కరోనావైరస్ - కేసీఆర్ ప్రెస్‌మీట్: తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 తరువాత సడలింపులు ఉండవు

ఫొటో సోర్స్, facebook/kcr
తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్నా ఏప్రిల్ 20 తరువాత సడలింపు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి.. ఇంతవరకు 21 మంది మరణించారు.. 186 మంది కోలుకుని డిశ్చార్జయ్యారని చెప్పారు.
ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా ఏమీ లేదని చెప్పారు.
33 జిల్లాల్లో 4 జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదన్నారు.
దేశంలో కేసుల రెట్టింపు సమయం 8 రోజులు ఉండగా తెలంగాణలో అది 10 రోజులుగా ఉంది. మరణాల రేటు జాతీయ స్థాయిలో 3.22 శాతం ఉండగా తెలంగాణలో 2.44 శాతం ఉంది.
దేశంలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 254 మందిని పరీక్షిస్తుండగా తెలంగాణలో 375 మందిని పరీక్షిస్తున్నామని చెప్పారు.
సడలింపుల్లేవ్..
ప్రపంచలో 42 దేశాలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌లో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.
వుహాన్ 72 రోజులు, ఐర్లాండ్ 67, ఫ్రాన్స్ 55,ఆస్ట్రేలియా 54, మలేసియా, లిథువేనియా 43, పెరూ 42 రోజులు లాక్ డౌన్లో ఉన్నాయన్నారు.
మన దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్నా ఏప్రిల్ 20 తరువాత సడలింపు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం సడలింపు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు.
ప్రస్తుతం ఏ నిబంధనలున్నాయో, ఎలాంటి ఆంక్షలున్నాయో అవన్నీ కొనసాగుతాయని చెప్పారు.
స్థానిక పరిస్థితులను బట్టి తమ మార్గదర్శకాలకు మించి ఏ రాష్ట్రమైనా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పింది.. ఆ ప్రకారమే తెలంగాణలో సడలింపులు ఇవ్వరాదని మంత్రివర్గం నిర్ణయించింది.
తాము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే లాక్‌డౌన్ కొనసాగించాలనే చాలామంది కోరుకున్నారని చెప్పారు. ''92 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. కొన్ని చానళ్లు చేసిన సర్వేల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజలు'' అన్నారు.
స్విగ్గి, జొమాటో సర్వీసులు నిలిపివేత
కిరాణా సరకులు సరఫరా చేసే ఆన్‌లైన్ సంస్థలకు అనుమతిస్తున్నామని.. వండిన ఫుడ్ సరఫరా చేసే స్విగ్గి, జొమాటో వంటివాటికి రేపటి నుంచి అనుమతులు నిలిపివేస్తున్నామని చెప్పారు.
‘మే 7లోపు హైదరాబాద్ ఎవరూ రావొద్దు.. వస్తే ఇబ్బంది పడతారు’
మే 4 తరువాత విమాన ప్రయాణాలను కేంద్రం ఒకవేళ అనుమతించినా హైదరాబాద్‌కు మాత్రం ఎవరూ మే 7 దాటే వరకు రావొద్దని కేసీఆర్ కోరారు. వచ్చినా హోటళ్లు, క్యాబ్‌లు ఏవీ దొరక్క ఇబ్బంది పడతారని చెప్పారు.
సామూహిక ప్రార్థనలకు అనుమతుల్లేవ్
పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. సామూహిక ప్రార్థనలకు అనుమతుల్లేవన్నారు.

పాతబస్తీలో మొన్న జామా మసీదులో కూడా మొన్న ఒకరిద్దరితోనే ప్రార్థనలు జరిగాయన్నారు. తిరుమల, శ్రీశైలం, భద్రాచలం, వేములవాడ వంటివన్నీ భక్తులకు దర్శనాలు నిలిపివేశారని.. మతాలతో సంబంధం లేకుండా అందరూ ఈ స్ఫూర్తి కొనసాగించాలన్నారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమర్థంగా పనిచేస్తూ కోవిడ్-19 నియంత్రణకు కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు.
వేతనాల విషయంలో కోతలు కొనసాగుతాయి. పింఛనర్లలో 1,11,000 మందికి(వీరు పింఛనుదారు మరణానంతరం పింఛను పొందుతున్న జీవితభాగస్వాములు) మాత్రం 50 శాతం బదులు 75 శాతం ఇస్తామన్నారు.
ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద పోలీసులకు గ్రాస్ శాలరీలో 10 శాతం అదనంగా చెల్లిస్తామన్నారు.

