WHO: ‘ప్రతి పదిమందిలో ఒకరికి కరోనావైరస్’ - BBC NewsReel

ప్రచురణ

ప్రపంచంలోని ప్రతి పదిమందిలో ఒకరికి కోవిడ్‌-19 వైరస్‌ సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అన్నది.

కోవిడ్‌ వ్యవహారంపై చర్చించడానికి ఆ సంస్థ అధికారులు జెనీవాలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. “ ప్రపంచవ్యాప్తంగా 10%శాతంమంది కోవిడ్‌ బారినపడ్డారు” అని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వ్యాఖ్యానించారు.

“దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, వర్గాల ఆధారంగా వైరస్‌ వ్యాప్తి భిన్నంగా కొనసాగుతోంది’’ అని ర్యాన్‌ అన్నారు. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలకు ఇంకా వైరస్‌ రిస్క్‌లో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచదేశాలన్నీ కోవిడ్‌పై కలిసి కట్టుగా పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ సూచించారు. “ప్రపంచవ్యాప్తంగా నమోదైన వాటిలో 70% కేసులు 10దేశాల్లోనే ఉన్నాయి, సగం మరణాలు కేవలం మూడు దేశాలలోనే నమోదయ్యాయన్న విషయం మరిచిపోవద్దు’’ అని టెడ్రోస్‌ అన్నారు.

ఇప్పటి వరకు కేవలం 3.5 కోట్లమందికే ఈ వైరస్‌ సోకినట్లు అధికారిక గణాకాంకాలు చెబుతున్నాయని, వాస్తవానికి ఈ సంఖ్య 80 కోట్ల వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.

వైరస్‌ వ్యాప్తి ప్రారంభమై 10 నెలలు అవుతున్నా అది అంతమయ్యే సూచనలు కనిపించడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అన్నారు.

  • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోవిడ్-19కు చికిత్స తీసుకుంటున్నారు.
  • స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలోని కొన్ని ప్రాంతాలలో కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించాలని అధికారులు నిర్ణయించారు.
  • ఇరాన్లో తాజాగా 235మంది కోవిడ్ కారణంగా మరణించారు.

హెపటైటిస్-సి కనిపెట్టిన శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి

హెపటైటిస్ సి వైరస్‌ని కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు 2020 సంవత్సరానికి ఫిజియాలజిలో నోబెల్ బహుమతి లభించింది.

ఈ బహుమతి బ్రిటిష్ శాస్త్రవేత్త మైఖేల్ హాటన్, అమెరికాకి చెందిన పరిశోధకులు హార్వే ఆల్టర్, చార్లెస్ రైస్ కి లభించింది.

వైద్య రంగంలో వీరు చేసిన ఆవిష్కరణ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడిందని నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొంది.

లివర్ క్యాన్సర్ రావడానికి ఈ వైరస్ ప్రధాన కారణం కావడంతో ఇది రోగుల్లో కాలేయ మార్పిడి చేసేందుకు దారి తీస్తోంది.

1960 లలో దాతల నుంచి సేకరించిన రక్తం ఎక్కించుకుంటున్న వారు తీవ్రమైన హెపటైటిస్ బారిన పడుతున్న విషయం పట్ల ఆందోళన నెలకొంది. ఆ సమయంలో రక్తాన్ని రష్యన్ రౌలెట్ ను పోలిన విధానంలో ఎక్కించేవారని నోబెల్ ప్రైజ్ కమిటీ తెలిపింది.

1972 నుంచి ప్రొఫెసర్ హార్వే ఆల్టర్ ఈ ఇన్‌ఫెక్షన్‌పై అధ్యయనం చేస్తున్నారు.

1989లో మైఖేల్ హాటన్ పరిశోధనల అనంతరం దీనికి హెపటైటిస్-సి అని పేరు పెట్టారు.

1997లో ప్రొఫెసర్ చార్లెస్ రైస్‌ ఈ వైరస్‌పై తదనంతర పరిశోధనలు చేసి, దీని నివారణకు బాటలు వేశారు.

ప్రపంచంలో చాలా ప్రాంతాలలో హెపటైటిస్ సి కేసులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. దీనికి చికిత్స చేసేందుకు యాంటీ వైరల్ మందులు కూడా అభివృద్ధి చేశారు.

"చరిత్రలోనే మొదటిసారి ప్రపంచంలోంచి హెపటైటిస్-సి ని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ వైద్య ఆవిష్కరణ ఆశలు కలగచేసింది’’ అని ప్రైజ్ కమిటీ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 7 కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడుతుండగా సుమారు 400,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

డోనల్డ్ ట్రంప్: మద్దతుదారులను పలకరించేందుకు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన శ్రేయోభిలాషులను పలకరించడానికి ఆదివారం నాడు కొద్దిసేపు ఆస్పత్రినుంచి బయటికి వచ్చారు.

