PUBG గేమ్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసిన 17 ఏళ్ల కుర్రాడు - ప్రెస్ రివ్యూ

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, PUBG

ప్రచురణ

‘పబ్‌జీ మొబైల్’ గేమ్ ఉచ్చులో పడిన ఓ టీనేజ్ కుర్రాడు తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి ఏకంగా రూ. 16 లక్షలు ఖర్చు చేశాడని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

పంజాబ్‌లో జరిగిందీ ఘటన. గేమ్‌లోని ‘ఇన్-యాప్’ కొనుగోళ్ల కోసం.. వైద్యం, ఇతర అవసరాల కోసం తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి లక్షలాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశాడు ఓ టీనేజర్.

ఖరార్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు తన పబ్‌జీ మొబైల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మూడు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును వాడేశాడు. తన టీం మేట్స్‌తో కలిసి ‘ఇన్‌యాప్’ కొనుగోళ్ల కోసం ఖర్చు చేశాడు.

బ్యాంకు స్టేట్‌మెంట్లు చూసిన తర్వాత కానీ కుర్రాడి తల్లిదండ్రులకు ఖాతాలు ఖాళీ అయిన సంగతి తెలియరాలేదు.

కుర్రాడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతడు తల్లితో కలిసి నివసిస్తుండగా, తండ్రి ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.

‘పబ్‌జీ మొబైల్’ అప్‌గ్రేడ్ కోసం తన తల్లి ఫోన్ నుంచి లావాదేవీలు చేసేవాడు. ఆ వెంటనే ఆ మెసేజ్‌లను డిలీట్ చేసేవాడని చెబుతూ తండ్రి బావురుమన్నాడు.

స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా ఉపయోగిస్తుంటే ఆన్‌లైన్ చదువు కోసమే అనుకున్నాం కానీ ఇంతపని చేస్తాడనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపై చదువు కోసం కూడా అతడికి మొబైల్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పార’’ని ఆ కథనంలో పేర్కొంది ఆంధ్రజ్యోతి.

కొల్లు రవీంద్ర

ఫొటో సోర్స్, facebook/kolluravindra

ఫొటో క్యాప్షన్, కొల్లు రవీంద్ర

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసులో తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారని ‘సాక్షి’ పత్రిక తన కథనంలో తెలిపింది.

‘‘తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో రవీంద్ర తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు.

జూన్ 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన మోకా భాస్కరరావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, కొల్లు రవీంద్ర పోలీసుల కళ్లు గప్పి పరారవుతూ తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు చిక్కారు.

కొల్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మచిలీపట్నంకు తరలించార’’ని ఆ కథనంలో తెలిపారు.

ఆన్ లైన్ క్లాసులు

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

ఆన్ లైన్ క్లాసులు అయోమయమే.. 40 శాతం కుటుంబాలకు స్మార్ట్ ఫోన్ లేదు

పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలన్నా తెలంగాణ రాష్ట్రంలో అందుకు తగ్గ మౌలిక వసతులు లేవని.. సుమార్ 40 శాతం కుటుంబాల్లో ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా లేదని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘ఆన్ లైన్ తరగతుల కోసం సుమారు 40 శాతం కుటుంబాలలో ఒక్క స్మార్టు ఫోన్ కూడా లేదు.

స్మార్టు ఫోన్ ఉన్నవారిలో చాలామందికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఒకవేళ ఉన్నా అది ఆన్ లైన్ తరగతులకు సరిపోదు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) తెలంగాణలో ఆన్ లైన్ విద్యావకాశాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించింది.

ఈ సర్వేలో 93.40 శాతం మంది స్కూళ్లు తిరిగి తెరవాలని అభిప్రాయపడగా 6.6 శాతం మంది తల్లిదండ్రులు ఆన్ లైన్ క్లాసులు చేపట్టాలని సూచించారు.

ఇప్పుడు స్కూల్స్ తెరిస్తే భౌతిక దూరం పాటించేలా స్కూల్స్ లేవని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇక విద్యార్థుల్లో 69 శాతం మంది ప్రస్తుతం జరుగుతున్న ఆన్ లైన్ క్లాసులు తమకు అర్థం కావడం లేదని చెప్పార’’ని ఆ కథనంలో తెలిపారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సందర్భంగా మహమూద్ అలీ(మధ్యలో), ఆయన కుమారుడు(ఎడమ), మనమడు(కుడి)

ఫొటో సోర్స్, facebook/mahmood ali

ఫొటో క్యాప్షన్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సందర్భంగా మహమూద్ అలీ(మధ్యలో), ఆయన కుమారుడు(ఎడమ), మనమడు(కుడి)

కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి

ఇటీవల కరోనా బారినపడిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ కోలుకొన్నారని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో అపోలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జిచేశారు.

‘దేవుడికి కృతజ్ఞతలు. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమకు, అభిమానానికి పెద్ద థ్యాంక్స్‌' అంటూ హోంమంత్రి ఓ సందేశంతోపాటు కుమారుడు, మనుమడితో కలిసి ఉన్న ఫొటోను మీడియాకు విడుదలచేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపార’’ని ఆ వార్తాకథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)