ఏపీ పోతిరెడ్డిపాడు ప్రణాళికలపై స్టే ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే పనులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించింది.

విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పనులు ప్రారంభించవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఆపాలని నారాయణపేట జిల్లా బాపనపల్లి గ్రామానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారని జ్యోతి రాసింది.

దీనిపై ఎన్జీటీ ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రతిపాదిత ప్రాజెక్టుపై స్టే విధించడంతో పాటు అనుమతులు ఉన్నాయా లేదా, అవసరమా కాదా అన్న అంశంపై అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది.

దీనిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఇది పెద్ద ప్రాజెక్టు అని, అనుమతులు లేకుండా చేపడుతున్నారని తెలిపారు. దీని వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, అనేక తాగునీటి ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని వివరించారు.

ప్రస్తుతం తన వద్ద పూర్తి సమాచారం లేదని, నెల రోజుల సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది మాధురీ రెడ్డి కోరారు.

కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాన్ని గతం నుంచి తాము గమనిస్తున్నామని తెలిపింది.

కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే అభ్యంతరం లేదని, కానీ నిబంధనలకు లోబడి నిర్మించాలని స్పష్టం చేసింది.

నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ పరుగులు

ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమవుతాయని, చార్జీలు యధాతథంగా ఉంటాయని ఆర్టీసీ ఎండీ ప్రకటించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్‌ ప్రారంభించారు.

ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ ప్రారంభమైంది.

కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

  • సూపర్‌ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్‌ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. బస్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్‌ అమ్మాలని నిర్ణయించాం.
  • ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్‌ సదుపాయాన్ని కల్పించాం. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్‌ లేకుండా టికెట్‌ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్‌ బస్సులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించాం.
  • రాష్ట్రంలో తొలుత 17 శాతం సర్వీసులు, అంటే 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం.
  • ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. 26 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహిస్తాం. అటెండర్లు ఉండరు. ఏసీ సర్వీసుల్లో దుప్పట్లు ఇవ్వము.
  • లాక్‌డౌన్‌ కాలంలో ఆర్టీసీకి రూ.1,200 కోట్ల నష్టం వచ్చింది. రూ.700 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం అని ఆర్టీసీ ఎండీ చెప్పారని సాక్షి రాసింది.

దసరాకు డబుల్ బెడ్రూం ఇళ్ల గృహప్రవేశాలు

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు నాటికి 50 వేల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని కేటీఆర్ చెప్పారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్ల లక్ష్యం త్వరలో పూర్తవుతుందని.. దసరా నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో గృహనిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని.. హైదరాబాద్‌లో లక్ష ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని తెలిపారు.

ఆగస్టు నాటికి 50వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తామన్నారు.

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నాయని వర్కింగ్‌ ఏజెన్సీలు తెలిపాయి.

స్టీలు, సిమెంట్‌, ఇసుక వంటి అంశా ల్లో కొన్ని ఇబ్బందులుఉన్నాయని మంత్రుల దృష్టికి తీసుకొచ్చాయి. వీటిపై ఏజెన్సీలకు ప్రభు త్వం సహాయకారిగా ఉంటుందని, ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

అన్ని శాఖల సమన్వయంతో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.

నిర్మాణాలు పూర్తయినచోట మౌలిక వసతుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

ఏపీలో కొత్త కరోనా మార్గదర్శకాలు

కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

లాక్‌డౌన్‌ ఈనెల 31 వరకు పొడిగిస్తూ కంటెయిన్‌మెంట్‌, కోర్‌, బఫర్‌ జోన్లలో కాకుండా మిగతా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు పురపాలకశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది.

వీటిలో సవరించిన మార్గదర్శకాలు బుధవారం వెలువడ్డాయి. అవి ఇలా...

ఎక్కువ రుసుం వసూలుచేసే సెలూన్లలో...

  • అందరికీ థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరి. ఖాతాదారుడి పేరు, నంబరు తీసుకోవాలి. ఖాతాదారులు ముందస్తు అనుమతితో రావాలి తప్ప ఎక్కువమంది నిరీక్షించకూడదు.
  • సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ఉపయోగించాలి. ఖాతాదారులకు మాస్క్‌ ఉండాలి.
  • ఖాతాదారుల కుర్చీలను తరచు శుభ్రపరచాలి. షాపు తెరిచేటప్పుడు, మూసే ముందు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో క్రిమిరహితం చేయాలి.

తక్కువ రుసుం వసూలుచేసే సెలూన్లలో

  • యజమాని, సిబ్బంది మాస్కులు, చేతి గ్లోవ్స్‌ వినియోగించాలి.
  • క్షవరం పూర్తయ్యాక ఖాతాదారు కూర్చున్న కుర్చీ, ఆవరణను ద్రావణంతో క్రిమిరహితం చేయాలి.
  • ఒకసారి వినియోగించిన రేజర్లు రెండోసారి ఉపయోగించరాదు.

వ్యాపార సంస్థలు, దుకాణాల్లో...

  • నగదు రహితంతో పాటు బిల్లుల వసూళ్లు వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి. వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలుండాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్క్‌లు తప్పనిసరి.
  • దుకాణంలో సిబ్బంది సగం మందే ఉండాలి. వీరంతా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్‌ లక్షణాలున్న సిబ్బందిని అనుమతించరాదు.
  • చిన్నారులు, వృద్ధులను అనుమతించరాదు. మరుగుదొడ్లు గంటకోసారి విధిగా శుభ్రం చేయించాలని ఇందులో వివరించినట్లు ఈనాడు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)