తెలంగాణ: ‘రోహిణి కార్తె వల్ల తీవ్రంగా వడగాడ్పులు’.. అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా రాష్ట్రం .. జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ నిప్పుల గుండంగా మారిందని సాక్షి సహా ప్రధాన పత్రికలన్నీ ప్రచురించాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది.

ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు.

రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించిందని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు, ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్‌ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

ఆంఫన్‌ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారని కథనంలో చెప్పారు.

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపిందని పత్రిక చెప్పింది.

అమరావతికి చంద్రబాబు, విశాఖ పర్యటన వాయిదా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడిందని, ఆయన రోడ్డు మార్గాన ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారని ఈనాడు కథనం ప్రచురించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించేందుకు సోమవారం ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది.

రాష్ట్రంలో విమానాల ప్రారంభం రెండు రోజులపాటు జాప్యం కావడంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు అని పత్రిక చెప్పింది.

తొలుత హైదరాబాద్‌ నుంచి సోమవారం విమానంలో విశాఖపట్నం వెళ్లేందుకు, అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు వీలుగా ఆయన షెడ్యూల్‌ నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మహానాడు సందేశమివ్వనున్నారు.

చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు ఏపీ పోలీసు శాఖ అనుమతిచ్చింది.

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చేందుకు ఈ-పాస్‌ జారీ చేసింది.

చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును ''ప్రత్యేక కేసు'' కింద పరిగణించి అనుమతి ఇస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదివారం ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఏపీలోని ఆయన క్యాంపు కార్యాలయం/నివాసానికి చేరుకోవాల్సి ఉన్నందున అనుమతిస్తున్నట్లు ఈ-పాస్‌లో పేర్కొన్నారు.

కరోనా పరిశోధనలకు విశాఖ వైద్యుడికి అనుమతి

విశాఖకు చెందిన ప్రైవేటు వైద్యుడు వై.శ్రీహరి కరోనా వైర్‌సకు ఇమ్యునోగ్లోబులిన్స్‌ ఇంజెక్షన్‌తో అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారని పత్రిక రాసింది.

ఆయన తన ప్రతిపాదనను ట్రయల్స్‌ రిజిస్ర్టీ ఆఫ్‌ ఇండియా, ఐసీఎంఆర్‌ ముందు ఉంచి క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి పొందారని తెలిపింది.

ఇమ్యునోగ్లోబులిన్స్‌ ఇంజెక్షన్‌, స్పెసిఫిక్‌ కరోనా కోవ్‌-2 ఇమ్యునోగ్లోబులిన్స్‌ అనే రెండు పద్ధతుల ద్వారా వైర్‌సను పారదోలేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

'శరీరంలోకి ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం ఇమ్యునోగ్లోబులిన్స్‌ (యాంటీబాడీ్‌స)ను ఉత్పత్తి చేస్తుంది.

శరీరంలోకి ఏదైనా వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ ప్రవేశించగానే ఈ యాంటీబాడీస్‌ వాటిని హరిస్తాయి. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్స్‌ ఆలస్యంగా ఉత్పత్తవుతాయి.

ఈలోగా వైరస్‌ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీనికి పరిష్కారంగా ఇమ్యునోగ్లోబులిన్స్‌ను ఇంజెక్షన్‌ రూపంలో తయారు చేసి, ఇన్‌ఫెక్షన్‌/వైర్‌స రావడానికి ముందు, తర్వాత కూడా వినియోగించవచ్చు. ఈ ఇంజెక్షన్‌ 3నెలలపాటు పనిచేస్తుంది. ఈలోగా వైరస్‌ సోకినా.. త్వరితగతిన నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆంధ్రజ్యోతికి వివరించారు.

అది కరోనా వైర్‌సను నిర్వీర్యం చేస్తుందా? లేదా? అన్నది తేల్చేందుకే క్లినికల్‌ ట్రయల్‌్తకు అనుమతి కోరాను' అని శ్రీహరి చెప్పారు.

ఇమ్యునోగ్లోబులిన్స్‌ ఫలితాన్నివ్వకపోతే 'స్పెసిఫిక్‌ కరోనా కోవ్‌-2 ఇమ్యునోగ్లోబులిన్స్‌' పద్ధతిలో కొవిడ్‌-19పై విజయం సాధిస్తామని ఆయన చెప్పారని, వీటికి హ్యుమన్‌ కొవిడ్‌-19 ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజెక్షన్స్‌ పేరుతో పేటెంట్‌ రిజిస్ర్టేషన్‌ కూడా చేయించుకున్నట్టు వెల్లడించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)