You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టిక్‌టాక్: యాప్ స్టోర్ నిషేధాన్ని నిలిపివేసిన అమెరికా న్యాయమూర్తి - NewsReel
టిక్‌టాక్ యాప్‌ను భవిష్యత్తులో డౌన్‌లోడ్ చేసుకోకుండా అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అమెరికా జడ్జి ఒకరు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
యాపిల్ యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే మార్కెట్‌ప్లేస్‌లలో టిక్‌టాక్ యాప్ అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. ఈ యాప్ యాజమాన్యం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ట్రంప్ ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.
యాప్ స్టోర్లలో నిషేధించినా.. నిషేధానికి ముందు దానిని డౌన్‌లోడ్ చేసుకున్న అమెరికన్ యూజర్లు ఉపయోగించటం కొనసాగించవచ్చు.
అయితే.. యాప్ స్టోర్ల నుంచి తమ యాప్‌ను నిషేధించటం.. అమెరికా రాజ్యాంగంలోని మొదటి, ఐదో సవరణలను ఉల్లంఘించటమే అవుతుందని టిక్‌టాక్ వాదించింది.
ఈ నిషేధాన్ని నిలిపివేయాలని టిక్‌టాక్ కోరటంతో.. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికొలస్.. తాత్కాలికంగా నిలుపదల చేస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణమేమిటనేది వెల్లడించలేదు.
వారం రోజుల కిందట మరో చైనీస్ యాప్ వియ్‌చాట్ కూడా తనపై విధించిన నిషేధం నుంచి అమెరికా కోర్టుల ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందింది.
ఐపీఎల్ 2020: రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ చేజింగ్ విక్టరీ... సిక్సర్లతో చెలరేగిన రాహుల్
రాహుల్ తేవతియా కలకలం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ చూసి తీరాల్సిందే. 18వ ఓవర్లో రాహుల్ బ్యాట్ ధాటికి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
కింగ్స్ లెవెన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తుపాన్ వేగంతో చేసిన సెంచరీ, నికొలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్, పంజాబ్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ మెరుపులను మించిపోయి రాహుల్ మొత్తం క్రికెట్ అభిమానులను తన వైపునకు తిప్పుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆశల మీద ఆ ఒక్క ఓవర్లో పూర్తిగా నీళ్లు చల్లాడు. క్రికెట్లో గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా తారుమారవుతాయో చెప్పడం కష్టం అనడానికి నిన్నటి షార్జా మ్యాచ్ మరో ఉదాహరణ.
అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతున్న రాహుల్ తేవతియా 17 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ ఓటమి దాదాపు ఖరారైనట్లే కనిపించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 18వ ఓవర్ వేయడానికి కాట్రెల్‌ను రంగంలోకి దింపాడు. ఆ ఓవర్‌ను తేవతియా, కాట్రెల్‌కు తన జీవితంలో మరిచిపోలేని ఓవర్‌గా మార్చేశాడు.
మొదటి బంతికి సిక్సర్. ఆ తరువాత రెండు, మూడు బంతులకు కూడా వరసగా సిక్సర్లు. నాలుగో బంతి టాస్ బాల్. దాన్ని కూడా తేవతియా మైదానం వెలుపలికి నేరుగా కొట్టాడు. అయిదో బంతికీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా పంజాబ్ నుంచి లాక్కున్నాడు. ఆ తరువాత ఓవర్లో మహమ్మది షమీ బౌలింగులో మరో సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో తన తొలి అర్థ సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ ఆ తరువాత బంతికి ఔట్ అయినప్పటికీ 31 బంతుల్లో 53 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని పక్కా చేశాడు.
కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 224 పరుగులు భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పరుగుల చేజింగ్ విజయం.
ఈ మ్యాచ్ తరువాత రాహుల్ మీద ప్రశంసల వర్షం కురిసింది. క్రికెట్ లో చివరి క్షణం వరకూ ఆశ కోల్పోకూడదని ఈ మ్యాచ్ మరోసారి గుర్తు చేసిందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ట్వీట్ చేశారు.
ఎంత అద్భుతమైన మ్యాచ్ చూశాం ఇవాళ అంటూ షేన్ వార్న్ ట్వీట్ చేశాడు.
మొదట్లో సరిగా ఆడలేకపోయిన తేవతియా కాసేపట్లోనే మ్యాచ్ తీరునే మార్చేశాడు. పిచ్ మీద అద్భుత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు అని ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)