ప్రెస్ రివ్యూ: లాక్ డౌన్ పాక్షిక సడలింపులు నేటి నుంచే...

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి లాక్ డౌన్‌కు పాక్షిక మినహాయింపులు అమల్లోకి రానున్నాయని ఆంధ్రజ్యోతి ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

గతంలో వ్యవసాయం, నిత్యావసరాలకు మినహాయింపు ఉండగా ఇప్పుడు ఆ జాబితాను మరింత పెంచారు. అయితే రెడ్ జోన్ ఉన్న మండలాలు, నగరాలు, పట్టణాల్లో మాత్రం లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. రెడ్ జోన్‌లో ఉన్న మండలాలే కాకుండా ఆ చుట్టు పక్కల ఉన్న మండలాలు కూడా రెడ్ జోన్లో ఉన్నట్లే పరిగణిస్తారు.

అదేవిధంగా, కట్టడి ప్రాంతంగా ప్రకటించిన ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 7 కిలోమీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోమీటర్లు బఫర్ జోన్‌గా నిర్ణయించారు. ఈ జోన్‌లో మినహాయింపులు వర్తించవు. రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో 14 రోజుల పాటు కొత్త కేసులు రాకుండా ఆరెంజ్‌ జోన్లోకి మారుస్తారు.

మరో 14 రోజులు కూడా కొత్త కేసులు నమోదు కాకుండా ఉంటే అప్పుడు ఆరెంజ్ జోన్లోకి మారుస్తారు. ప్రస్తుతం గ్రీన్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్‌కు పాక్షిక సడలింపులు ఇచ్చారు.

వ్యవసాయ రంగం - అన్ని వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. అలాగే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉత్పత్తి, విక్రయాలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనిముట్ల తయారీ మరమ్మత్తులకు సంబంధించిన పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్లు, శీతల గిడ్డంగులు, పండ్రు, కూరగాయల సంబంధిత మండీలు పని చేస్తాయి. కూరగాయల బళ్లు నిర్వహించుకోవచ్చు.

మత్స్య, పాడి పరిశ్రమ - చేపల ఉత్పత్తి, చేపల విక్రయానికి అనుమతి, పాల సేకరణ, విక్రయాలు, కోళ్ల పరిశ్రమ, దాణా, అమ్మకాలు, గోశాల నిర్వహణ కార్యకలాపాలు కొనసాగుతాయి. వైద్య సదుపాయాలు - అన్ని ఆస్పత్రులు, క్లీనిక్కులు, నర్శింగ్‌హోమ్‌లు, లేబొరేటరీలు పని చేసుకోవచ్చు. పశువుల ఆస్పత్రులు కూడా సేవలందించవచ్చు.

ఉపాధి హామీ పథకం – ఉపాధి హామీ పథకం పనులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులకు అనుమతి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఐటీ రిపేర్లు, కార్పెంటర్లు పని చేసుకోవచ్చు.

ఆర్థికరంగం -బ్యాంకింగ్, పోస్టల్, మీ సేవా కేంద్రాలు పని చేస్తాయి.

రవాణా రంగం – లారీలు, ట్రక్కులకు సంబంధించిన మరమ్మత్తు దుకాణాలు పని చేస్తాయి. హైవేల్లో దాబాలకు అనుమతి. అయితే అక్కడ పార్శిళ్లు మాత్రమే ఇవ్వాలి. ద్వి చక్ర వాహనంపై ఒకరికి, కార్లలో ఇద్దరికి అనుమతి.

పరిశ్రమలు -గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలను నిర్వహించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యకు లోబడి తగిన జాగ్రత్తలతో నడుపుకోవచ్చు. ఇటుక బట్టీలకు అనుమతి, ధాన్యం, పప్పుల మిల్లులు, పిండి మిల్లులు, పాల ఉత్పత్తులు, వాటర్ ప్లాంట్లు, ఆహార వస్తువులు, వైద్య పరికరాలు, మందుల తయారీ సంస్థలు, ఇతర నిత్యావసరాలకు సంబంధించిన సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి, ఈకామర్స్ సంస్థల కార్యకలాపాలు, పోర్టులు, విమానాశ్రయాల వద్ద ఉన్నగిడ్డంగులు, రవాణా, కోవిడ్ కిట్ల తయారీ రంగ పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చారు.