కాసేపు కార్లో బయటకి వచ్చి తనకు కోవిడ్ 19 చికిత్సనందిస్తున్న ఆస్పత్రి బయట గుమికూడిన మద్దతుదారులను ఆశ్చర్యపరిచారు.

'సర్ప్రైజ్ విజిట్' ఉంటుందని ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే ట్రంప్ కార్లో కూర్చుని, మాస్క్ వేసుకుని అందరికీ చేయి ఊపుతూ కనిపించారు.

కరోనావైరస్‌ను కట్టడి చెయ్యడంలో విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్ ఈ వైరస్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నానని అన్నారు.

అంతకుముందు, ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, తొందరగా బహుసా సోమవారమే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయనకు చికిత్సనందిస్తున్న డాక్టర్లు తెలిపారు.

ట్రంప్‌కు కోవిడ్ 19 నిర్ధారణ అయిన దగ్గరనుంచీ రెండుసార్లు ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని, ఆయనకు డెక్సమెతసన్ అనే స్టెరాయిడ్ ఇస్తున్నామని డాక్టర్ షాన్ కాన్లే తెలిపారు.

ఆయనకు కనీసం ఒకసారి ఆక్సిజన్ ఇచ్చారని చెప్తూ డా. కాన్లే, ట్రంప్‌కు ఇస్తున చికిత్స గురించి అంతకుముందు ఇచ్చిన పరస్పర విరుద్ధమైన ప్రకటనల వలన కలిగిన గందరగోళానికి తెర దించే ప్రయత్నాలు చేసారు.

ట్రంప్ ఒక ట్వీట్‌లో తన కోవిడ్ 19 అనుభవం గురించి చెప్తూ..."నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. స్కూలుకెళ్లి మరీ నేర్చుకున్నాను. ఇది స్కూలే. ఇదేదో పుస్తకాల్లో చదువుకుని నేర్చుకున్నది కాదు. నాకు వైరస్ సోకిన తరువాత స్వానుభవంతో నేర్చుకున్నది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ త్వరలో మీ అందరితో పంచుకుంటాను" అని రాశారు.

ట్రంప్‌కు కోవిడ్ 19 సోకిందన్న వార్త తెలిసిన వెంటనే నవంబర్ 3 న జరగనున్న ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో పోటీ పడనున్నారు.

ట్రంప్ ఆరోగ్యం గురించి డాక్టర్లేమంటున్నారు?

ట్రంప్‌కు చికిత్స అందిస్తున్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డా. కాన్లే మాట్లాడుతూ...శుక్రవారం ఉదయం వైట్ హౌస్‌లో ఉన్నప్పుడు మొదటిసారి ట్రంప్ ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని తెలిపారు.

యూఎస్ అధ్యక్షుడికి తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చిందని, ఆక్సిజన్ 94% ఉందని, సాధారణంగా 95% లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలని వివరించారు.

ట్రంప్‌కు వైట్ హౌస్‌లోనే సుమారు ఒక గంటపాటూ అదనపు ఆక్సిజన్ అందించారని, తరువాత అదే రోజు సాయంత్రం ఆయనను వాల్టర్ రీడ్ ఆస్పత్రికి తరలించారని కాన్లే తెలిపారు.

శనివారం రెండోసారి వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో మళ్లీ ఆయనకు ఆక్సిజన్ స్థాయి 93 శాతానికి పడిపోయిందని డా. కాన్లే తెలిపారు. ఈసారి కూడా ట్రంప్‌కు అదనపు ఆక్సిజన్ అందించారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదుకానీ "ఒకవేళ ఇచ్చుంటే, చాలా పరిమితంగా ఇచ్చుంటారు" అని డా. కాన్లే అన్నారు.

డెక్సమెథసన్ స్టెరాయిడ్ తీవ్రమైన కోవిడ్ 19 కేసులకు బాగా పనిచేస్తుందని ఇప్పటికే నిరూపించబడడంతో ట్రంప్‌కు అదే చికిత్స అందించాలని డాక్టర్లు నిర్ణయించినట్లు తెలిపారు.

"యూఎస్ అధ్యక్షుడికి అన్నిరకాలుగా ఉత్తమమైన చికిత్స అందించడానికే ప్రయత్నిస్తున్నాము" అని కాన్లే తెలిపారు.

అంతకుముందు, వైట్ హౌస్ సిబ్బంది ప్రధాన అధికారి మార్క్ మెడోస్, ట్రంప్ ఆరోగ్ర పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాబోయే 48 గంటలూ కీలకమైనవని అన్నారు.

