కరోనావైరస్: తెలంగాణలో నెల రోజుల్లో 8 రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోందని, నెల రోజుల్లో కేసులు 8 రెట్లు పెరిగాయని ఈనాడు కథనం ప్రచురించింది.

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

జూన్ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకు 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి.

గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్ఎంసీలో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది.

రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా రాజధానిలో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

గాంధీ ఆస్పత్రిలో పడకలు నిండిపోతుండడంతో కరోన చికిత్స కోసం టిమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ పడకలు నిండిపోవడంతో ప్రైవేటు బోధనాస్పత్రుల్లోనూ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తోంది.

జూన్‌లో ప్రతి వారం నమోదవుతున్న కేసుల్లో 50 శాతం నుంచి ఒక్కోసారి వంద శాతం పెరుగుదల కనిపిస్తోంది అని ఈనాడు చెప్పింది.

రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువ వ్యవధిలోనే రెట్టింపవుతున్నాయి. ఒకటో తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యేందుకు 17 రోజుల సమయం పట్టింది.

తర్వాత కేవలం 8 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల్లో యువత, నడి వయస్కులు ఎక్కువ ఉంటున్నారని ఈనాడు వివరించింది.

తెలంగాణలో శనివారం 1850 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.

నెలాఖరు వరకూ శ్రీవారి భక్తుల సంఖ్య పెంచం: టీటీడీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరుమల శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుందని సాక్షి కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్‌8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని ఆయన చెబుతూ.. ఇంతవరకు స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్‌రాలేదని స్పష్టం చేశారు.

టీటీడీ ఆర్థిక వనరులు పెంచుకోవడానికే రోజువారీగా భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతూ పోతోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదని ఆయన చెప్పారు.

ఎక్కువమంది స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందితే కరోనా త్వరగా దూరమవుతుందనే ఉద్దేశంతోనే దర్శనం టికెట్లను పెంచామని ఆయన చెప్పినట్లు సాక్షి చెప్పింది.

ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా టీటీడీలో 17 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌వచ్చింది. వీరుంటున్న నివాస ప్రాంతాల్లోని పరిస్థితుల వల్లే కరోనా వచ్చిందని నిర్ధారణైంది. వీరందరినీ క్వారంటైన్‌కు అత్యుత్తమ వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు పత్రిక రాసింది.

రాంగోపాల్‌ వర్మ మర్డర్ మూవీపై కేసు

దర్శకుడు రాంగోపాల్ వర్మపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కేసు నమోదైందని నమస్తే తెలంగాణ చెప్పింది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు మర్డర్‌ సినిమా నిర్మాత నట్టి కరుణపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

నల్లగొండ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేకకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు.

ఎస్పీ కథనం ప్రకారం.. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్‌లో జరిగిన ప్రణయ్‌హత్యకేసు విచారణ నల్లగొండ ప్రత్యేక కోర్టులో కొనసాగుతున్నది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్‌వర్మ మర్డర్‌పేరుతో ప్రణయ్‌ హత్య కేసు ఇతివృత్తంగా సినిమా నిర్మించనున్నట్టు ఫాదర్స్‌డే రోజున పోస్టర్‌విడుదల చేశారు.

పోస్టర్‌లో మర్డర్‌ సినిమా నిర్మాతగా నట్టి కరుణ పేరును ప్రస్తావించారు. మర్డర్ ‌సినిమా పోస్టర్‌, దానిపై ఆర్జీవీ సోషల్‌మీడియా వేదికగా చేసిన వాఖ్యలపై ప్రణయ్‌తండ్రి పెరుమాళ్ల బాలస్వామి కోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై ఎస్సీ,ఎస్టీ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి నాగరాజు విచారణ జరిపారు.

దర్శకుడు రాంగోపాల్‌వర్మతోపాటు నిర్మాత నట్టి కరుణలపై కేసు నమోదుచేసి విచారణ జరపాలని ఆయన శనివారం మిర్యాలగూడ వన్‌టౌన్‌పోలీసులకు ఆదేశాలు జారీచేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

విమర్శలకు ఐసీఎంఆర్ సమాధానం

భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను త్వరలో తీసుకువస్తామనే ప్రకటనపై వస్తున్న విమర్శలకు ఐసీఎంఆర్ సమాధానం ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కరోనా మహమ్మారి కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 'కోవ్యాక్సిన్' వ్యాక్సిన్‌ను పంద్రాగస్టు నాటికి తీసుకువస్తామని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై దుమారం రేగింది.

ఒక వ్యాక్సిన్‌తయారీకి ఏళ్లు పడుతుందని వైద్య నిపుణులు విమర్శలు గుప్పించగా.. మోదీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన ఘనంగా ప్రకటించుకునేందుకు ఆ డెడ్‌లైన్‌ను విధించారని విపక్షాలు దుమ్మెత్తి పోశాయని చెప్పింది.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ శనివారం సమగ్ర వివరణ ఇచ్చుకుంది. పంద్రాగస్టు ప్రకటనపై స్పష్టతనిచ్చింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది.

అందుకే.. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతినిచ్చాం అని వివరించిందని పత్రిక చెప్పింది.

దేశంలో విజృంభిస్తున్న కరోనా, అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ నిబంధనలకు పాటిస్తూ.. వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

‘‘కోవాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌ అందజేసిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే తదుపరి అనుమతులు ఇచ్చాం.

ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఐసీఎంఆర్‌, పుణెలోని వైరాలజీ ల్యాబ్‌భాగస్వామ్యం ఉంది. ప్రస్తుత పరిస్థితులు, ప్రజారోగ్యం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. వ్యాక్సిన్‌పరీక్షల ప్రక్రియను వేగవంతం చేశాం’’ అని స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)