కరోనావైరస్: భారత్‌లో ఒక్క రోజే అత్యధికంగా 6,654 కొత్త కోవిడ్ కేసులు... 3,700 దాటిన మరణాలు

ప్రచురణ

భారతదేశంలో శుక్రవారం ఒక్క రోజే 6,654 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 137 మంది చనిపోయారు. దీంతో, ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 3,720కు చేరింది.

అలాగే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి పెరగగా.. వారిలో 51,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 69,597 కేసులు కొనసాగుతున్నాయి.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో (మొత్తం 44,582) కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా మరణాలు కూడా ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా (మొత్తం 1,517) ఉన్నాయి.

కేసుల విషయంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు (14,753), గుజరాత్ (13,268), దిల్లీ (12,319), రాజస్థాన్ (6,494) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా 52 లక్షలు దాటిన కేసులు...

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 52,15,253గా ఉన్నట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అండ్ మెడిసిన్ కరోనావైరస్ ట్రాకర్ గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 3,38,265కి పెరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులో 91,583 కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా అమెరికాలో 16,01,434 కేసులు నమోదవగా.. ఆ తర్వాత రష్యాలో 3,35,882 కేసులు ఉన్నాయి. మూడో స్థానంలో బ్రెజిల్ (3.30 లక్షలు), నాలుగో స్థానంలో బ్రిటన్ (2.55 లక్షలు), ఐదో స్థానంలో స్పెయిన్ (2.34 లక్షలు) ఉన్నాయి.

భారతదేశం 1.25 లక్షల కేసులతో 11వ స్థానంలో ఉంటే.. కరోనావైరస్ తొలుత వెలుగుచూసిన చైనా 84,081 కేసులతో 13వ స్థానంలో ఉంది.

ఏపీలో మొత్తం కేసులు 2,561

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 47 మందిని కోవిడ్19 పాజిటివ్‌గా గుర్తించినట్లు రాష్ట్ర నోడల్ అధికారి శనివారం బులెటిన్‌లో తెలిపారు. అలాగే కృష్ణా జిల్లాలో ఈ వ్యాధి వల్ల ఒకరు మరణించినట్లు చెప్పారు.

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,561కి పెరిగింది. వీరిలో 1,778 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. 56 మంది చనిపోయారని వివరించారు. ప్రస్తుతం 727 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 9,136 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు చెప్పారు. ఈ 24 గంటల్లో 47 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1,761గా ఉంటే.. వారిలో 1,043 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 45 మంది చనిపోయారు.

డోర్ లెవల్ రిపోర్టింగ్ వ్యవస్థ తయారు చేయాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

కోవిడ్‌ వచ్చిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్‌ చేయాలి? ఎలా వైద్య సదుపాయం పొందాలి? ఎవర్ని సంప్రదించాలి? లేకపోతే ఎవరికి ఫోన్‌చేయాలి? పరీక్షల కోసం ఎక్కడకు వెళ్లాలి? దీనికోసం ఎవరి సహకారం తీసుకోవాలి? ఐసోలేషన్‌ ఎలా పాటించాలి? తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని డోర్‌ లెవల్‌ రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నిర్దేశించారు.

ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ఈ విధానం ఉండాలన్నారు. 104 ఆరోగ్యం, వైద్యం అందించే అంబులెన్స్, 14410– టెలిమెడిసిన్‌ లేదా ప్రజాసమస్యలకోసం ఉద్దేశించిన 1902 లాంటి నంబర్లకు ఫోన్‌ చేసినా వెంటనే సంబంధిత వ్యక్తికి పరీక్షలు చేయడం, వైద్యం అందించడం లాంటి ప్రక్రియలు సాఫీగా సాగేలా సమర్థ యంత్రాంగాన్ని నిర్మించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కోవిడ్‌–19 నివారణపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్‌ నీలంసాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. రైలు సర్వీసులు, విమాన సర్వీసులు ప్రారంభం అవుతుండడంతో ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు రావడం మొదలవుతున్న నేపథ్యంలో కోవిడ్‌–19 నివారణకు తీసుకోదగ్గ చర్యలపై సమావేశంలో చర్చించారు.

అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్‌ గోదావరి, విశాఖపట్నం.. ఈ 8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న పడకల సంఖ్యను, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచుతున్నట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. ఏ ఆస్పత్రిలోనైనా వైద్య సిబ్బందికి కొరతలేకుండా చూసుకోవాలని.. ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి వెంటనే సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈస్ట్‌గోదావరి, వైజాగ్, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీల స్థాయిలోనే టెస్టింగ్‌ శాంపిళ్ల సేకరణ సదుపాయాలను కల్పించనున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వెల్లడించారు. దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తామన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)