కరోనావైరస్‌పై పోరాటంలో గుర్తింపులేని హీరోలు వీళ్లు..

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనావైరస్ వార్డు బయట ఒక వ్యక్తి విషాదంలో మునిగి ఉండటాన్ని దీప్ చంద్ గమనించారు. ఆసుపత్రిలోని కోవిడ్-19 వార్డులో చికిత్స పొందుతున్న ఆయన బంధువు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆయన డాక్టర్లు, నర్సుల కోసం చూస్తున్నారు.

ఆ రోజు ఆసుపత్రి ఒక వైపు మరణిస్తున్న వారితో, మరో వైపు విషమంగా మారుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితితో, కొత్తగా చేరడానికి వచ్చే రోగులతో గందరగోళంగా ఉంది.

వార్డు బయట ఆందోళనతో ఉన్న వ్యక్తి దగ్గరకు దీప్ చంద్ వెళ్లి, తనేదైనా సహాయపడగలనేమో అని కనుక్కున్నారు.

“ఆయన అలా అడగగానే.. మూడు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉన్న మా బావగారి పరిస్థితి తెలుసుకోవాలనుందని చెప్పాను. ప్రతి రోజూ రోగుల పరిస్థితి వివరించడానికి డాక్టర్లు మాకు ఫోన్ చేసి చెప్పేవారు. కానీ ఆ రోజు మాకు డాక్టర్ల నుంచి ఫోన్ రాలేదు.”

“దీప్ చంద్ వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించి ఉండటంతో ఆయనను నేను డాక్టర్ అనుకున్నాను”.

“నేను వెల్లువలా అడిగిన ప్రశ్నలకు.. వీటికి సమాధానం చెప్పడానికి నేను డాక్టర్‌ను కాను అని దీప్ చంద్ చెప్పారు.”

“నేను ఎంత చిరాకు పడి ప్రశ్నలు వేసినా దీప్ చంద్ మాత్రం సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్పారు.”

ఆసుపత్రి నిర్వహణలో వార్డ్ బాయ్ ఉద్యోగం కింది స్థాయిలో ఉంటుంది. దీప్ చంద్‌కు 28ఏళ్లు.

వారికి వృత్తిపరమైన శిక్షణ ఏమీ ప్రత్యేకంగా ఉండదు. వారు డాక్టర్లకు, నర్సులకు, రోగులకు సహాయం అందిస్తారు.

పరీక్షలు నిర్వహించడానికి శాంపిల్ తీసుకోవడం, రోగులను ఎక్స్‌రేల కోసం తీసుకుని వెళ్లడం, భోజనం అందివ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.

ఈ మహమ్మారి సమయంలో వీరు హాస్పిటల్లో రోగులకు మాత్రమే కాకుండా రోగుల బంధువులకు కూడా ఆపద్బాంధవుల్లా పనిచేశారు.

“నేను వార్డ్ బయట బేలగా నిల్చుని ఉన్నప్పుడు దీప్ చంద్ ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మర్చిపోలేను”.

ఆసుపత్రిలో మెషిన్ల శబ్దాలు, నొప్పితో కేకలు పెడుతున్న రోగుల పిలుపులు, ఆదేశాలు ఇస్తున్న డాక్టర్లు నర్సుల పిలుపులు నా చెవిలో పడుతూ ఉండేవి.

“నేను ఊపిరి తీసుకోలేక పోతున్నాను, నన్ను కాపాడండి అనే రోగి పిలుపు కూడా విన్నాను".

ఎంతో భరోసా ఇచ్చారు

దీప్ చంద్ ఇచ్చిన సమాచారాన్ని నేను కారు పార్కింగ్ స్థలంలో వేచి చూస్తున్న నా కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెళ్లాను. మేమంతా దూరంగా నిల్చునే.. ఒకరిని చూసి ఒకరు నీరసంగా నవ్వుకున్నాం.

“ఇది అన్నిటికంటే హీన స్థితిలా అనిపించింది. అవసరమైన సమయంలో ఒకరినొకరు దగ్గరగా వెళ్లి పట్టుకుని ఆసరా ఇచ్చుకోలేని పరిస్థితి. మా బావగారు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారు.”

“రానున్న 12 గంటలు క్లిష్టంగా ఉంటాయని డాక్టర్ చెప్పిన తర్వాత కారు పార్కింగ్ లో కూర్చుని మేము కన్నీరు పర్యంతమయ్యాం”.

“ఆ తర్వాత మేము సమాచారం కోసం దీప్ చంద్ మీదే ఆధారపడ్డాం”.

