నారా చంద్రబాబు నాయుడు: 2022లో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలన్న టీడీపీ అధినేత - ప్రెస్ రివ్యూ

చంద్రబాబు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

ప్రచురణ

2022లో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు జమిలి ఎన్నికలు జరుగుతాయని.. అందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారని సాక్షి కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

చంద్రబాబు ఏమన్నారో పత్రిక ఆయన మాటల్లోనే పాయింట్ల వారీగా వివరించింది:

  • కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తా.
  • పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. పార్టీలో కమిటీలన్నింటిని పూర్తిచేస్తున్నాం. యువతకు ప్రాధాన్యమిస్తున్నాం. సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నాం.
  • పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పెద్దపీట వేస్తాం. నూతన నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే తెలంగాణ కేబినెట్‌ అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.
  • టీడీపీ నాయకులను తీసుకుని మనపైనే విమర్శలు చేయిస్తున్నారు.
  • ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలు 24 శాతం వడ్డీతో ఇప్పించే బాధ్యత నాది.
  • ఏడాదిన్నరపాటు నామీద అనేక ఆరోపణలు చేశారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్‌ నేడు చేతగాని పాలనతో చేతులెత్తేశారు.
  • కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్‌ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, లా అండ్‌ అర్డర్‌ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. మేము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పింది.
  • దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్‌ రాక్షస పాలనకు అద్దం పడుతుంది.
మొబైల్ ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో స్మార్ట్ ఫోన్ల ధరలు దాదాపు 3 శాతం పెరిగే అవకాశం

స్మార్ట్ ఫోన్లు ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని ఐసీఈఏ చెప్పినట్లు నమస్తే తెలంగాణ సహా ప్రధాన పత్రికలన్నీ వార్త ప్రచురించాయి.

స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్నారా? అయితే వెంటనే ఆ పని చేయండి. లేదంటే త్వరలో వాటి ధరలు పెరిగే అవకాశమున్నదని పత్రికలో చెప్పారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లేలపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం సుంకాన్ని విధించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు దాదాపు 3 శాతం వరకు పెరుగవచ్చని ఐసీఈఏ (ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) తెలిపింది.

వాస్తవానికి మొబైల్‌ డిస్‌ప్లేలు, టచ్‌ ప్యానళ్లకు ఈ నెల 1 నుంచే దిగుమతి సుంకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

పీఎంపీ (ఫేజ్డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రోగ్రామ్‌) కింద దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

దీని వల్ల పడే భారాన్ని వినియోగదారులపై మోపాలని తయారీ సంస్థలు భావిస్తుండటంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు పెరిగే అవకాశమున్నదని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారని ఇందులో చెప్పారు.

ఐసీఈఏ సభ్య సంస్థల్లో ఆపిల్‌, హువావే, షియోమీ, వివో, విన్‌స్ట్రన్‌ లాంటి కంపెనీలు ఉన్నాయని నమస్తే తెలంగాణ రాసింది.

టెస్లా కార్లు

ఫొటో సోర్స్, Getty Images

వచ్చే ఏడాది భారత్‌లోకి టెస్లా కారు

అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా వచ్చే ఏడాది భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో తెలిపారు. ‘భారత్‌లో మీ ప్రణాళికల పురోగతి ఎక్కడ వరకు వచ్చింది’ అన్న ప్రశ్నకు మస్క్‌ బదులిస్తూ.. వచ్చే ఏడాది కచ్చితంగా అడుగుపెడతామని తెలిపారని ఈనాడు రాసింది.

అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌, జనరల్‌ మోటార్స్‌ లాంటి సంస్థలు భారత్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించగా, ఫోర్డ్‌ కూడా ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు నిర్వహించడం ఆపేసింది.

మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంస్థకు ఫోర్డ్‌ తన తయారీ ప్లాంటును, ఇతర ఆస్తులను విక్రయించింది.

ఇలాంటి తరుణంలో టెస్లా భారత్‌లో అడుగుపెట్టాలని భావిస్తుండటం గమనార్హం. అయితే భారత్‌లో అడుగుపెట్టే ప్రణాళికలపై టెస్లా సీఈఓ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. జులైలో భారత్‌కు చెందిన ఓ ట్విట్టర్‌ వినియోగదారుడు ‘మీ కంపెనీ భారత్‌లోకి ఎప్పుడు అరంగేట్రం చేస్తుంద’ని అడగగా.. త్వరలోనే ఉండొచ్చని భావిస్తున్నామని మస్క్‌ చెప్పారు.

2019 మార్చిలో ఓ సందర్భంలో చెబుతూ ‘ఈ ఏడాది భారత్‌కు రావాలని మేం కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోతే వచ్చే ఏడాది కచ్చితంగా అడుగుపెడతామ’ని అన్నట్లు కథనంలో చెప్పారు.

అదే ఏడాది జులైలో ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఒక ఏడాదిలోగా భారత్‌ విపణిలో టెస్లా అడుగుపెడుతుందని తెలిపారు.

అయితే భారత్‌లోకి అడుగుపెట్టడం ఆలస్యం అవుతుండటంపై భారత్‌లో నిబంధనలే కారణమని ఆయన గతంలో ఓ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. బెంగళూరులో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు కూడా టెస్లా సంప్రదింపులు జరుపుతోందని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)