వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు.. భీమా కోరెగావ్ కేసులో సాక్ష్యాలు చెప్పాలని పిలుపు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
భీమా కోరెగావ్ కేసు మరో మలుపు తిరిగింది. ఆ కేసులో సాక్ష్యం ఇవ్వాలంటూ విరసం నాయకుడు వరవరరావు అల్లుళ్లు ఇద్దరికి నోటీసులు పంపారు ముంబై ఎన్ఐఎ పోలీసులు.
ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలపై వరవరరావును కష్టడీలో ఉంచారు. తాజాగా ఆయన అల్లుళ్లను కూడా సాక్ష్యం కోసం ముంబై రమ్మని పిలవడం చర్చనీయాంశం అయింది.
సెప్టెంబరు 9వ తేదీన ముంబై విచారణకు రావాలంటూ తమకు నోటీసులు అందాయని వరవర రావు అల్లుళ్లు సత్యనారాయణ, కూర్మనాథ్‌లు ధృవీకరించారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 160, 91 కింద ఈ నోటీసులు చ్చారు. (160 సెక్షన్ కింద అనుమానం ఉన్న ఎవరినైనా సాక్ష్యం కోసం పోలీసులు పిలిపించవచ్చు. 91 సెక్షన్ కింద సాక్షాలుగా పత్రాలు వంటివి చూపమని కోరతారు.)
ప్రస్తుతం కె.సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఇఫ్లు విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కూర్మనాథ్ హైదరాబాద్‌లో పాత్రికేయులుగా ఉన్నారు.

2018 ఆగష్టులో వరవరరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణలో భాగంగా, సత్యనారాయణ ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు.
పుణె నుంచి వచ్చిన పోలీసు బృందం ఆయన ఫ్లాట్లో తనిఖీలు చేశారు. తనకు భీమా కోరెగావ్ కేసులతో ఏ సంబంధమూ లేదని సత్యనారాయణ అప్పట్లో వివరణ ఇచ్చారు.
అదే సమయంలో కూర్మనాథ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.
కేవలం వరవరరావు అల్లుణ్ణి కాబట్టే తనను మానసికంగా వేధిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.
''నేను వరవరరావుకు బంధువును అనేది వాస్తవం. కానీ నాకూ భీమా కోరెగావ్ అల్లర్లకూ ఏ సంబంధమూ లేదు'' అని మీడియాకు ప్రకటన విడుదల చేశారు సత్యనారాయణ.

ఫొటో సోర్స్, VIRASAM
ఇప్పటికే వరవరరావు ఆరోగ్యం స్థిరంగా లేదని, ఆయనకు వృద్ధాప్యం రీత్యా రకరకాల వ్యాధులు, సమస్యలు ఉన్నాయని, ఆయనకు అందిస్తున్న చికిత్సపై తమకు ఎటువంటి అధికారిక సమాచారమూ లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు.
వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులూ, అభిమానులూ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలంటూ ఎందరో విన్నపాలు చేశారు.
వరవరరావు విడుదల కోరిన వారిలో తిరుపతి వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏ భూమన కరుణాకరరెడ్డి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
ముంబైలో కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో, వరవర రావు ఆరోగ్య పరిస్థితి, ఆయన క్షేమ సమాచారం తెలియక నరకయాతన అనుభవిస్తోన్న కుటుంబానికి ఈ నోటీసులు మరింత ఇబ్బందిని, బాధనూ కలిగించాయన్నారు సత్యనారాయణ.
ముంబైలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడికి ప్రయాణం గురించి తమకు ఆందోళనగా ఉందని కూర్మనాథ్ మీడియాతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























