You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: విజయవాడలో 40 శాతం మందికి వచ్చిపోయిన కోవిడ్-19 : ప్రెస్ రివ్యూ
విజయవాడలో 40 శాతం మందికి కరోనావైరస్ వచ్చి, పోయినట్లు సిరో సర్వైలెన్స్ పరీక్షల్లో తేలిందని ఈనాడు కథనం ప్రచురించింది.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో చేసిన సిరో సర్వైలెన్స్, వివిధ రకాల వైరస్ నిర్ధారణ పరీక్షల నివేదికలను గణించిన అధికారులు 43.81(40.51+3.3) శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు తేల్చారు.
ఇందులో 40.51శాతం మందికి కరోనా సోకి.. పోయినట్లు సిరో సర్వైలెన్స్ లో తేలింది. వీరిలో ఎవరికీ అనుమానిత లక్షణాలు లేవు.
వీరి రక్త నమూనాలు పరీక్షిస్తేనే వైరస్ వారిలోకి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. మిగతా 3.3శాతం మంది అనుమానిత లక్షణాల ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారని కథనంలో చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ‘సిరో సర్వైలెన్స్’ను నిర్వహించింది.
దీని ప్రకారం.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41% మందికి వైరస్ వచ్చి.. వెళ్లింది. విజయవాడ అర్బన్‌లో 933 మందిలో 378మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది.
భవంతులు, గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు.
మేలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు పరిగణనలోనికి తీసుకొని ఈ పరీక్షలు చేశారని ఈనాడు వివరించింది.
పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమే-కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని కేసీఆర్ నిర్ణయించారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపుతోపాటు కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.
ఈ నెల 25న జరుగనున్న రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీటిపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు.
నీటి కేటాయింపులు, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణానదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై కూడా సమావేశంలో నిలదీస్తామని స్పష్టంచేశారని కథనంలో తెలిపారు.
వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తంచేసిన అభ్యంతరాలన్నీ అర్థంపర్థంలేనివే అని ఆయన స్పష్టంచేశారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారుచేసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈసారి జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఆ అంశాలను చేర్చి, న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సీఎం కేసీఆర్ చెప్పారని నమస్తే తెలంగాణలో వివరించారు.
ఏపీ అవినీతి అధికారి రూ.3కోట్ల 'ఖజానా’
అనంతపురం జిల్లాలో ఒక అవినీతి అధికారి భారీగా ట్రంకుపెట్టెల్లో దాచిన ఖజానా విలువ రూ.3 కోట్లకు పైనే ఉందని అని సాక్షి కథనం ప్రచురించింది.
అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు.
ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు.
పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి.
వీటితో పాటు ఒక ఎయిర్ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి.
ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఓఎస్‌డీ రామకృష్ణ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలియజేశారు.
సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారని సాక్షి తెలిపింది.
అవినీతి డొంక కదిలిందిలా..
మనోజ్‌కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా.. పోలీసులు ఈ నెల 18న మనోజ్‌కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేశారు.
అతడి డ్రైవర్ బంధువు బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయని సాక్షి వివరించింది.
కేంద్ర ఉద్యోగాలకు ఇక ఒకే ఉమ్మడి పరీక్ష
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక ఒకే ఉమ్మడి పరీక్ష ఉంటుందని ఆంధ్రజ్యోతి సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.
కేంద్ర ప్రభుత్వంలోని నాన్ గెజిటెడ్ పోస్టులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగువస్థాయి పోస్టులకు ఇక ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్) ఉంటుంది.
దీన్ని నిర్వహించేందుకు గాను జాతీయ నియామక సంస్థ -నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్ సమయంలో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ ఈ ఎన్‌ఆర్‌ఏకు సంబంధించిన విధివిధానాలను చర్చించి ఆమోదముద్ర వేసినట్లు జ్యోతి తెలిపింది.
ఇన్నేళ్లూ ఈ ఉద్యోగ నియామకాలను దాదాపు 20 సంస్థలు చేపట్టేవి. ఇప్పడవన్నీ మూతపడతాయి.
ఒకే స్థాయిలోని గ్రూప్-బీ, గ్రూప్-సీల కిందకొచ్చే నాన్ గెజిటెడ్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలన్నింటికీ ఈ పరీక్ష జరపనున్నారు.
యువతకు ఎన్‌ఆర్‌ఏ ఓ వరం: మోదీ
ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు దేశంలోని నిరుద్యోగ యువతకు ఓ వరమని ప్రధాని మోదీ అభివర్ణించారని ఆంధ్రజ్యోతి రాసింది.
‘‘ఎన్‌ఆర్‌ఏ వల్ల కోట్లాది మంది లాభపడతారు. ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు రాయక్కరలేదు. డబ్బు, సమయం, వనరులు ఆదా అవుతాయి. అంతేకాక, దీని వల్ల నియామకాల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది’ అని ఆయన ట్వీట్ చేసినట్లు కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
- చైనా - రష్యా దేశాలు అమెరికన్ డాలర్‌కు చెక్ పెడుతున్నాయా... డాలర్ పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- కరోనావైరస్తో విలవిల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)