You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రికెట్‌లో సచిన్ తెందుల్కర్ సూచించిన మార్పును ఐసీసీ స్వీకరిస్తుందా?
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా ఇటీవల ఓ వీడియో చాట్‌లో ముచ్చటించారు.
క్రికెట్‌లో సాంకేతికత వినియోగం అంశం వీరి చర్చలో ప్రస్తావనకు వచ్చింది.
ఆటలో అంపైర్ల నిర్ణయాలు సరిగ్గా రావడం కోసమే సాంకేతికత అని సచిన్ ఈ చాట్‌లో అన్నారు. అంపైర్ నిర్ణయాలను సమీక్షించే డీఆర్ఎస్ విధానం గురించి మాట్లాడుతూ, ఎల్బీడబ్ల్యూకు సంబంధించి డీఆర్‌ఎస్ నిబంధనల్లో ఓ మార్పును ఆయన సూచించారు.
డీఆర్ఎస్‌లో బంతిలో ఎంత శాతం భాగం స్టంప్స్‌ను తాకుతుందన్నదానితో సంబంధం లేకుండా, కేవలం తాకుతుందని తేలితే ఔట్ ఇవ్వాలని సచిన్ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ అంపైర్ ఓ బ్యాట్స్‌మన్‌ను ఎల్బీడబ్ల్యూకు సంబంధించి నాటౌట్‌గా ప్రకటిస్తే... డీఆర్ఎస్‌లో బంతిలో కనీసం 50 శాతం భాగం స్టంప్స్‌ను తాకుతున్నట్లు తేలితేనే, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారు. లేకుంటే, పాత నిర్ణయమే వర్తిస్తుంది. ఈ విధానాన్ని సచిన్ తప్పుపట్టారు.
విషయం మూడో అంపైర్ వద్దకు వెళ్తే, సాంకేతికత ఆధారంగా నిర్ణయం జరగాల్సిందేనని సచిన్ అంటున్నారు. తిరిగి మళ్లీ ఫీల్డ్‌లో ఉండే అంపైర్ తేల్చేదేమీ ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
టెన్నిస్‌లో ఇదే విధానం పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సచిన్ ప్రతిపాదనపై భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ట్వటర్‌లో స్పందించారు.
‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. (ఎల్బీడబ్ల్యూ సమీక్షలో) బంతి చిన్నగా తాకుతున్నట్లు తేలినా, బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గానే పరిగణించాలి. ఆట మెరుగవ్వాలంటే కొన్ని నిబంధనలు మారాలి. వాటిలో ఇది కూడా ఒకటి’’ అని హర్భజన్ వ్యాఖ్యానించారు.
ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలపై ఆటగాళ్లకు అభ్యంతరం ఉంటే, దానిపై సమీక్ష కోరే అవకాశం డీఆర్ఎస్ ద్వారా ఉంటుంది.
డీఆర్ఎస్‌కు అప్పీలు చేసుకుంటే, వీడియో రికార్డింగ్, ఇతర సాంకేతిక అంశాలు పరిశీలించి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం సరైందో, కాదో మూడో అంపైర్ తేలుస్తారు.
అయితే, డీఆర్ఎస్ వినియోగించడం అన్ని మ్యాచ్‌లకూ తప్పనిసరి కాదు. సిరీస్‌కు ముందు, అందులో పాల్గొంటున్న దేశాల బోర్డులు ఈ విధానాన్ని ఉపయోగించాలా, లేదా అన్నది నిర్ణయించుకుంటాయి.
ఐసీసీ మొదట్లో ఈ విధానాన్ని అన్ని మ్యాచ్‌లకూ వర్తింపజేయాలని చూసింది. కానీ, వంద శాతం కచ్చితత్వం లేని సాంకేతికత వాడటం అనవసరమంటూ బీసీసీఐ దీన్ని వ్యతిరేకించింది.
ఎల్బీడబ్ల్యూల విషయంలో అంపైర్లు ఎలా నిర్ణయం తీసుకుంటున్నారన్న విషయం గురించి అంతర్జాతీయ అంపైర్ కె. హరిహరన్ వివరించారు.
‘‘అంపైర్ మొదటగా బంతి స్టప్ ఎక్కడ పడిందనేది చూస్తారు. ఆ తర్వాత బ్యాట్‌కు తాకకుండా, కాళ్లపై తాకిందా అనేది ధ్రువీకరించుకుంటారు. బంతి స్టంప్స్‌ను తాకేదా అన్నది అంచనా వేస్తారు. బంతి ఎంత శాతం స్టంప్స్‌ను తాకుతుందన్నదానికి ఇందులో ప్రాధాన్యం లేదు’’ అని అన్నారు.
