You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమరావతిలో పవన్ కల్యాణ్: 'రాజధాని ఎక్కడికీ పోదు.. మోదీ, అమిత్‌షాలను నిందించొద్దు' - ప్రెస్ రివ్యూ
నవ్యాంధ్ర రాజధాని ముమ్మాటికీ అమరావతేనని.. జనసేన, బీజేపీల నిర్ణయం ఇదేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. రాజధాని అంశం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడేది కాదని.. దయచేసి వారిని నిందించొద్దని పవన్ పేర్కొన్నట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ఆయన శనివారం యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళలు గత 60 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికారు.
జనసేన, బీజేపీ అమరావతికే కట్టుబడి ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనన్నది సుస్పష్టమని.. అయితే ఆ నిర్ణయం 2014లో అప్పటి ప్రభుత్వం తీసేసుకుందని గుర్తుచేశారు.
''ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. తదుపరి ప్రభుత్వాలు దానిని ముందుకు తీసుకెళ్లాలి తప్ప.. మార్చడం కుదరదు. మార్చుకుంటూ పోతే ఈరోజు అమరావతి.. రేపు కర్నూలు, విశాఖ.. ఇలా అంతుండదు. మూడు రాజధానులనేది వంకర వాదన. మన దేశంలో ఎక్కడా లేదు. మన రాజధాని అమరావతే. ఎక్కడకూ పోదు'' అని చెప్పారు.
''అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదు. అయితే హైకోర్టు విషయంలో మాత్రం మాటివ్వలేను. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో పెట్టడానికి బీజేపీ సానుకూలంగా ఉంది. మమ్మల్ని అర్థం చేసుకోవాలి. జై అమరావతి అని నేననలేను. జై ఆంధ్రప్రదేశ్ అని అంటాను. జై అమరావతి అంటే.. వెంటనే జై అనంతపురం, జై కర్నూలు, జై వైజాగ్ అనాలని అక్కడి ప్రజలను రెచ్చగొడతారు'' అని పవన్ వ్యాఖ్యానించారు.
అలాగే.. ఈ నెల 2న నిర్వహించాల్సిన లాంగ్‌మార్చ్ వాయిదాకు కారణం ఢిల్లీ ఎన్నికలేనన్నారు. ''త్వరలో ఢిల్లీ నుంచి పెద్దలు వస్తారు. వారితో కలిసి లాంగ్‌మార్చ్ నిర్వహించి అమరావతిని పరిరక్షిస్తాం'' అని పేర్కొన్నారు.
''నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియదు.. నేను ఓట్ల కోసం రాలేదు. మీకు ఆసరాగా ఉండాలని వచ్చాను. రైతులు అమరావతి కోసం కాదు.. ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజలు హైదరాబాద్‌లో ఆస్తులు అమ్ముకుని అమరావతిలో భూములు కొనుగోలు చేసింది రియల్ ఎస్టేట్ కోసం కాదు. మా రాజధానిలో మేం నివాసం ఉండాలని కొన్నారు'' అని తెలిపారు.
''రాజధాని విషయంలో కేంద్రం తక్కువగా మాట్లాడొచ్చు. కానీ బీజేపీ మాట్లాడుతోంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ బాగా బలంగా మాట్లాడతారు. ఢిల్లీలో కొంతమంది పెద్దల మాటలు సందేహాలు కలిగిస్తాయి. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. మూడు రాజధానుల విషయంలో కేంద్రంతో మాట్లాడామని వైసీపీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. మూడు రాజధానులకు అంగీకారం తెలుపుతూ ప్రధాని ఏమైనా లేఖ పంపారా..? పంపితే చూపాలని వైసీపీ వాళ్లను ప్రశ్నించండి. రాజధాని విషయంలో ప్రధానిని, అమిత్‌షాను అపార్థం చేసుకోవద్దు'' అని పవన్ కల్యాణ్ కోరారు.
