కరోనావైరస్: ఆక్సిజన్‌ సిలిండర్లు కొని, ఇళ్లలో దాచుకుంటున్నారు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ముందుజాగ్రత్తగా ఇళ్లలో ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చుకుంటున్నారని.. ఇప్పటికే ఆస్తమా, హృద్రోగం, బీపీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే కాకుండా ఇతరులు కూడా వీటిని కొని పెట్టుకుంటున్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కరోనా సోకినప్పుడు ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొవిడ్‌ మరణాల్లో ఊపిరితిత్తుల సమస్యల వల్ల ఏర్పడినవే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనారోగ్య సమస్యలున్న కొందరు రక్షణ కోసం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సేకరిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్లోనే చికిత్సకు అనుమతించిన నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలో ఉన్నారు. ధనికప్రాంతాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని విక్రేతలు చెబుతున్నారు.

ఆక్సిజన్‌ సిలిండర్లు సాధారణంగా ఆసుపత్రుల్లో అత్యవసర రోగులకు వినియోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు ఇంట్లో కూడా అత్యవసరానికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది వస్తే అప్పటికప్పుడు కృత్రిమశ్వాస అమర్చుకుంటారు.

ఆస్తమా సమస్య ఉన్న ఒక రిటైర్డ్‌ ఉద్యోగి కొద్దిరోజుల క్రితం 5 లీటర్ల సామర్థ్యం ఉన్న ‘ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌’ కొన్నారు. ధర రూ. 48,000. ఇప్పుడు వీటి ధర రూ. 60,000కు పెరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ డీలర్‌ చెప్పారు. అదేమని అడిగితే ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగాయని బదులిచ్చారు.

కొందరు వీటిని అద్దెకు కూడా సరఫరా చేస్తుంటారు. సిలిండర్‌, ఇతర పరికరాలతో కలిపి పరిమాణాన్ని బట్టి అద్దె నెలకు రూ. 2,000-3,000 వరకు వసూలు చేస్తున్నారు. రీఫిల్లింగ్‌కు పరిమాణం ప్రకారం రూ. 400 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతోంది.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ విద్యుత్తుతో నడుస్తుంది. ఆక్సిజన్‌ అయిపోతుందన్న బెంగ ఉండదు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆక్సిజన్‌ ప్యూరిటీ సిలిండర్లలో 99 శాతం వరకు ఉంటే, కాన్సన్‌ట్రేటర్‌లో నాలుగైదు శాతం తక్కువ ఉంటుంది. హైదరాబాద్‌ డీలర్లు అమెరికా, చైనా తదితర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.

తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కొవిడ్-19 పరీక్షలు, చికిత్సలకు అనుమతి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు, చికిత్సకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రానున్న వారం, పది రోజుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు.

ఆదివారం ఆయన కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

‘‘తెలంగాణకు హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది. రానున్న వారం, పది రోజుల్లో వైరస్‌ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల్లో 50 వేల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉందని సీఎం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రికార్డు: పది లక్షల జనాభాకు సగటున 10,341 పరీక్షలు

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డులు సృష్టిస్తోందని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,52,202 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతీ పది లక్షల జనాభాకు సగటున 10,341 మందికి పరీక్షలు నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డులకు ఎక్కిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,663 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 294 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,152కు చేరింది.

ఈ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,107 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారి కేసులు 204 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా 131 మంది డిశ్చార్జి అయ్యారు. ఇందులో 48 మంది ఇతర రాష్ట్రాలు, ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,316కు చేరింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 88కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,748గా ఉంది.

కరోనా భయంతో ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య

తన వల్ల కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్‌ బారిన పడతారనే భయంతో ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ విషాధ సంఘటన న్యూదిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. కరోనా భయంతో 56 ఏండ్ల ఐఆర్‌ఎస్‌ అధికారి తన కారులో యాసిడ్‌ లాంటి పదార్థం తాగి ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారులో విగత జీవిగా పడిఉన్న అతన్ని గుర్తించిన పోలీసులు సమీపంలోని దవాఖానకు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ప్రకటించారు.

తనకు కరోనా సోకిందనే భయంతో, తన వల్ల కుటుంబ సభ్యులకు ఈ ప్రాణాంతక వైరస్‌ సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా ఆ అధికారికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. యాసిడ్‌ లాంటి పదార్థం తాగడంతోనే ఐఆర్‌ఎస్‌ అధికారి మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఢిల్లీలో, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో అతడు కలత చెందాడని, తన వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)