నిత్యావసరాలు - అన్ని కిరాణ షాపులు, మందుల దుకాణాలు, పాల కేంద్రాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలకు అనుమతిస్తారని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.

దురుద్ధేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చారన్న నిమ్మగడ్డ

దురుద్ధేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చారన్న నిమ్మగడ్డ రమేశ్

నిష్పాక్షిక ఎన్నికల కోసమే ఆర్డినెన్స్ తెచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో నిజం లేదని మాజీ ఎన్నికల మిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు నివేదించినట్టు ఈనాడు పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తనను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించాలన్న దురుద్ధేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. ఎస్ఈసీ నిబంధనలకు మాత్రమే రాజ్యంగ అధికరణ 243(కె) రక్షణ వర్తిస్తుంది కానీ పదవీ కాలానికి కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని రమేష్ కుమార్ అన్నారు.

పదవీ కాలానికి కూడా రాజ్యాంగ రక్షణ ఉందన్నారు. సుప్రీం కోర్టు అనేక సందర్భాల్లో సర్వీసు నిబంధనలు అంటే పదవీకాలంతో కలుపుకొని అని స్పష్టం చేసిందన్నారు. నిష్పాక్షిక ఎన్నికల కోసమే ఆర్డినెన్స్ తెచ్చామని శనివారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానంగా రమేష్ కుమార్ ఆదివారం రిప్లై కౌంటర్ వేశారు.

ఆయన వేసిన కౌంటర్ ఇవాళ విచారణకు రానుందని ఈనాడు పత్రిక ఈ కథనంలో పేర్కొంది.

కరోనావైరస్:త్వరలో రోజుకు 17,500 కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఏపీ వైద్య శాఖ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:త్వరలో రోజుకు 17,500 కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఏపీ వైద్య శాఖ

త్వరలో రోజుకు 17,500 కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్య శాఖ అధికారులు ఏపీ సీఎం జగన్మోన్ రెడ్డికి వివరించారంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

వారం, పది రోజుల్లోనే రోజుకు 17,500 కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య శాఖ వెల్లడించింది. సీఎం ఆదేశాల మేరకు కరోనా పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు ఆ శాఖ అధికారాలు తెలిపారు.

శనివారం ఒక్క రోజే 5,508 పరీక్షలు నిర్వహించామని ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

అందుబాటులో ఉన్న రాపిడ్ టెస్ట్ కిట్లను వినియోగించకుండానే ఈ స్థాయికి చేరుకున్నామని, నాలుగైదు రోజుల్లో టెస్టుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.మొత్తంగా పది రోజుల్లో రోజుకి 17,500 పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుంటామన్నారు.

రెండు రోజుల్లో ర్యాండమ్ కిట్ల వినియోగం మొదలవుతుందని తెలిపారు. రెడ్ జోన్లలో ర్యాండమ్ సర్వే చేయడంతో పాటు కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారిని కూడా పరీక్షిస్తామని అధికారులు వివరించినట్టు సాక్షి ఈ కథనంలో తెలిపింది.

విద్యుత్ మోటారు స్టార్టర్ పెట్టె

ఫొటో సోర్స్, Getty Images

గ్యాస్ తరహాలోనే కరెంట్ సబ్సిడీ

విద్యుత్ రంగం ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందంటూ నవ తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

విద్యుత్ పంపిణీ రంగంలో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సులు, ఫ్రాంచైజీలను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ఈ మేరకు కేంద్ర విద్యుత్ చట్టం 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన విద్యుత్ చట్టం సవరణల ముసాయిదా బిల్లు-2020పై 21 రోజుల్లో అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేసింది.

విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సులు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి.

ఫలితంగా ఏ ప్రాంతంలో డిస్కంలు ఆ ప్రాంతంలో తమ తరపున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరైనా వ్యక్తులను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సులుగా నియమించుకోవచ్చు. అందుకుసంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి.

అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియమించిన బడిన వ్యక్తి, సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకొని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోనున్నది. ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కింలే బాధ్యత వహిస్తాయి.

ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నవ తెలంగాణ ఈ కథనంలో వివరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)