ఈ విషయం గురించి డాక్టర్ కాన్లే మాట్లాడుతూ...మార్క్ మెడోస్ మాటలను అపార్థం చేసుకున్నారని అంటూ "మేము ఒకటి చెప్పి, మీరు వేరొకలా అర్థం చేసుకుని...ఈ గందరగోళం ఉండకూడదనే నేను ట్రంప్ ఆరోగ్య పరిస్థితులపై సమాచారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ అది, మేమేదో దాస్తున్నట్టు బయటికొచ్చింది. అది నిజం కాదు" అని వివరించారు.

శుక్రవారం తరువాత ట్రంప్‌కు జ్వరం రాలేదని, లివర్, కిడ్నీ బాగున్నాయని డా. కాన్లే తెలిపారు. అయితే ఆయన ఊపిరితిత్తుల పనితీరు గురించి అడిగినప్పుడు మాత్రం డా. కాన్లే ఏ సమాధానం ఇవ్వలేదు.

డా. బ్రియన్ గరిబాల్డీ మాట్లాడుతూ..."ట్రంప్ ఆరోగ్యం బావుంది. ఆయన లేచి తిరుగుతున్నారు. ఇవాళ, రేపు ఆయన ఎక్కువసేపు లేచి తిరుగుతూ, ఆహారం కూడా తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు.

ఐపీఎల్ 2020: కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ధోనీ సేన

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి విజయపథం మీదకు దూసుకొచ్చేసింది. దుబాయిలో ఆదివారం జరిగిన ఐపీఎల్-13 లోని 18 వ మ్యాచ్‌లో ధోనీ జట్టు, కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది.

ఐపీఎల్ 2020లో ఇంతవరకూ ఆడిన మ్యాచ్‌ల్లో, చెన్నైకు ఇది ఐదవ విజయం కాగా, పంజాబ్‌కు నాలుగో ఓటమి.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్, ఫాఫ్ డూ ప్లెసీ మైదానంలో పరుగుల వరద సృష్టించారు. వారిద్దరినీ చూస్తుంటే గత మూడు మ్యాచ్‌ల్లో చవి చూసిన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపించింది.

వీళ్లిద్దరే 17.4 ఓవర్లలో 181 పరుగుల చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించారు. డూ ప్లెసీ 87 పరుగులతో, వాట్సన్ 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

షెల్డన్ కాట్రెల్ వేసిన మొదటి ఓవర్‌లోనే షేన్ వాట్సన్ బంతిని రెండుసార్లు బౌండరీకి తరలించాడు. మూడో ఓవర్‌లో కాట్రెల్ వేసిన మరో బంతిని ఫోర్ కొట్టాడు. నాల్గవ ఓవర్‌లో హర్ప్రీత్ బ్రార్ వేసిన బంతిని బౌడరీ వెలుపలికి కొట్టాడు.

మరోవైపు, డూ ప్లెసీ మొదట్లో నిదానంగా ఆడినా ఐదవ ఓవర్‌నుంచీ దూకుడు మొదలెట్టాడు. ఆ ఓవర్‌లో మొహమ్మద్ షమీ వేసిన బంతిని ఫోర్ కొట్టాడు. తరువాతి ఓవర్‌లో క్రిస్ జోర్డన్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. ఆ దెబ్బకి ఆరవ ఓవర్‌లోనే చెన్నై స్కోరు 50 దాటింది.

ఎనిమిదవ ఓవర్లో హర్ప్రీత్ బౌలింగ్‌లో వాట్సన్ రెండు ఫోర్లు, డూ ప్లెసీ ఒక ఫోర్ కొట్టారు. తరువాతి ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో వాట్సన్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు.

10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 101 పరుగులు పూర్తి చేసేసింది.

11వ ఓవర్లో జోర్డాన్ వేసిన బంతులను వరుసగా రెండుసార్లు బౌండరీకి తరలించి వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

వాట్సన్ 31 బంతుల్లోనూ, డూ ప్లెసీ 33 బంతుల్లోనూ అర్థ శతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.

15 వ ఓవర్ ముగిసేసరికి చెన్నై 150 పరుగులు పూర్తి చేసింది. అప్పటికి మిగిలిన 5 ఓవర్లల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చెయ్యాల్సి ఉండగా, 17 వ ఓవర్లో జోర్డాన్ వేసిన బంతులను డూ ప్లెసీ రెండుసార్లు బౌండరీకి తరలించి మ్యాచ్‌ని విజయం అంచులకు చేర్చాడు.

18 వ ఓవర్లో షమీ బౌలింగ్‌లో డూ ప్లెసీ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ పంజాబ్ తరపున క్యాప్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 బంతుల్లో 63 పరుగులు చేసాడు.

పంజాబ్ జట్టులో రాహుల్ 63, నికోలస్ పూరన్ 33, మన్‌దీప్ సింగ్ 27 పరుగుల అత్యధిక స్కోరు చేసారు.

చెన్నై బౌలర్లలో షర్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, పీయూష్ చావల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు. దీపక్ చాహర్ మూడు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)