కరోనావైరస్: 73 రోజుల్లో వ్యాక్సీన్ వస్తుందన్న వార్తల్లో నిజమెంత? - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

దేశీయంగా మరో 73 రోజుల్లో కొవి‌షీల్డ్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''సీరమ్‌ సంస్థకు చెందిన కొవి‌షీల్డ్ వ్యాక్సిన్‌ మరో 73 రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితం''అని ఎస్‌ఐఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

''ప్రస్తుతం వ్యాక్సిన్‌ తయారుచేసి, భవిష్యత్తు అవసరాల కోసం దానిని నిల్వ చేయడానికి మాత్రమే ప్రభుత్వం మాకు అనుమతించింది''.

''పరీక్షలు విజయవంతమై, అవసరమైన అనుమతులు లభించిన తర్వాత మాత్రమే కొవిషీల్డ్‌ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది''.

''ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి, ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని నిరూపణ అయిన తర్వాతే దాని లభ్యతపై సీరమ్‌ సంస్థ అధికారికంగా ప్రకటన చేస్తుంది'' అని ఎస్‌ఐఐ వివరణ ఇచ్చింది.

పారిశుద్ధ్య కార్మికులకు చెత్తబండే అంబులెన్స్‌..

కరోనా పాజిటివ్‌గా తేలిన 9మంది పారిశుధ్య కార్మికులకు తాము రోజూ పనిచేసే చెత్తబండే (ట్రాక్టర్‌) అంబులెన్స్‌గా మారినట్లు సాక్షి ఓ కథనం ప్రచురించింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 120 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దశల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే శనివారం 9మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆందోళనకు గురైన పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు సరైన విధంగా స్పందించలేదని సమాచారం.

కార్మికులకు తలో రూ.500 చేతుల్లో పెట్టి చెత్త తరలించే ట్రాక్టర్‌లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించి అధికారులు చేతులు దులుపుకున్నారు.

దీంతో కార్మికులు చేసేదిలేక సాయంత్రం ట్రాక్టర్‌లో ఆర్వీఎం ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది వీరిని చేర్చుకోవడానికి నిరాకరించడంతో కార్మికులు ఆస్పత్రి ప్రాంగణంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.

మున్సిపల్‌ అధికారుల తీరుపై గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమేగాకుండా ఆదివారం ఉదయం నుంచే మున్సిపల్‌ కార్యాలయం వద్ద తోటి కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.

తెలంగాణలో 15 జిల్లాల్లో కోవిడ్-19 కేసులు రెట్టింపు

తెలంగాణలో రెండు రోజులుగా 15 జిల్లాల్లో కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయని ఆంధ్రజ్యోతి ఓ కథనంలో తెలిపింది.

నిజామాబాద్‌, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నల్లగొండ, మంచిర్యాల, మహబూబాబాద్‌, పాలమూరు, ఖమ్మం, జనగాం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలో కొత్తగా 472 కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 105, కరీంనగర్‌లో 120, ఖమ్మంలో 105, నల్లగొండలో 137, నిజామాబాద్‌లో 148, రంగారెడ్డిలో 131, సూర్యాపేటలో 110 కేసులు వచ్చాయి. ఏడు జిల్లాల్లో 100కు పైగా పాజిటివ్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.

టెస్టుల సంఖ్యను పెంచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రెండు రోజుల్లోనే 83761 పరీక్షలు నిర్వహించగా, అందులో 4858 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచే కొద్దీ కేసులు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి.

ఫార్మాసిటీ: భూమిస్తే.. ఉద్యోగం

హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఫార్మాసిటీలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకుగాను వారికి శిక్షణ ఇచ్చేందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది..

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌కు భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు.

ప్రగతిభవన్‌లో శనివారం ఫార్మా సిటీపై సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫార్మా సిటీ పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. స్థానికుల సహకారంతో ఫార్మాసిటీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, ఈ దిశగా ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా తయారుచేయాలని ఆదేశించారు. కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్‌ అర్హతలను మ్యాపింగ్‌ చేయాలన్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌, ఇతర శిక్షణా సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)