కరోనావైరస్: లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు, జోన్‌లపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం కల్పించే అవకాశం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఉండచ్చని, జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని ఈనాడు కథనం ప్రచురించింది.

లాక్‌డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది.

భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు. దానికి గడువు శుక్రవారంతో ముగిసింది. అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.

జోన్లు/ హాట్‌స్పాట్ల నిర్ణయం, ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయని ఈనాడు చెప్పింది.

క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణీత ప్రాంతంలో ప్రజల కదలికల్ని, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడానికి, లేదా నియంత్రించడానికి రాష్ట్రాలకు దానివల్ల వీలుంటుంది.

‘అవసరాలకు అనుగుణంగా’ రైళ్లను, దేశీయ విమాన సర్వీసులను వచ్చేవారం నుంచి పరిమితంగా పునఃప్రారంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్లు నడుపుతుండటం వల్ల భవిష్యత్తులో భౌతిక దూరం పాటిస్తూ విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలూ తిరగడానికి అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది.

కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు లేనిచోట్ల స్థానిక రైళ్లు, మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది.

ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి.

మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్‌, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి.

బిహార్‌, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్‌ చేశారని ఈనాడు చెప్పింది.

పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు, కళ్లజోళ్ల దుకాణాలు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని. ఒకటిరెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువరిస్తారని ఈనాడు వివరించింది.

18 నుంచి ఆఫీసులకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నామమాత్రపు సిబ్బందితో పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు పూర్తిస్థాయి ఉద్యోగులతో పని చేయనున్నాయని చెబుతూ ఒక వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రుచురించింది.

సోమవారం నుంచి ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించిందని పత్రిక తెలిపింది.

రెడ్‌జోన్‌లలోని ఆఫీసులలో మాత్రం మరికొంతకాలం వేచి చూశాక కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. లాక్‌డౌన్‌ ముగుస్తున్నందున 18వ తేదీ నుంచి సాధారణ పౌర జీవనం అమలయ్యేలా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

అయితే లాక్‌డౌన్‌ సమయంలో పాటించిన భౌతిక దూరం, మాస్కులు ధరించడం, పారిశుద్ధ్యం, శానిటేషన్‌ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. సాధారణ జనజీవనాన్ని పునఃప్రారంభించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

అవసరమైనవారినే ఆఫీసుకు రావాలని ఆదేశించాలి. మిగిలినవారిని ఇంటి వద్ద నుంచే పనిచేయమని సూచించాలి.

ఎక్కువ రోజులు వాడే ఎన్‌-95 మాస్కులు కాకుండా ప్రతిరోజూ కొత్త ఫేస్‌మాస్క్‌ను ప్రతి ఉద్యోగికీ అందించాలి. శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. కార్యాలయాల్ని పరిశుభ్రంగా ఉంచాలి. కార్యాలయంలో ఎవరైనా ఆనారోగ్యం బారిన పడితే వారికి వైద్య పరీక్షలు చేయించాలి.

అనారోగ్యం వల్ల ఆఫీసుకు రాలేకపోతున్న ఉద్యోగులు సెలవులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఒకవేళ ఉద్యోగులు కంటైన్మెంట్‌ ఏరియాలో ఉంటే ఏరియా స్థానిక అధికారుల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుని ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు.

న్యాయశాఖ సాధారణ పరిపాలనశాఖ పరిధిలోకి రాదు. దీంతో ఆ శాఖ ప్రత్యేకంగా ఉద్యోగులందరూ హాజరుకావాల్సిందే అని ఉద్యోగులకు ఒక మెమో జారీ చేశారు.

నగరంలో ఆ నాలుగు జోన్లలోనే యాక్టివ్ కేసులు: కేసీఆర్

హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప తెలంగాణలో ఎక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ తెలిపారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

కరోనావైరస్‌ ఎంతకాలం ఉంటుందో తెలియని నేపథ్యంలో దానితో కలిసి జీవించే వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

కోవిడ్‌-19పై భయపడాల్సిన అవసరం లేదని, వైరస్‌ సోకి కోలుకుంటున్నవారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కరోనా వచ్చినవారిలో మరణించిన వారిశాతం 2.38 మాత్రమేనని, దేశ సగటు 3.5 శాతంకన్నా తక్కువేనని చెప్పారు.

హైదరాబాద్‌లోని నాలుగుజోన్లలో తప్ప, రాష్ట్రంలో మరెక్కడా కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ముఖ్యమంత్రి ప్రకటించారని పత్రిక చెప్పింది.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని, ఆప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నామని చెప్పారు.

యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో వలసకూలీలకే వైరస్‌ సోకిందని, వారు హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో శనివారం నుంచి ఏసీలు అమ్మేషాపులు, ఆటోమొబైల్‌షోరూంలు, స్పేర్‌పార్ట్స్‌ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారని పత్రిక వివరించింది.

కేంద్రం విధించిన లాక్‌డౌన్ 17న ముగిశాక కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలు పరిశీలించాక రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగిన వ్యూహం ఖరారు చేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

లాక్‌డౌన్ వల్లే కరెంటు బిల్లులు పెరిగాయి: ఏపీ ప్రభుత్వం

ఏపీలో లాక్‌డౌన్ వల్ల జనం ఇళ్లలోనే ఉండడం వల్లే కరెంటు బిల్లులు పెరిగాయని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పినట్లు సాక్షికథనం ప్రచురించింది.

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, కొన్ని మీడియా సంస్థలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు.

శ్లాబుల ధరలు పెరగలేదని, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వల్ల కరెంట్‌ వినియోగం పెరిగిందని చెప్పారు.

ఆ మేరకు కొంత బిల్లు పెరగవచ్చు కానీ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. కరోనా విపత్తు నియంత్రణకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా కష్టపడుతున్న వేళ రాజకీయాలు చేయడం సరికాదన్నారని సాక్షి రాసింది.

ఏపీఈఆర్సీ ఇప్పుడు డైనమిక్‌ పద్ధతి అమలులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో ఏ నెలలో ఎంత విద్యుత్‌ వినియోగిస్తే అదే శ్లాబులో ఉంటుంది. దీని ఫలితాలు వచ్చే రెండు నెలల్లో వినియోగదారులకు కనిపిస్తాయి అని బుగ్గన చెప్పారు.

విద్యుత్తు వినియోగదారులకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడిస్తున్న బిల్లులు మూడు నెలల సగటు యూనిట్లను లెక్కించి ఇస్తున్నారు. మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది అని మంత్రి అభిప్రాయపడినట్లు సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)