కరోనావైరస్: మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ.. ఈ మూడు రాష్ట్రాల్లోనే సగానిపైగా కరోనావైరస్ కేసులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని కోవిడ్-19 కేసుల్లో సగానికిపైగా మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయంటూ ఈనాడు దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మొత్తం మీద డజను రాష్ట్రాలు దేశాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి. మరణాల సంఖ్య భయపెడుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆశాజనకంగా కనిపిస్తున్నా కొత్త కేసుల తీవ్రత ఎక్కువవుతోంది.
కొద్ది రోజుల క్రితం వరకు సగటున వెయ్యి చొప్పున కొత్త కేసులు రాగా గత మూడు రోజులుగా వరుసగా గరిష్ట సంఖ్యలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
సోమవారం నాడు 2,573 కేసులు వచ్చాయి. 24 గంటల్లో 83 మంది మరణించారు. కోలుకుంటున్న వారి శాతం ఒక్క రోజులో 27.03 నుంచి 27.45కి చేరింది. ఇది కొత్త రికార్డు.
మొత్తం కేసుల సంఖ్య42,836కి, మృతుల సంఖ్య 1,389కి చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీలోనే మొత్తం కేసుల్లో 55.91% నమోదయ్యాయి. కోలుకున్న వారిలో ఆ మూడు రాష్ట్రాల వాటా 38.42%కాగా, మరణాల్లో 64.93%.
దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 93.47% వరకు 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మరణించిన వారిలో 96.61%, కోలుకున్న వారిలో 88.24% వాటి నుంచే ఉన్నారు.
ఈ12 రాష్ట్రాల్లో మాత్రమే నమోదైన మొత్తం కేసుల్లో 25.92% మంది కోలుకోగా, 3.35% మంది మరణించారని ఈనాడు ఈ కథనంలో తెలిపింది.

ఏపీలో మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయుల కాపలా
కరోనా విధుల పేరిట ఉపాధ్యాయులకు సోమవారం నుంచి వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారంటూ నవతెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులను క్యూలో పెట్టే పని ఉపాధ్యాయులకు పోలీసులు అప్పగించారు. అయితే తమను ఈ పనికి కేటాయించడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విశాఖ జిల్లాలో మొదట 780 మంది ఉపాధ్యాయులకు ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు కరోనా డ్యూటీలు వేశారు. వీరంతా ప్రధాన కూడళ్లు, రైతు బజార్ల వద్ద విధులు నిర్వహించారు. ఇక ఎండల్లో తాము విధులు నిర్వహించలేమని వారు తెగేసి చెప్పడంతో వారందరినీ నిలిపివేశారు.
ఆదివారం నుంచి రెండో దశలో వెయ్యిమంది ఉపాధ్యాయులకు కరోనా డ్యూటీలు వేశారు. వారిలో సమారు 200 మందిని జిల్లాలోని వివిధ మండలాల్లో వైన్ షాపుల వద్ద మందు బాబులను క్యూలో నిల్చోబెట్టే పని అప్పగించారు.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉపాధ్యాయులు తమ సర్వీసుకు సంబంధం లేని విధులను కేటాయిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఈ డ్యూటీలను రద్దు చేయకపోతే తమ విధుల్ని బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.
అత్యవసర సేవల కింద తాము రానప్పటికీ సామాజిక బాధ్యతతో విధుల్ని నిర్వహిస్తున్నామని, తగిన రక్షణ సామాగ్రి, భోజన సదుపాయం లేకపోయినా పని చేస్తున్నామని అలాగని వైన్ షాపుల వద్ద విధులు నిర్వహించమనడం సరికాదని సంఘాలు వ్యాఖ్యానించాయి. తక్షణం వీటిని రద్దు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేసినట్టు నవతెలంగాణ ఈ కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా నుంచి వచ్చే కంపెనీలకు భారత్ ఆహ్వానం
చైనా నుంచి వచ్చే కంపెనీలకు రెడ్ కార్పెట్కరోనా వైరస్ కారణంగా చైనాలో కొలువుదీరిన అనేక బహుళ జాతి కంపెనీలు ఆ దేశానికి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ సిద్ధమవుతోందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషయంలో మోదీ సర్కార్ సైలెంట్‌గా పని చేసుకుపోతోంది. ఈ కంపెనీలు భారత్‌లో తమ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటే, అందుకు అవసరమైన స్థలాలను కేటాయించేందుకు 4,61,589 హెక్టార్ల భూములను ప్రభుత్వం గుర్తించింది.
