రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేస్తాడా?

ప్రచురణ

భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట 58 ఓవర్లే జరిగింది.

రాంచీలో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వెలుతురు సరిగా లేక అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.

ఆట ఆగిపోయే సమయానికి రోహిత్ శర్మ 117, అజింక్య రహానే 83 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఈ ఇద్దరూ ఇప్పటివరకూ నాలుగో వికెట్‌కు 185 పరుగులు జోడించారు.

అంతకు ముందు భారత్ బ్యాటింగ్ చాలా ఘోరంగా మొదలైంది. 39 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది.

మయంక్ అగ్రవాల్ 10 పరుగులకు రబాడా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా, చతేశ్వర్ పుజారా కూడా రబాడా బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఎన్రిక్ నార్ట్‌జేకు ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

ఆ తర్వాత రోహిత్ శర్మ, అజింక్య రహానే భారత జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యం అందించారు.

రోహిత్ పేరిట మరో రెండు...

రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో తన మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఈ స్కోరును అతడు భారీ స్కోరుగా మలచాల్సి ఉంటుంది. మొత్తం మీద రోహిత్‌కు టెస్ట్ కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ.

ఈ సెంచరీతో రోహిత్ శర్మ మరో ఘనత అందుకున్నాడు. భారత మాజీ ఓపెనర్ సునీల్ గాస్కర్ తర్వాత ఒక ఓపెనర్ ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి.

రోహిత్ శర్మ తన 117 పరుగుల ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. వీటితో కలిపి ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ అతడు 17 సిక్సర్లు కొట్టాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ శర్మకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ ఎస్.హెట్‌మెయర్ పేరుతో ఉండేది. అతడు 2018-19 బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో 15 సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)