“వార్డు నుంచి వచ్చే సమాచారం కోసం మేము ప్రతి రోజూ ఆందోళనతో ఎదురు చూసే వాళ్లం”.

జూన్ మొదటి వారంలో దిల్లీలో కోవీడ్-19 కేసులు విపరీతంగా పెరగడంతో సమాచారం సరిగ్గా అందేది కాదు.

“అలాంటి పరిస్థితుల్లో దీప్ చంద్ లాంటి వారు మా లాంటి మరెన్నో కుటుంబాలకు సమాచార వారధుల్లా వ్యవహరించారు”.

“వారు కుటుంబాలను ఓదార్చే వారు, తిరిగి వారి దగ్గర నుంచి సందేశాలను, ఫోన్‌లో మాట్లాడలేని రోగుల దగ్గరకు తీసుకుని వెళ్లేవారు”.

“ఒక రోజు మా బావగారి పరిస్థితి క్షీణించినప్పుడు నేను వార్డ్ బయట నిల్చుని దుఃఖాన్ని దిగమింగు కోలేకపోయాను. ఆయన పరిస్థితి మెరుగు పడటం లేదని డాక్టర్లు చెప్పారు”.

"ఒక వార్డ్ బాయ్ నా దగ్గరకు వచ్చి అంత కంటే విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులు కూడా కోలుకున్నారు అని చెప్పారు. అతని మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి”.

"ఏదైనా జరగొచ్చు అని డాక్టర్లు చెప్పినప్పుడు మనసు అనేక రకాలుగా ఆలోచిస్తుంది. మనం సరైన హాస్పిటల్‌కి తీసుకుని వచ్చామా? అనవసరంగా వెంటిలేటర్ మీద పెట్టామా? లాంటి చాలా ప్రశ్నలు వేధిస్తాయి".

“ఏదో మాయ జరగాలని మా కుటుంబం అంతా ప్రార్ధిస్తూనే ఉన్నాం . నా జీవితంలో అత్యంత సంక్లిష్టమైన సమయంలో దీప్ చంద్ ఇచ్చిన ఓదార్పు నాకు చాలా ధైర్యాన్నిచ్చింది ”.

కష్టాన్నీ లెక్క చేయరు

నెల రోజుల తర్వాత బీబీసీ రిపోర్టర్‌తో దీప్ చంద్ మాట్లాడారు.

“రోగుల కుటుంబాలతో మాట్లాడటానికి డాక్టర్లకు, నర్సులకు కుదిరేది కాదని చెప్పారు. డాక్టర్లు పనిలో చాలా బిజీగా ఉండేవారు. చాలా సీరియస్‌గా ఉన్న రోగుల కుటుంబాలతో మాత్రం రోజుకు ఒకసారి మాట్లాడేవారు” అని ఆయన చెప్పారు.

“ఇది ఎవరి తప్పూ కాదు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎవరమూ సిద్ధంగా లేము”.

దీప్ చంద్ లాంటి మరి కొంత మంది వార్డులో పని చేసే సిబ్బంది ఆ బాధ్యత తీసుకుని రోగుల పరిస్థితి ఎలా ఉందో కుటుంబాలకు వివరించే వారు.

“మా బావగారి ఆక్సీజన్ స్థాయిల గురించి రోజూ నాకు చెప్పేవారు”.

మానిటర్ మీద చూసిన ఆక్సిజన్ స్థాయిని వారి కుటుంబాలకు చెప్పేవాడినని దీప్ చంద్ తెలిపారు.

“ఆయన రోగులకు భోజనం, ఉత్తరాలు పట్టుకుని వెళ్లే వారు.

ఆయన గత 5ఏళ్లుగా వార్డు బాయ్‌గా పని చేస్తున్నారు. కానీ కోవిడ్-19 ఆయన పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.

రోజుకి 10 -12 గంటలు వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించి ఉండాలంటే కష్టమని.. కానీ రోగులు వారి కుటుంబాలు అనుభవిస్తున్న పరిస్థితితో పోలిస్తే వారు పడే కష్టం ఏమంత పెద్దది కాదుఅని ఆయన అన్నారు.

అతని సహోద్యోగి అమిత్ కుమార్ కూడా ఈ మాటలతో ఏకీభవించారు. ఏ చిన్న సమాచారం అయినా కుటుంబాలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు.

రోగులు చక్కగా భోజనం చేసినట్లు, మా వైపు చూసి నవ్వినట్లు చెప్పిన చిన్న చిన్న విషయాలు విని రోగి కుటుంబ సభ్యులు చాలా ఆనందించే వారు.