3 నెలల వరకు అద్దెలు అడగొద్దు.. స్కూలు ఫీజులు పెంచొద్దు
మూడు నెలల వరకూ కిరాయి అడవద్దని ఇంటి యజమానులను కేసీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ ఆదేశమని ఆయన చెప్పారు. ఈ మూడు నెలల అద్దె వసూలు చేసినప్పుడు దానిపై వడ్డీ వేయరాదని.. ఇళ్ల యజమానులు ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
యజమానులు ఎవరైనా ఇబ్బంది పెడితే అద్దెకు ఉండేవారు 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
స్కూళ్లు ఫీజులు పెంచడానికి వీల్లేదని చెప్పారు. ఫీజు కూడా నెలవారీగా వసూలు చేయాలే కానీ ఏడాది మొత్తానికి ఒకేసారి కట్టాలని ఒత్తిడి చేయరాదన్నారు.

ఫొటో సోర్స్, facebook/kcr
తెల్ల రేషన్ కార్డు ఉంటే కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 12 కేజీల చొప్పున ఉచిత బియ్యం.. కుటుంబానికి రూ.1500 సాయం
తెల్ల రేషన్‌కార్డుదారులకు మే నెలలోనూ ప్రతి కార్డుపైనా వ్యక్తికి 12 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 1500 ఇస్తామన్నారు. మే మొదటివారంలోనే ఇది అందుతుందని చెప్పారు.
పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందిపడుతున్నామని వినతులు పంపించారు.. లాక్‌డౌన్ సమయంలో ఏప్రిల్, మే నెలలకు వారు చెల్లించాల్సిన స్థిర చార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్‌లో కొత్త ఆసుపత్రి ఏర్పాటు
తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్(టిమ్స్) ఏర్పాటు. గచ్చిబౌలిలో క్రీడా భవనాలు కేటాయింపు.
రైతులు పండించిన పంట ఉత్పత్తులన్నీ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
భారత దేశ చరిత్రలో తొలిసారి ఒక రాష్ట్రం రైతులు పండించిన అన్ని పంటలనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. అది తెలంగాణ అని చెప్పారు.
ప్రతి పంటనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. ఎవరూ తక్కువ ధరకు ప్రయివేటు వ్యాపారలుకు విక్రయించి నష్టపోవద్దని కేసీఆర్ సూచించారు.
మే 7 తరువాత కూడా పెళ్లిళ్లు వంటివి వేడుకగా జరుపుకొనే అవకాశం లేదు.. ఈ నెల రోజులు ఫంక్షన్ హాళ్లను ఎరువుల నిల్వకు తాత్కాలిక గోదాములుగా వాడాలని అధికారులకు సూచించామన్నారు.
వ్యవసాయం ఆగితే దెబ్బతింటాం
ఈ రోజు 130 కోట్ల భారతదేశానికి అన్నం పెట్టగలిగే దేశం ప్రపంచంలో ఏదీ లేదు.
అందుకే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం వీల్లేదు.. రైతులను, సాగును కాపాడుకోవాల్సిందేనని కేసీఆర్ చెప్పారు.
వ్యవసాయ పనులు, దాని అనుబంధ పరిశ్రమలు కొనసాగించాలని.. భౌతిక దూరం పాటిస్తూనే ఈ రంగాలు నడవాలని.. లేదంటే తీవ్రమైన ఆహార సమస్య ఎదురవుతుందని అన్నారు.
‘రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలి’
దేశ విత్త విధానం కేంద్రం చేతిలో ఉందని.. ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలని, వెంటనే రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు.
రాష్ట్రాలు ఈ క్లిష్ట సమయంలో ఆర్థికంగా నిలబడాలంటే ఇది తప్పదన్నారు.
తాను ఇప్పటికే ప్రతిపాదించిన క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ వంటివి అమలు చేయాలన్నారు. ప్రధాని దీనిపై ఆశావహంగా మాట్లాడారని కేసీఆర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
- కరోనావైరస్ లాక్‌డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
- కరోనావైరస్: లాక్‌డౌన్‌లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- కరోనావైరస్-లాక్‌డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