మూడు రాజధానులకు మా అనుమతి లేదు: బీజేపీ జాతీయ కార్యదర్శి దేవ్‌ధర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని, అదే రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ స్పష్టంచేసినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. దేవ్‌ధర్ శనివారం విశాఖలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను మా అనుమతితోనే, మాతో చర్చించిన తర్వాతే ఏర్పాటుచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ప్రధాని నరేంద్రమోదీ నుంచి కానీ, అమిత్‌షా నుంచి కానీ ఆయన (వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి) ఏమైనా లేఖలు తీసుకుని ఉంటే వాటిని చూపించాలి’’ అని పేర్కొన్నారు.
‘‘ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేం ముందునుంచీ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం తప్ప మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని చెప్పలేదు’’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఆ రెండు పార్టీలూ బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులని, వాటిపైనే తాము పోరాడుతున్నామని చెప్పారు.
అసమ్మతి దేశద్రోహం కాదు: జస్టిస్ చంద్రచూడ్
అసమ్మతి దేశద్రోహం కాదని, అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం వంటిదని.. అసమ్మతివాదులపై జాతివ్యతిరేకులుగా ముద్రవేయడం రాజ్యాంగ విలువలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిచేయడంతో సమానమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన 'జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక 15వ ఉపన్యాస' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'ద హ్యూస్ దట్ మేక్ ఇండియా: ఫ్రం ప్లూరాలిటీ టు ప్లూరలిజం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే గొంతుకలను బలవంతంగా మూయించడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలోనే జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
సీఏఏ నిరసనల్లో ఆస్తుల విధ్వంసానికి సంబంధించి యూపీ సర్కారు ఆందోళనకారుల నుంచి సొమ్ము రికవరీ చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న ధర్మాసనంలో చంద్రచూడ్ భాగస్వామి.
‘‘అసమ్మతిని అణచివేయడం అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికపరంగా, సామాజికంగా అభివృద్ధిని అడ్డుకోవడమే. ప్రశ్నించేతత్వాన్ని, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భయాన్ని సృష్టించడం, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అసమ్మతివాదులపై ఏకపక్షంగా దేశద్రోహులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్రవేయడం అనేది రాజ్యాంగ విలువలను కాపాడుతామన్న మన నిబద్ధతపై దాడిచేయమే. ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించినట్టే’’ అని స్పష్టంచేశారు.
‘‘ప్రజాస్వామ్య వ్యవస్థకు చర్చలు, భిన్న వాదనలే ప్రాణం. దేశంలోని ప్రతి వ్యక్తి తన వాదనను స్వేచ్ఛగా, బలంగా వినిపించే వాతావరణాన్ని కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. ఆదర్శవంతమైన సమాజం మైనార్టీ వర్గాల అభిప్రాయానికి విలువ ఇస్తుంది. భిన్న వాదనలకు రాజ్యాంగబద్ధత ఉన్నది. దీనికి పరిరక్షించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి’’ అని ఆయన వివరించారు.
ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే నోళ్లను బలవంతంగా మూయించడం, అసమ్మతిని అణచివేయడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తాయన్నారు. మన దేశంలో బహుళత్వం అనే భావన.. భిన్న రాష్ర్టాలు, జాతులు, భాషలు, నమ్మకాల సమ్మేళనం అన్నదానిని, వాటిని పరిరక్షించే నిబద్ధతను నొక్కి చెప్తుంది.
‘‘దేశం అనే భావనపై ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ గుత్తాధిపత్యాన్ని పొందలేదు. హిందూ దేశం లేదా ముస్లిం దేశం అన్న భావనను మన రాజ్యాంగ నిర్మాతలు తిరస్కరించారు. వారు మన దేశాన్ని 'గణతంత్ర రాజ్యం'గా మాత్రమే నిర్వచించారు. భారతీయతకు సజాతీయత అనేది నిర్వచనం కాదు. మన వైవిధ్యం మన బలహీనత కాదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు.
హైదరాబాద్‌లో వాలెంటైన్స్ డే విధ్వంసం: భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్
వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు.
పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది
- భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
- అంటార్కిటికాలో 20.75 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రతలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)