ప్రభుత్వం గుర్తించిన భూముల్లో 1,15,131 హెక్టార్లు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఉన్నట్టు సమాచారం.
మన దేశంలో ఏదైనా కంపెనీ తమ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలంటే, వాటంతట అవే ఆ భూముల్ని సేకరించుకోవాలి. దీనికి తోడు అనుమతుల జారీలో జాప్యం మరో సమస్య.
ఈ కారణాలతోనే పోస్కో వంటి కంపెనీలు భారత్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ ప్రాజెక్టులను వెనక్కితీసుకున్నాయి. చైనాలో మాత్రం ఈ కంపెనీలకు అవసరమైన అన్నీ సమకూర్చి ‘ప్రపంచ ఉత్పత్తి కేంద్రం’గా ఎదిగింది. కరోనా తర్వాత చైనాపై బహుళ జాతి కంపెనీల అభిప్రాయం మారింది. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి.
కేంద్ర ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇందుకోసం అనేక అమెరికా, జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో తెలిపింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

సీసీఎంబీ సెల్ థెరపీ
హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ అండ్ సెల్యులర్ బయాలజీ (సీసీఎంబీ), బెంగళూరుకు చెంది న ‘ఐస్టెమ్ రీసెర్చ్‌ప్రైవేట్ లిమిటెడ్' మధ్య సోమవారం కీలక ఒప్పందం కుదిరిందంటూ నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటికే ఆఫ్రికన్ గ్రీన్ మంకీ మూత్రపిండాల నుంచి సేకరించిన కణాలపై వైరస్‌ను ప్రయోగించి పరిశీలిస్తున్న సీసీఎంబీ తాజాగా మనుషుల కణాలపై ‘సెల్ థెరపీ’ని మొదలుపెట్టనున్నది. అందుకోసం అవసరమైన మానవ ఊపిరితిత్తుల్లోని ఎపిథిలియల్ కణాలను ఐస్టెమ్ సంస్థ సమకూర్చనుంది.
ఈ సెల్ థెరపీ ద్వారా కరోనా వైరస్ మానవ కణాలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నదో తెలుసుకుని రోగ లక్షణాలను స్పష్టంగా ఆవిష్కరించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.
ఐస్టెమ్ అందించే కణవ్యవస్థ ‘ఏసీఈ2 గ్రాహకం’ ద్వారా వైరస్ ప్రభావాన్ని గుర్తించనున్నామని చెప్పారు. మానవులలో వృద్ధిచెందుతున్న కరోనా వైరస్ కణాలను బయట పరిశోధనశాలల్లో వృద్ధి చేయడం సాంకేతికంగా పెద్ద సవాలుగా మారిందని రాకేశ్ మిశ్రా చెప్పారు.
ఐస్టెమ్ సంస్థ అందించే ఎపిథిలియల్ కణాల ద్వారా వ్యాధి లక్షణాలను తెలుసుకునే ప్రయోగం మరింత సులభతరమవుతుందని ఆయన అన్నారు. కరోనా వైరస్ మానవ ఊపిరితిత్తులపైనే దాడి చేస్తున్నదని ఐస్టెమ్ అందించే ఎపిథిలియల్ కణాలపై వైరస్‌ను ప్రయోగించడం వల్ల సత్వర ఫలితాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మనుషులపై వైరస్ ఏ విధంగా ప్రభావం చూపుతుంది వాటి లక్షణాలు ఏమిటనేది తెలుసుకోవడం ద్వారా ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్‌ను రూపొందించడానికి అవసరమైన సాంకేతిక సాయాన్ని అందించవచ్చని చెప్పారు.
మరో నాలుగు రోజులలో ఈప్రయోగాలను మొదలుపెడతామని మిశ్రా తెలిపారు. ఆధునిక జీవ శాస్త్ర పరిశోధనలలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న సీసీఎంబీతో కలిసి పనిచేయడం తమకు లభించిన మంచి అవకాశంగా భావిస్తున్నామని ఐస్టెమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జొగిన్ దేశాయ్ తెలిపినట్టు నమస్తే తెలంగాణ ఈ కథనంలో వివరించింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా
- 'కరోనావైరస్ చైనాలోనే పుట్టింది' - ట్రంప్ నోట ఇప్పటికీ అదే మాట
- కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా ఉన్నారు... సంతోషంగా ఉందన్న డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ను న్యూజీలాండ్ ఎలా ఎదుర్కోగలిగింది?
- కరోనావైరస్: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 తగ్గింది... భారత్‌లో ఎందుకు తగ్గించడం లేదు?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా.. గిమ్మిక్కా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