‘‘ఈ మొత్తం నిర్ణయంలో బంతి వికెట్లకు తాకుతుందా, లేదా అన్న అంశం పాత్ర 20 నుంచి 30 శాతం ఉంటుంది. మొత్తంగా అంపైర్‌కు ఈ ప్రక్రియలో ఎక్కడ సందేహం ఉన్నా, సంశయ లబ్ధి కింద నాటౌట్ ఇస్తారు’’ అని ఆయన చెప్పారు.
అంపైర్ ఔట్ ఇచ్చిన నిర్ణయాలపై డీఆర్ఎస్‌కు వెళ్తే.... బంతి ఐదు శాతం మేర స్టంప్స్‌ను తగులుతున్నట్లు తేలినా, ఆ నిర్ణయం ఔట్‌గానే ఉంటుందని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు.
అదే అంపైర్ నాటౌట్ అని నిర్ణయం ఇచ్చి ఉంటే... డీఆర్ఎస్‌లో 50 శాతం కన్నా తక్కువ మేర బంతి స్టంప్స్‌కు తగులుతుందని తేలితే అంపైర్ నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదని వివరించారు.
నిబంధనల్లో ఇది లోపమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్బీడబ్ల్యూపై డీఆర్ఎస్‌లో బంతి కొంత మేర తాకుతున్నట్లు తేలినా, ఔట్ అని ప్రకటించకపోవడానికి కారణాన్ని హరిహరన్ వివరించారు.
‘‘కొన్ని సార్లు బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లినా, బెయిల్స్ కింద పడవు. అలాంటప్పుడు బ్యాట్స్‌మన్ ఔట్ కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకునే, నిబంధన అలా పెట్టారు’’ అని ఆయన అన్నారు.
సచిన్ వాదనలో బలం ఉందని క్రికెట్ విశ్లేషకుడు విజయ్ లోక్‌పల్లి అన్నారు. బంతి స్టంప్స్‌ను తాకి, బెయిల్స్ పడకుండా ఉన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ‘‘సచిన్ లాంటి గొప్ప క్రికెటర్ చెబుతున్నారంటే, ఈ విషయం గురించి ఐసీసీ ఆలోచించాలి. నిబంధనల్లో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
సచిన్ ప్రతిపాదనను ఐసీసీ స్వీకరించే అవకాశాలు లేవని ఆకాశ్ చోప్రా అంటున్నారు.
‘‘బంతి 50 శాతం కన్నా ఎక్కువ మేర స్టంప్స్‌ను తాకుతున్నట్లు తేలితే, ఇక అందులో పొరపాటు అంచనాకు ఆస్కారం లేదు అనుకోవచ్చు. అదే అంతకన్నా తక్కువ శాతం ఉంటే, బంతి స్టంప్స్‌ను తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సచిన్ ప్రతిపాదనలో బలం లేదు. అయితే, అంపైర్ నిర్ణయం ఎప్పుడు మార్చుకోవాలన్న విషయంలో మాత్రం ఒకే పద్ధతి ఉండాలి. ఏది నాటౌట్, ఏది ఔట్ అన్నది స్పష్టంగా ఉండాలి. ఇందుకోసం నిబంధన రూపొందాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్యాడ్మింటన్, టెన్నిస్‌ల్లో సమీక్షలకు, క్రికెట్ ఎల్బీడబ్ల్యూలో సమీక్షలకు తేడా ఉందని ఆకాశ్ అన్నారు.
‘‘వాటిలో జరిగినదానిపై నిర్ణయాలు ఉంటాయి. అంచనా వేసేదేమీ ఉండదు. కానీ ఎల్బీడబ్ల్యూలో బంతి కాళ్లకు తాకి ఆగిపోతుంది. ఒకవేళ అది అడ్డు లేకపోతే, స్టంప్స్‌కు ఎక్కడ తగులుతుందన్నది అంచనా వేయాలి’’ అని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- బ్లాక్ డ్రాగన్: ఈ చేప కళ్లముందే ఉన్నా కనిపించకుండా పోగలదు.. ఎలా సాధ్యం?
- కరోనావైరస్: హైదరాబాద్‌లో ఇళ్లల్లో ఆక్సిజన్ సిలిండర్లు... మార్కెట్లో పెరిగిన డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)