తెలంగాణ - కరోనావైరస్: హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్లకే ప్రభుత్వ 'ఐసొలేషన్ కిట్' -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

హోం ఐసొలేషన్‌‌లో ఉన్న కరోనా బాధితులకు 'ఐసొలేషన్ కిట్' అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఈనాడు ఒక వార్తను ప్రచురించింది.

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్‌ కిట్‌’ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుందని తెలిపింది.

కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు.

కరోనా కేసులు ఉద్ధృతమవుతుండడంతో.. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నవారి (హోం ఐసొలేషన్‌) సంఖ్య కూడా పెరుగుతోందని ఈనాడు రాసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి.

కొందరిలో ఈ లక్షణాలతోనే కోవిడ్‌ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై వారిలో ఆందోళన నెలకొంటోంది. ఏం మందులు వాడాలి? ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి? ఇటువంటి ఆలోచనలు భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.

ఐసొలేషన్‌ బాధితులు అనుభవిస్తున్న ఈ అవస్థలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, వారి చేరువకే అవసరమైన ఔషధాలను అందించాలనే ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తాజాగా తీసుకొంది.

ఐసొలేషన్‌లో ఉన్నవారు 17 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా కిట్‌లో వస్తువులు, ఔషధాలను సమకూర్చనున్నారని పత్రిక వివరించింది.

ఐటీ రంగంలో 30 వేల ఉద్యోగాలకు ముప్పు

కరోనా మహమ్మారి ప్రభావంతో ఐటీ, బీపీఓ అనుబంధ రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు వచ్చిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కరోనా సంక్షోభంతో దేశీయ ఐటీ, బీపీఓ, అనుబంధ రంగాల్లో కనీసం 25,000-30,000 మంది ఉద్యోగాలు కోల్పో యి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయని చెప్పింది.

మరో 50,000-60,000 మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

చిన్న, మధ్య స్థాయి ఐటీ, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని ఇండస్ట్రీ నిపుణులంటున్నారు.

భారత్‌లోని ఐటీ, బీపీఓ కంపెనీల్ల్లో 43.6 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 0.70 శాతం మేర ఉద్యోగాలకు కోత పడిందని ఆంధ్రజ్యోతి రాసింది.

కొవిడ్‌-19 దెబ్బకు అంతర్జాతయంగా అనిశ్చితి పెరిగింది. క్లయింట్లు ఐటీ వ్యయాలను వాయిదా వేసుకుంటున్నారు.

కొత్త ప్రాజెక్టులు కరువయ్యాయి. ఆదాయం తగ్గింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో టెక్నాలజీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం పై దృష్టిసారించాయని పత్రిక చెప్పింది.

దీంతో జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో ఉద్వాసనలు ఊపందుకోవచ్చని ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ విభాగ అధిపతి హెచ్చరించారని పత్రిక పేర్కొంది.

దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను భారీగా తగ్గిస్తున్నట్లు, కొందరి వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనంలో వివరించింది.

ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫెయిలైనా పాస్

ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలై, సప్లిమెంటరీకి దరఖాస్తు చేసిన అందరినీ పాస్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ప్రకటించినట్లు సాక్షి కథనం ప్రచురించింది..

ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌–2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసైనట్లుగా రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్‌–19 నేపథ్యంలో రద్దు చేసి ‘ఆల్‌పాస్‌’గా ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్‌ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాస్‌ చేశామని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నట్లు సాక్షి రాసింది.

అలాగే ఫస్టియర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసే పరీక్షలను 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షలతోపాటూ రాసుకోవాలన్నారు.

సెకండియర్‌ పరీక్షలతో పాటు, వారు ఫస్టియర్‌ సబ్జెక్టుల ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.

ఈ మేరకు ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసిందని సాక్షి వివరించింది.

తెలంగాణ ప్రభుత్వ ఖర్చుతో ఆలయం, మసీదు

కొత్త సచివాలయ భవన సముదాయంతోపాటు, ఆ ప్రాంగణంలోనే ప్రభుత్వ ఖర్చుతో ఆలయం, మసీదును నిర్మిస్తామని తెలంగాణ సీఎం ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఇప్పుడున్నదానికంటే ఎక్కువ విస్తీర్ణంలో వాటి నిర్మాణాన్ని చేపడతామని సీఎం పేర్కొన్నారు.

పాత భవనాల కూల్చివేత సందర్భంగా ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తంచేశారని పత్రిక రాసింది.

‘ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఇందుకు ఎంతో చింతిస్తున్నాను. పాత భవనాలను కూల్చడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప.. ప్రార్థనామందిరాలకు నష్టం కలిగించాలనికాదు’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.

‘ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో.. ఎంతఖర్చయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును విశాలంగా నిర్మించి.. సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తాం అని కేసీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ రాసింది.

‘తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకికస్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’ అని సీఎం కోరినట్లు పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)