే చాలా వరకు అదుపు చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు కరోనావైరస్ వ్యాప్తితో పోరాడుతుంటే, దానికి ఆరంభ బిందువుగా నిలిచిన చైనా మాత్రం ఆ మహమ్మారిని కట్టడి చేయగలిగింది.
చింగ్‌డావ్ నగరంలో ఆరు కొత్త కేసులు, మరో ఆరు లక్షణాలు లేని కేసులు నమోదయ్యాయని అక్కడి మున్సిపల్ హెల్త్ కమిషన్ చైనా సోషల్ మీడియా సైట్ వెయిబోలో వెల్లడించింది. ఈ కేసులన్నీ ఆ ఒక్క ఆస్పత్రికి చెందినవేనని చైనా పత్రిక 'గ్లోబల్ టైమ్స్' తెలిపింది.
ఎక్కడ ఏ కొద్ది సమూహానికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయినా సామూహిక కోవిడ్ పరీక్షలు నిర్వహించే వ్యూహాన్ని చైనా సమర్థంగా అమలు చేస్తోంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం

ఫొటో సోర్స్, Kavitha/Facebook
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో గెలిచారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయితన తరువాత ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించారు.
ఈ ఎన్నికలు అక్టోబర్ 9న జరిగాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. వాటిలో కవితకు 728 ఓట్లు రాగా, బీజేపీకి 56 ఓట్లు వచ్చాయి. 29 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి లభించాయి. 10 ఓట్లు చెల్లుబాటు కాలేదు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల మద్దతుతో కవితకు 505 వోట్లు ఖాయంగా వస్తాయని ఎన్నికలకు ముందు అంచనా వేశారు. అయితే, ఆ అంచనాలకు మించి ఆమెకు మెజారిటీ లభించింది. ఇతర పార్టీల నుంచి వలసలు, క్రాస్ వోటింగ్ మూలంగా మెజారిటీ భారీ స్థాయిలో వచ్చిందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























