You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోరీల్లోకి 8 లక్షల లీటర్ల బీరు.. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన రూ.700 కోట్ల విలువైన మద్యం : ప్రెస్ రివ్యూ
లాక్‌డౌన్ కారణంగా నిల్వ ఉండిపోయిన రూ. 700 కోట్ల మద్యం వృథా కానుందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''లాక్‌డౌన్ వల్ల దాదాపు నెలన్నరగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 250 మైక్రో బ్రూవరీల వద్ద ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు నిల్వలు పేరుకుపోయాయి. మొత్తం ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్ బీరు వృథాగా ఉన్నదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బాటిళ్లలో నింపే బీర్ల మాదిరిగా కాకుండా క్లబ్బులు, బార్లలో లభించే ఫ్రెష్, క్రాఫ్ట్ బీర్లు తొందరగా పాడవుతాయని మద్యం ఉత్పాదక సంస్థల సంఘం (క్రాఫ్ట్ బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)వర్గాలు తెలిపాయి. తాజా సడలింపుల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా, బార్లు, క్లబ్బులకు సడలింపులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సంస్థలన్నీ బీరును పారబోసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు, దేశీయంగా ఉత్పత్తిచేసిన 12లక్షల కేసుల విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్) లాక్‌డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్టు సీబీఏఐ తెలిపింది. దీని విలువ రూ.700 కోట్లు'' అని ఆ కథనంలో తెలిపారు.
21 వరకు లాక్‌డౌన్?
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసిందంటూ 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది.
''తెలంగాణలో లాక్‌డౌన్ ఈ నెల 21 వరకు పొడిగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ పొడిగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ గడువును పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండువారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించాలని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్ జోన్లలో క్వారంటైన్ గడువు ఈ నెల 21న ముగియడాన్ని ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
అడవిలో సీతక్క
తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలకు సరకులు సరఫరా చేసేందుకు వాగులు, వంకలు దాటుకుంటూ మూటలు మోసుకుంటూ వెళ్తున్నారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ఆదివాసీలు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది. ములుగు సబ్‌రిజిస్ర్టార్ తస్లీమా బేగంతో కలిసి ఆదివారం గుమ్మడిదొడ్డి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. 20 గిరిజన కుటుంబాలకు ఆ సరుకులను అందజేశారు'' అని ఆ కథనంలో రాశారు.
'రాజమౌళి గారు.. రామాయణం తీయండి'
భారత ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని రాజమౌళి వెండితెరపై ఆవిష్కరిస్తే చూడాలని సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ 'ఈనాడు' ఒక కథనం ప్రచురించింది.
''వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యాన్ని ధారావాహికగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు రామానంద సాగర్. 1987లో ప్రసారమైన ఈ సిరీయల్‌ను ప్రేక్షకుల కోరిక మేరకు లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో ఇటీవల ఈ సీరియల్ ఎక్కువ మంది వీక్షకులతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా 'రాజమౌళి సర్.. రామాయణం చేయండి' అని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్‌ను రాముడిగా చూడాలనుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న వరుస ట్వీట్లతో #RajamouliMakeRamayan అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో(ఆదివారం) దూసుకెళ్లింది. అభిమానుల ట్వీట్లపై రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షమైన తరువాత ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య కాల్పులు
- కరోనావైరస్: లాక్‌డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
- కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)