దేశంలో ప్రతి రోజూ వార్డులో పని చేసే ఈ సిబ్బంది తమ జీవితాలను ముప్పులో పెట్టుకుని పని చేస్తున్నారు. కొన్ని వందల మందికి కరోనావైరస్ సోకింది, కొంత మంది మరణించారు కూడా. కానీ ఈ కోవిడ్-19ను పారద్రోలే యుద్ధంలో వారి పాత్రను ఎవరూ పట్టించుకోలేదు.

ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోమని వారు అంటున్నారు.

గుర్తింపేమీ అక్కర్లేదు

తనకేమీ ప్రత్యేక గుర్తింపు అక్కర్లేదని దీప్ చంద్ చెప్పారు.

“మార్చి నెలలో నేను కరోనావైరస్ వార్డులో పని చేయాలని చెప్పగానే మొదట్లో నా రక్షణ, నా కుటుంబం గురించి అలోచించి భయపడ్డాను. కానీ మా ఇంట్లో వారు అనారోగ్యం పాలైతే వార్డులోకి వెళ్లడానికి ఆలోచించను కదా అనుకున్నాను.”

“ప్రతి రోగి మరొకరి కుటుంబమే కదా!”

ఆ ఆలోచనే నన్నువార్డులో పని చేసేలా చేసింది. పని మానెయ్యాలి అని మరెప్పుడూ అనుకోలేదు”.

ఏ వైద్య సంస్థ లోనైనా వార్డు బాయ్‌లు పోషించే పాత్ర చాలా కీలకమైనది అని మేదాంత హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ డైరెక్టర్ డాక్టర్ సుశీల్ కటారియా చెప్పారు.

“వారు మమ్మల్ని వెన్నంటే ఉంటారు. పడేసిన పీపీఈ కిట్లను తీస్తారు. ఇన్ఫెక్షన్ వ్యాపించే శాంపిళ్లను పట్టుకుంటారు. వారి సహాయం లేకుండా ఏ డాక్టర్ విధులు నిర్వర్తించలేరు” అని ఆయన అన్నారు.

“డాక్టర్లు నర్సుల లాగే వారు కూడా ఈ యుద్ధంలో హీరోలు.”

జీతం తక్కువ

కానీ, హాస్పిటల్లో వారు అతి తక్కువ జీతం పొందే వ్యక్తులు.

కొన్ని చిన్న పట్టణాలలో వీరి జీతాలు మరీ తక్కువగా ఉంటాయి.

బీహార్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే సోహన్ లాల్‌కి నెలకి 5000 రూపాయిలు జీతం వస్తుంది.

"నాకు మరో మార్గం లేదు. అందుకే నేను ఈ ఉద్యోగం చేస్తున్నా”అని ఆయన చెప్పారు.

డాక్టర్‌ను సంప్రదించి రోగులకు చాలా సార్లు మందులు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

డాక్టర్లు రోజుకు ఒకసారి వార్డులో రౌండ్లకు వస్తారు. దాంతో రోగులు కూడా వారి బాధలు చెప్పుకోవడానికి వార్డు బాయ్‌ల పైనే ఆధారపడతారు.

వారి జీవితంలో మరో కష్టమైన అంశం మరణాన్ని చాలా దగ్గరగా చూడాల్సి రావడం.

“నేను చూసుకుంటున్న రోగి మరణిస్తే విషాదంలో మునిగిపోతాను”అని దీప్ చంద్ చెప్పారు.

“కొన్నిసార్లు మా దగ్గర రెండు వారాల పాటు వైద్యం తీసుకున్న తర్వాత రోగులు చనిపోతారు. వారు మా కుటుంబంలా మారిపోతారు”.

“కరోనావైరస్‌ను ఓడించేవరకు, లేదా కరోనా నన్ను ఓడించే వరకు పని చేస్తూనే ఉంటాను”అని ఆయన అన్నారు.

మా బావగారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయన రోజు నేను దీప్ చంద్‌కు ధన్య వాదాలు తెలపాలని అనుకున్నాను. కానీ, డ్యూటీలో ఉన్నాను అని నా ఫోన్ తీయలేదు.

“మీరు మాకు ధన్యవాదాలు చెప్పనవసరం లేదు అనే సందేశాన్ని పంపారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వార్డులలో పని చేస్తున్న వైద్య సిబ్బంది కోసం ప్రార్థనలు చేయండి‘‘ అని కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించమని విజ్ఞప్తి చేశారు.

“ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనదో వ్యక్తిగతంగా చూసాక అతనితో అంగీకరించకుండా ఉండలేను.”

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)